ప్రపంచం గర్వించేలా ‘మెట్రో’ నిర్మాణం: తలసాని | Sakshi
Sakshi News home page

ప్రపంచం గర్వించేలా ‘మెట్రో’ నిర్మాణం: తలసాని

Published Sun, Sep 27 2015 2:15 AM

ప్రపంచం గర్వించేలా ‘మెట్రో’ నిర్మాణం: తలసాని - Sakshi

హైదరాబాద్: ప్రపంచంలోని స్టేషన్లకు దీటుగా హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లను తీర్చిదిద్దనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సంవత్సర కాలంలో పూర్తి చేసేందుకు పనులు వేగవంతం చేశామన్నారు. శనివారం మెట్రో హరితహారంలో భాగంగా మంత్రి పద్మారావుతో కలసి ఉప్పల్ స్టేషన్‌లో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో 72 కిలోమీటర్ల మేర 63 స్టేషన్లను నిర్మిస్తున్నామన్నారు. సాధ్యమైనంత త్వరలో మెట్రో రైళ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
 
 మెట్రో ఎండీ ఎన్‌వీఎస్.రెడ్డి మాట్లాడుతూ మొత్తం 57 రైళ్లను తీసుకొస్తున్నామని అందులో 30 వరకు ఇప్పటికే వచ్చాయని తెలిపారు. మెట్రో స్టేషన్‌లతో పాటు పరిసర కాలనీల్లో కూడా పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు, ఇప్పటికే ఎల్‌బీనగర్, ఉప్పల్, నాగోల్, గచ్చిబౌలి తదితర ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఉప్పల్‌ను ప్రధాన హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్, రైతు సంఘం నాయకులు దుబ్బ నర్సింహారెడ్డి, మేకల హన్మంత్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, ధర్మారెడ్డి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement