
కొత్త అధ్యాయంపై కోటి ఆశలు
భారత్-అమెరికా సంబంధాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించడానికి ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమానికి తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు.
* ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా
* అమెరికాకు ప్రధాని మోదీ
* ఐదు రోజుల పర్యటనలో మోదీ బిజీ షెడ్యూల్
న్యూఢిల్లీ: భారత్-అమెరికా సంబంధాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించడానికి ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమానికి తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అమెరికాలో ఐదు రోజుల పర్యటన కోసం ఆయన గురువారం బయలుదేరి వెళ్లారు. ఎయిర్‌ఇండియా ప్రత్యేక విమానంలో వెళ్లిన ప్రధాని.. రాత్రికి ఫ్రాంక్‌ఫర్ట్‌లో బస చేసి శుక్రవారం నాడు న్యూయార్క్ చేరుకుంటారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు చేర్చడమే లక్ష్యంగా మోదీ పర్యటన సాగనుంది. అమెరికాతో వాణిజ్యానికి తలుపులు తెరిచే ఉంచినట్లు ఆయన ఇప్పటికే పలుమార్లు సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ దిశగానే తన పర్యటనను సద్వినియోగం చేసుకునేందుకు మోదీ ప్రయత్నించనున్నారు. విమానంలో బయలుదేరే ముందు ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇరు దేశాల ప్రయోజనాల మేరకు ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఒబామాతో చర్చించనున్నట్లు అందులో పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో అమెరికా కీలక భాగస్వామిగా ఉంటుందని... విద్య, పరిశోధన, టెక్నాలజీ, తదితర అంశాల్లో ఇరు దేశాలు సహకరించుకునేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని మోదీ అభిప్రాయపడ్డారు.
29న ఒబామాతో విందు: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సమావేశమయ్యేందుకు ప్రధాని మోదీ ఆసక్తి చూపుతున్నారు. వాషింగ్టన్‌లోని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్‌లో 29న మోదీకి ఒబామా విందు ఏర్పాటు చేశారు. దుర్గా నవరాత్రి పర్వదినాల నేపథ్యంలో ఉపవాసం ఉంటున్న మోదీ.. తన పర్యటన మొత్తం కేవలం చాయ్, పండ్లు, నిమ్మరసం మాత్రమే తీసుకుంటారు. ఒబామా ఇచ్చే విందులోనూ ఇదే ఆయన మెనూ. ఆ మరునాడే ఇరువురి మధ్య శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఇక శనివారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ఇదే ఆయన తొలి అంతర్జాతీయ ప్రసంగం కానుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారం, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు చర్యలు, ఆఫ్రికాలో ఎబోలా వైరస్ వ్యాప్తి, వాతావరణ మార్పులు, పేదరిక నిర్మూలన వంటి పలు అంశాలను మోదీ ప్రస్తావించనున్నారు.