
న్యూయార్క్ చేరుకున్నప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం న్యూయార్క్ కు చేరుకున్నారు.
అమెరికా: భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం న్యూయార్క్ కు చేరుకున్నారు. అమెరికాలో ఐదు రోజుల పర్యటన కోసం ఆయన గురువారం బయలుదేరి వెళ్లారు. ఎయిర్‌ఇండియా ప్రత్యేక విమానంలో వెళ్లిన ప్రధాని.. రాత్రికి ఫ్రాంక్‌ఫర్ట్‌లో బస చేసి ఈరోజు న్యూయార్క్ చేరుకున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు చేర్చడమే లక్ష్యంగా మోదీ పర్యటన సాగనుంది. అమెరికాతో వాణిజ్యానికి తలుపులు తెరిచే ఉంచినట్లు ఆయన ఇప్పటికే పలుమార్లు సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారం, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు చర్యలు, ఆఫ్రికాలో ఎబోలా వైరస్ వ్యాప్తి, వాతావరణ మార్పులు, పేదరిక నిర్మూలన వంటి పలు అంశాలను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మోదీ చర్చించే అవకాశం ఉంది.