వరకట్న నిషేధ చట్టం దుర్వినియోగమవుతోందని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దీనికి సవరణలు చేయాలని కేంద్రం భావిస్తోంది.
దుర్వినియోగం చేసేవారిపై చట్టపరమైన చర్యలు
న్యూఢిల్లీ: వరకట్న నిషేధ చట్టం దుర్వినియోగమవుతోందని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దీనికి సవరణలు చేయాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా చట్టాన్ని దుర్వినియోగం చేసే వారికి చెక్ పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. తప్పుడు ఫిర్యాదులు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా మార్పులు చేయనుంది. ఈ మేరకు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. అలాగే ఈ చట్టం సమర్థవంతంగా అమలయ్యేలా వరకట్నం నిర్వచనాన్ని విస్తృతం చేయనుంది. వరకట్నాన్ని నిర్వచిస్తూ గతంలో పేర్కొన్న ‘పెళ్లి సందర్భంగా ఇచ్చిన కట్నం’ బదులు.. ‘పెళ్లికి ముందు ఇచ్చిన, పెళ్లి సమయంలో ఇచ్చిన, పెళ్లి తర్వాత ఇచ్చిన’ అని నిర్వచించనుంది. అలాగే సత్వర ఉపశమనం కోసం గృహ హింస చట్టంలోని కొన్ని నిబంధనలను వరకట్న వేధింపుల చట్టానికి ముడిపెట్టే ప్రతిపాదనా ఉందని అధికారులు చెప్పారు. పెళ్లి సమయంలో ఇచ్చిపుచ్చుకునే కానుకల వివరాలను జాబితాగా రూపొందించాలని, లే కపోతేపెళ్లికొడుకు, పెళ్లికూతురుతోపాటు వారి తల్లిదండ్రులకు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందన్నారు.
కట్నం కోసం యూపీలో మహిళ సజీవ దహనం
భదోహి(యూపీ): కట్నం కోసం ఓ మహిళను ఆమె భర్త, మామ కలసి సజీవ దహనం చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లా అరాయ్‌లో చోటు చేసుకుంది. సుమన(24)కు రెండేళ్లక్రితం కోలాహల్‌పూర్ వాసి సత్యనారాయణ్‌తో వివాహమైంది. అప్పటినుంచి కట్నం తెమ్మంటూ భర్త, అత్తమామలు వేధిస్తూ వచ్చారు. శనివారం ఆమెను భర్త సత్యనారాయణ్, అతని తండ్రి కలసి సజీవ దహనం చేశారు.