పాలనే గెలిపిస్తుంది

పాలనే గెలిపిస్తుంది - Sakshi


వరంగల్ ఉపఎన్నికపై సమీక్షలో సీఎం కేసీఆర్

* అభ్యర్థి ఎవరైనా గెలుపు మనదే.. ప్రజలు మన వెంటే ఉన్నారు

* ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకువెళ్లండి

* మనం గెలవడానికి కరెంటు ఒక్కటి చాలు...  ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా విద్యుత్ ఇస్తున్నాం

* సర్వేలో మనకు 55 శాతం అనుకూలంగా వచ్చింది

* ఎవరూ నారాజు కావొద్దు.. అందరికీ అవకాశాలు వస్తాయి

* ఉప ఎన్నికల తర్వాత నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తాం

* పార్టీ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ

 

 సాక్షి, హైదరాబాద్:

 'వరంగల్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి గురించి మరచిపోండి. అభ్యర్థి ఎవరైనా మన పార్టీ గెలుస్తుంది. గడచిన పదహారు నెలల పాలనే మనల్ని గెలిపిస్తుంది' అని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ నేతలతో అన్నారు. 'మేనిఫెస్టోలో ఇవ్వని ఎన్నో హామీలను అమలు చేశాం. ప్రజలు మన వెంటే ఉన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. కిందటిసారి కంటే ఎక్కువ మెజారిటీ రావాలి. సర్వేలు కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి. సర్వేలో 55 శాతం మనకు అనుకూలంగా ఉన్నారని ఫలితం వచ్చింది. మనం చేసిన కార్యక్రమాలు.. ముఖ్యంగా ఒక్క విద్యుత్ అంశం చాలు మనం గెలవడానికి. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా కరెంటు ఇస్తున్నాం. అంతా కలసి గెలిపించాలి' అని సీఎం అన్నట్టు తెలిసింది.


గురువారం తెలంగాణ భవన్‌లో వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులతో కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు గంటసేపు జరిగిన సమావేశంలో పార్టీ నేతలకు సీఎం కర్తవ్య బోధ చేశారు. పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఉప ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధిస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. టికెట్ ఆశిస్తున్న వారందరినీ ప్రత్యేకంగా దగ్గరకు పిలుచుకుని మాట్లాడారు. 'రాజకీయాల్లో ఓపిక ఉండాలి. అవకాశం వచ్చే దాకా ఎదురు చూడాలి. లేదంటే డాక్టర్ పరమేశ్వర్‌కు ఎదురైన పరిస్థితి వస్తది. ఆయన మనతోనే ఉండి ఉంటే.. ఇవ్వాళ ఆయనొక్కడి పేరే పరిశీలనలో ఉండేది. టికెట్ ఎవరికి వచ్చినా అంతా కలిసి పనిచేయండి' అని వారికి సూచించారు. ఆశావహులు ఎందరున్నా టికెట్ ఒకరికి మాత్రమే ఇవ్వగలుగుతామని, మిగిలిన వారికీ ఏదో ఒక అవకాశం వస్తుందని వారితో పేర్కొన్నారు.




 ఎన్నిక కోసం నామినేటెడ్ నియామకాలు వాయిదా

 వరంగల్ ఉప ఎన్నిక వల్లే నామినేటెడ్ పోస్టుల భర్తీని వాయిదా వేశామని, ఎన్నిక పూర్తి కాగానే నియామకాలు చేపడతామని కేసీఆర్ పార్టీ నేతలకు హామీనిచ్చారు. 'ముందు నుంచీ పార్టీలో ఉన్నవారు, ఇప్పటికీ కొనసాగుతున్న వారు కొద్దిమందిమే మిగిలాం. టికెట్ రానంత మాత్రాన నారాజు కావొద్దు, అందరికీ పదవులు దక్కుతాయి..'అని భరోసా ఇచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పార్లమెంట్ అంటే ఆషామాషీ కాదని, తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లిషు భాషలు వచ్చి ఉండాలని, చట్టం తెలిసిన వారు కూడా అయి ఉండాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో స్థానికేతరుడిని అభ్యర్థిగా పెట్టబోమని స్పష్టంచేసినట్లు తెలిసింది. 'టీడీపీ పని అయిపోయింది. బీజేపీకి బలం లేదు. కాంగ్రెస్‌కు అభ్యర్థే దొరకడం లేదు. గత మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ వచ్చేలా పనిచేయండి..'అని కేసీఆర్ సమావేశంలో పేర్కొన్నట్లు సమాచారం.

 గుండు చేరికపైనా చర్చ

 టీడీపీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి పార్టీలో చేరే అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. 'ఆమె మన పార్టీలో చేరుతానని కలిసింది. రెండు మూడ్రోజుల్లో ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. ఎమ్మెల్యే కొండా సురేఖతో కూడా మాట్లాడాతా. ఆమెకు ఏ కమిట్‌మెంట్ ఇవ్వలేదు. పదవులు రాకుండా పోతాయేమోనని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు' అని సీఎం అన్నట్టు సమాచారం.

 

గుడిమల్ల పేరు ఖరారు?

వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పార్టీ నేత, అడ్వొకేట్ గుడిమల్ల రవికుమార్ పేరు దాదాపు ఖాయమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి అనూహ్యంగా దాదాపు 14 మంది టికెట్ ఆశించారు. వీరందరినీ సీఎం ఆధ్వర్యంలో గురువారం జరిగిన సమావేశానికి ఆహ్వానించారు. మొదట్నుంచీ టికెట్ ఆశిస్తున్న ఎర్రోళ్ల శ్రీనివాస్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. శుక్రవారం మంచి రోజైనందున టీఆర్‌ఎస్ అభ్యర్థి పేరును ప్రకటించనున్నారు. చివరి నిమిషంలో ఏమైనా అనూహ్య మార్పులు జరిగితే తప్ప గుడిమల్ల అభ్యర్థిత్వం ఖరారైనట్లేని సమాచారం. ఆయన అభ్యర్థిత్వానికి సాంకేతిక సమస్యలు ఉన్నాయన్న చర్చ కూడా జరిగినట్లు సమాచారం. మరోసారి నిపుణుల సలహా కూడా తీసుకుందామని, గుడిమల్ల 'కులం' సమస్యపై సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఎక్కడా రవికుమార్ పేరు ప్రస్తావించకుండానే, ఆయనే దాదాపు అభ్యర్థి అన్న తరహాలో సీఎం మాట్లాడారని వినికిడి.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top