హుదూద్ తుపాను ప్రభావం మరో 3 రోజులు తీవ్రంగా ఉండనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
సాక్షి, న్యూఢిల్లీ: హుదూద్ తుపాను ప్రభావం మరో 3 రోజులు తీవ్రంగా ఉండనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావం ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతోపాటు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలపై అధికంగా ఉంటుందని భారత వాతావరణశాఖ డెరైక్టర్ జనరల్ ఎల్‌ఎస్ రాథోడ్ ఆదివారం తెలిపారు. విశాఖపట్నం వద్ద తుపాను తీరం దాటినందున తీవ్రత మరింత ఎక్కువ ఉంటుందన్నారు.
గంటకు 70 నుంచి 80 కి.మీ. వేగంతో గాలులు వీయవచ్చన్నారు. తుపాను తీరం దాటాక మొదటి ఆరు గంటల్లో గాలుల తీవ్రత 50 శాతం తగ్గుతుందని, తర్వాతి ఆరు గంటల్లో మరో 50 శాతం వరకు తగ్గుతుందని తెలిపారు. వరుసగా మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. తెలంగాణ జిల్లాలతోపాటు ఉత్తర భారతదేశంలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నారు.