తిరుగులేని హిల్లరీ.. ఆధిక్యమెంతో తెలుసా?

తిరుగులేని హిల్లరీ.. ఆధిక్యమెంతో తెలుసా? - Sakshi


సెయింట్ లూయిస్: అమెరికా అధ్యక్ష అభ్యర్థుల రెండో డిబేట్ లోనూ డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఆదివారం సెయింట్ లూయిస్ లో హోరాహోరీగా జరిగిన ఈ డిబేట్ లో అత్యధికమంది అమెరికా జనాలు హిల్లరీకే అండగా నిలిచారు. ఈ డిబేట్ లో హిల్లరీకి 57శాతం మంది మద్దతు పలుకగా.. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు 34శాతం మంది అండగా నిలిచారు.మొదటి డిబేట్ లోనూ ట్రంప్ పై హిల్లరీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించిన సంగతి తెలిసిందే. తొలి డిబేట్ లో హిల్లరీకి 62 శాతం మంది మద్దతు పలుకగా.. ట్రంప్ కు కేవలం 27శాతం మందే మద్దతిచ్చారు. తొలి డిబేట్ తో పోలిస్తే రెండో డిబేట్ లో హిల్లరీ ఆధిక్యం కొంత తగ్గినప్పటికీ.. ట్రంప్ పై స్పష్టమైన ఆధిక్యంతో ఆమె దూసుకుపోతున్నారు.సెయింట్ లూయిస్ లో జరిగిన రెండో డిబేట్ లో మహిళలపై ట్రంప్ చేసిన లైంగిక దుర్భాషలపై ప్రధానంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. మహిళల గురించి దారుణంగా లైంగిక వ్యాఖ్యలు చేసిన ట్రంప్ వీడియో వెలుగులోకి రావడంతో ఈ విషయంలో ఆయను తీరును హిల్లరీ తూర్పారబట్టారు. ఆయనకు మహిళలంటే ఏమాత్రం గౌరవం లేదని, ట్రంప్ కు అధ్యక్షుడయ్యే అర్హత లేదని విరుచుకుపడ్డారు. మరోవైపు ట్రంప్ కూడా హిల్లరీపై ఎదురుదాడి చేశారు. హిల్లరీ భర్త, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ మహిళలపై లైంగిక దాడులు జరిపారని ఆరోపించారు. ఆద్యంతం హోరాహోరీగా సాగిన రెండో డిబేట్ పై  ప్రజాభిప్రాయ సేకరణలో హిల్లరీకే అధిక మద్దతు లభించింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top