భారీగా పడిన బంగారం డిమాండ్ | Indian gold demand hit as govt rules bite | Sakshi
Sakshi News home page

భారీగా పడిన బంగారం డిమాండ్

Nov 15 2013 2:21 AM | Updated on Sep 2 2017 12:36 AM

భారీగా పడిన బంగారం డిమాండ్

భారీగా పడిన బంగారం డిమాండ్

బంగారం డిమాండ్ ప్రపంచ వ్యాప్తంగా 2013 సెప్టెంబర్‌తో ముగిసిన మూడవ క్వార్టర్‌లో భారీగా 21 శాతం పడిపోయింది.

ముంబై: బంగారం డిమాండ్ ప్రపంచ వ్యాప్తంగా  2013 సెప్టెంబర్‌తో ముగిసిన మూడవ క్వార్టర్‌లో భారీగా 21 శాతం పడిపోయింది. ఈ డిమాండ్ 860 టన్నులకు పరిమితం అయ్యింది. భారత్‌లో 32 శాతం పడిపోయి 148 టన్నులుగా (2012 మూడవ క్వార్టర్ డిమాండ్ 219 టన్నులు) నమోదయ్యింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తాజా గణాంకాలు ఈ అంశాలను వెల్లడించాయి. డబ్ల్యూజీసీ ఎండీ (ఇన్వెస్ట్‌మెంట్) మార్కస్ గ్రాబ్ వెల్లడించిన వివరాలు... 

  • కరెంట్ అకౌంట్ లోటు కట్టడి దిశలో భారత్ ప్రభుత్వం బంగారం దిగుమతుల కట్టడికి తీసుకున్న పలు చర్యలు మొత్తంగా డిమాండ్ తగ్గడానికి ప్రధాన కారణం. భారత్ బంగారం డిమాండ్ రెండవ క్వార్టర్‌లో 310 టన్నులుకాగా, ఇది మూడవ క్వార్టర్‌లో 52% పడిపోయి 148 టన్నులుగా నమోదయ్యింది.
  •  ఈటీఎఫ్‌ల అవుట్‌ఫ్లోస్ తక్కువగా ఉండడం పరిశ్రమలకు కొంత ఊరట కలిగించే అంశం. 2013 రెండవ క్వార్టర్‌లో ఈ అవుట్‌ఫ్లోస్ 402 టన్నులు కాగా, మూడవ క్వార్టర్‌లో ఇవి 119 టన్నులు మాత్రమే.
  •   గ్లోబల్ రీసైక్లింగ్ విభాగం సైతం  3వ క్వార్టర్‌లో 2012 ఇదే క్వార్టర్‌తో పోల్చితే 11 శాతం పడిపోయింది. అయితే భారత్‌లో ఇదే విభాగం ఐదు రెట్లు పెరిగి 61 టన్నులకు చేరింది.
  • 2012 చివరి క్వార్టర్‌తో పోల్చితే 2013 చివరి క్వార్టర్‌లోనూ బంగారం డిమాండ్ తగ్గే అవకాశాలే కనిపిస్తున్నాయి. అయితే మూడవ క్వార్టర్ (జూలై-సెప్టెంబర్)తో పోల్చితే ‘సీజనల్ కారణాల రీత్యా’ డిమాండ్ కొంత మెరుగుపడవచ్చు.
  • 2012 మూడవ క్వార్టర్‌తో పోల్చితే 2013 మూడవ క్వార్టర్‌లో భారత్‌లో మొత్తం ఆభరణాల డిమాండ్ 23 శాతం తగ్గి 136.1 టన్నుల నుంచి 104.7 టన్నులకు పడింది.  విలువ రూపంలో ఇది రూ.39,880 కోట్ల నుంచి రూ.27,749 కోట్లకు తగ్గింది.
  •  పెట్టుబడుల విభాగం డిమాండ్ 48 శాతం తగ్గి 83 టన్నుల నుంచి 43.5 టన్నులకు పడిపోయింది. విలువ రూపంలో ఇది రూ.24,320 కోట్ల నుంచి రూ. 11,529 కోట్లకు పడింది.

దిగుమతుల సుంకం మరింత తగ్గింపు...
 దేశంలో 10 శాతం కస్టమ్స్ సుంకాల విధింపునకు ప్రాతిపదిక అయిన పసిడి దిగుమతుల టారిఫ్ విలువను వరుసగా రెండవరోజు గురువారం కూడా ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ స్వల్పంగా తగ్గించింది. ఈ విలువను 10 గ్రాములకు 417 డాలర్ల నుంచి 414 డాలర్లకు కుదించింది. వెండికి సంబంధించి కూడా ఈ విలువను కేజీకి 738 డాలర్ల నుంచి 672 డాలర్లకు తగ్గించింది. అంతర్జాతీయంగా ధర దిగువముఖ ధోరణి నేపథ్యంలో బోర్డ్ ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement