
గ్రీన్‌కార్డుకు ప్రతిభే గీటురాయి
ప్రతిపాదిత రైజ్ బిల్లు అమెరికా ఉభయసభల్లో గట్టెక్కితే... గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు, డాలర్స్ డ్రీమ్స్‌తో ఇప్పటికే అమెరికా గడ్డపై ఉన్న తెలుగు టెకీలకు వరం కానుంది.
♦ దరఖాస్తు చేయాలంటే కనీస అర్హత 30 పాయింట్లు
♦ అమెరికాలో ఉన్నత విద్యకు, అధిక వేతనానికి ప్రాధాన్యం
ప్రతిపాదిత రైజ్ బిల్లు అమెరికా ఉభయసభల్లో గట్టెక్కితే... గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు, డాలర్స్ డ్రీమ్స్‌తో ఇప్పటికే అమెరికా గడ్డపై ఉన్న తెలుగు టెకీలకు వరం కానుంది. గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు 12 ఏళ్లకుపైగా వేచి ఉండాల్సి వస్తోంది. కొత్త విధానంతో భారతీయులకు వీలైనంత త్వరగా గ్రీన్‌కార్డులు జారీ అవుతాయని భావిస్తున్నారు.
ఏం జరిగింది: సీనియారిటీ ఆధారంగా కాకుండా.. ప్రతిభ ఆధారంగా గ్రీన్‌కార్డు మం జూరు చేసే బిల్లును సెనెటర్లు టామ్ కాటన్, డేవిడ్ పెర్‌డ్యూ రూపొందించారు. దీనికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మద్దతు పలికారు. ఈ బిల్లు ప్రతినిధుల సభ, సెనేట్‌ల ఆమోదం పొందితే ట్రంప్ సంతకంతో చట్టంగా మారుతుంది. ఆ తర్వాత... తదుపరి ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది.
ప్రతిభ ఆధారితంగా అంటే...
చదువు, వయసు, ఆంగ్ల ప్రావీణ్యం, జీతం ఆధారంగా పాయింట్లను కేటాయిస్తారు. గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 30 పాయింట్లను అర్హతగా నిర్ణయించారు. పాయింట్లు అధికంగా ఉన్నవారికే గ్రీన్‌కార్డులు కేటాయిస్తారు.
బిల్లు ఉద్దేశమేంటి: తక్కువ నైపుణ్యాలు, తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వారికి గ్రీన్‌కార్డులు లభిస్తే... అమెరికన్ల ఉద్యోగావకాశాలను కొల్లగొడతారు. కాబట్టి దీన్ని నిరోధించాలి. అత్యంత ప్రతిభా వంతులు మాత్రమే అమెరికాకు వలస వస్తే... అది ఆ దేశానికి మేలు. మేధోపరంగా, ఆర్థికంగా అమెరికాకు లాభిస్తుంది. ప్రతి ఏటా 10 లక్షల గ్రీన్‌కార్డుల్ని అమెరికా మంజూరు చేస్తోంది. ఈ సంఖ్యను 2027 కల్లా 5 లక్షలకు కుదించాలి. డిపెండెంట్ గ్రీన్‌కార్డుల వల్ల వలసలు పెరుగుతున్నాయని అమెరికా భావిస్తోంది. అందుకే తల్లిదండ్రులు, తోబుట్టువులు, మేజర్ పిల్లలూ డిపెండెంట్ గ్రీన్‌కార్డులకు అనర్హులుగా చేర్చారు. ఆరోగ్య సమస్యలుంటే తల్లిదండ్రులకు తాత్కాలిక వీసాలు మంజూరు చేస్తారు.
గ్రీన్‌కార్డు వస్తే చాలు: అమెరికాకు హెచ్–1బీ వీసా లేదా మరో ఉద్యోగవీసాపై వెళ్లినవారు... ఆ దేశంలో స్థిరపడాలనుకుంటే మొదట శాశ్వత నివాసితుడి హోదా (గ్రీన్‌కార్డు) పొందాలి. గ్రీన్‌కార్డు వస్తే... ఇక వీసాతో పని ఉండదు. వీసా రెన్యువల్‌తో పనిలేకుండా శాశ్వత నివాసితుడి హోదాలో ఉద్యోగం చేసుకోవచ్చు. గ్రీన్‌కార్డు వచ్చిన ఐదేళ్లకు అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రీన్‌కార్డు లేదా పౌరసత్వం ఉన్నవాళ్లు తమ కుటుంబసభ్యులకు గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏటా 4,80,000 మందికి డిపెండెంట్ విభాగంలో గ్రీన్‌కార్డులు ఇస్తారు.
అలాగే శాశ్వత ఉద్యోగుల కోటాలో ఏటా 1,40,000 గ్రీన్‌కార్డులు మంజూరు చేస్తారు. వీటికి మనం పనిచేస్తున్న సంస్థ ధ్రువీకరణతో దరఖాస్తు చేయాలి. డిపెండెంట్ గ్రీన్‌కార్డుల్లో ఏ ఒక్క దేశానికైనా మొత్తం కార్డుల సంఖ్యలో ఏడు శాతానికి మించి ఇవ్వడానికి లేదు. అలాగే ఉద్యోగుల కోటా గ్రీన్‌కార్డుల్లో ఏ ఒక్క దేశానికైనా మొత్తం కార్డుల్లో రెండు శాతానికి మించి ఇవ్వకూడదనే నిబంధన ఉంది. అమెరికాలో భారత టెకీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఏడాదికి ఒక దేశానికి (ఆ దేశ పౌరులకు) జారీచేసే గ్రీన్‌కార్డులపై పరిమితి ఉన్నందున భారతీయుల దరఖాస్తులు భారీగా పోగుపడుతున్నాయి.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్