అమెరికా వీసా, గ్రీన్‌కార్డులపై మరో మెలిక.. బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన ట్రంప్‌! | USA To Deny Visas And Green Cards Over Social Media Posts | Sakshi
Sakshi News home page

అమెరికా వీసా, గ్రీన్‌కార్డులపై మరో మెలిక.. బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన ట్రంప్‌!

Apr 10 2025 8:13 AM | Updated on Apr 10 2025 8:55 AM

USA To Deny Visas And Green Cards Over Social Media Posts

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. రోజుకో ట్విస్ట్‌ ఇస్తున్నారు. వీలైనంత మంది విదేశీయులను అమెరికా నుంచి పంపించి వేయడమే లక్ష్యంగా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా వీసా, పర్మినెంట్ రెసిడెన్సీ(గ్రీన్ కార్డు)లపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. ఇక, తాజాగా యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) అధికారికంగా సంచలన ప్రకటన చేసింది. సోషల్ మీడియా వేదికగా యూదులకు వ్యతిరేకంగా ఎవరైనా కామెంట్స్‌ చేసినా, పోస్టులు పెట్టినా వారికి వీసా లేదా గ్రీన్ కార్డును తిరస్కరించవచ్చని లేదా ఇప్పటికే జారీ చేసిన వీసాను రద్దు చేయవచ్చని బాంబు పేల్చింది.

అమెరికాలోని ట్రంప్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్‌ మీడియాలో పెట్టే పోస్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అమెరికా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలుగా గుర్తించిన కొన్ని గ్రూపులకు మద్దతు ఇస్తున్న వారిని గుర్తించే పనిలో ఉన్నట్టు యూఎస్సీఐఎస్ తెలిపింది. ఈ క్రమంలో సదరు గ్రూపులకు ఎవరైనా మద్దతు తెలిపినా, సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినా.. వీసా లేదా గ్రీన్ కార్డును తిరస్కరించవచ్చని తెలిపింది. కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నట్లు తేలితే సోషల్ మీడియా కంటెంట్‌ను ప్రతికూలంగా పరిగణిస్తామని హచ్చరికలు జారీ చేసింది. అలాగే, హమాస్, హిజ్బుల్లా, హౌతీ తిరుగుబాటు సానుభూతిపరులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఈ సంస్థలను అమెరికా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది. ఇదే సమయంలో ఒక విదేశీయుడు ఉగ్రవాదం, ఉగ్రవాద సంస్థలు, ఇతర వ్యతిరేక

వీసా, గ్రీన్ కార్డ్ రద్దు.. 
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద మద్దతుదారులకు అమెరికాలో చోటు లేదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) పబ్లిక్ అఫైర్స్ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్లౌగ్లిన్ తెలిపారు. వారు తమ దేశంలోకి రానివ్వాల్సిన, ఇక్కడ ఉండాల్సిన బాధ్యత లేదని స్పష్టం చేశారు. స్టూడెంట్ వీసాలు, గ్రీన్ కార్డులపై ఈ ప్రభావం తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. స్టూడెంట్ వీసాలు (ఎఫ్ -1, జే-1 మొదలైనవి), గ్రీన్ కార్డు దరఖాస్తులు, వర్క్ పర్మిట్లు, వీసా పొడిగింపులతో సహా అన్ని కేసులపై ఇది ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో 300 మందికి పైగా వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో స్వయంగా గత కొన్ని వారాల్లో అంగీకరించిన తర్వాత ఈ విధానం వచ్చింది.

ఇదిలా ఉండగా.. అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థుల ఆశలను ట్రంప్‌ సర్కారు చిదిమేస్తోంది. ఏడాది, రెండేళ్ల కిందటి చిన్న చిన్న తప్పులను ఎత్తి చూపిస్తూ వీసాలు రద్దు చేస్తోంది. తక్షణం దేశం విడిచి వెళ్లాలంటోంది. స్వచ్ఛందంగా వెళ్లకపోతే బలవంతంగా పంపించాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది.

వీసా రద్దయితే అక్రమంగా ఉంటున్నట్లే..
అధిక వేగంతో వాహనాలు నడిపిన పలువురు విద్యార్థులకు వీసా రద్దు చేస్తూ ఇటీవల నోటీసులు అందాయి. సాధారణంగా ఈ తరహా నేరాలపై న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది. అధికశాతం కేసులు కొట్టేస్తారు. అయితే కోర్టులో కేసులు నడుస్తున్న వారికి కూడా వీసా రద్దు చేస్తూ నోటీసులు ఇచ్చారు. వీసా రద్దయితే వీరు అక్రమంగా అమెరికాలో ఉంటున్నారనే లెక్కలోకి వస్తుంది. అమెరికాలోకి అడుగుపెట్టే సమయంలోనే ప్రతి ఒక్కరి వేలిముద్రలు తీసుకుంటారు. ఏదైనా కేసులో అరెస్టు అయితే ఆ సమయంలోనూ వేలిముద్రలు తీసుకుంటారు. వాటి ఆధారంగానే వీసా రద్దు చేస్తూ వెంటనే దేశం వీడాలని తాఖీదులు జారీ చేశారు. దీనికి ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.

గతంలో ఇలాంటి చిన్న చిన్న నేరాల్లో ప్రమేయం ఉంటే ఇంతటి తీవ్ర చర్యలు ఉండేవి కావు. చదువుకోవడానికి, ఓపీటీపై పనిచేయడానికి, హెచ్‌1బీపై ఉద్యోగం చేయడానికి.. అంటే గడువు వరకు అమెరికాలో ఉండటానికి ఎలాంటి ఇబ్బందీ ఉండేది కాదు. ఇప్పుడు అమెరికాలో ఉండేందుకు వీలు లేకుండా ఏకంగా స్టేటస్‌ రద్దు చేసి బయటకు వెళ్లిపోవాలంటూ మెయిల్స్‌ పంపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement