బర్త్‌డే బాసుకు.. బంగారం గిఫ్ట్‌

బర్త్‌డే బాసుకు.. బంగారం గిఫ్ట్‌


- పుట్టినరోజుకు కనీసం రెండు తులాల గొలుసు తేవాలట!

- గోల్డ్‌ కాకుంటే రూ.50 వేలు, అంతకన్నా విలువైన బహుమతి

- ఎస్సైలు, సీఐలకు ఎస్పీ టార్గెట్‌

- ఉన్నతాధికారులకు ఫిర్యాదులు
సాక్షి, హైదరాబాద్‌

‘‘రేపు సార్‌ పుట్టిన రోజు. స్పెషల్‌ గిఫ్ట్‌తో రావాలి. సార్‌ను ఆనందంలో ముంచేలా ఉండాలి. ఇందుకు బాగా ప్లాన్‌ చేసుకొని ఖరీౖదైన గిఫ్ట్‌ తీసుకురండి..’’

– ఇదీ ఓ జిల్లాలో పనిచేస్తున్న సబ్‌ ఇన్‌స్పెక్టర్లు/స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్లకు ఎస్పీ కార్యాలయం నుంచి అందిన వాట్సాప్‌  మెసేజ్‌! ఈ సందేశాన్ని చూసిన ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్లకు మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. ఎస్పీ పుట్టినరోజు అయితే తాము ఖరీదైన కానుకలు తేవడమేంటి? అవసరమైతే ఘనంగా పార్టీ ఇస్తే సరిపోతుందనిగానీ అనుకున్నారు. కానీ సదరు ఎస్పీ మూములోడు కాదని, ఎప్పుడు ఏ విషయంలో తమను బలిచేస్తాడోనన్న భయంతో ఆలోచనలో పడిపోయారు.సాదాసీదా గిఫ్ట్‌లు ఇష్టపడరట!

ఎస్పీ కార్యాలయం నుంచి మెసేజ్‌ అందిన తర్వాత కొందరు ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్లు ఎస్పీ దూతను సంప్రదించారు. అందుకు ‘‘సార్‌ సాదాసీదా గిఫ్ట్‌లు ఇష్టపడరు. ప్రతీ ఒక్క ఎస్సై/సీఐ కనీసం రెండు తులాల బంగారు గొలుసు గిఫ్ట్‌గా తీసుకురావాలి. లేకపోతే సార్‌ ఫీలవుతారు. ఆయన ఇబ్బంది పడితే మీరు కూడా ఇబ్బందిపడాల్సి ఉంటుంది..’’అని అవతలి వైపు నుంచి బెదిరింపుతో కూడిన సలహా వచ్చింది. ఇంకేముంది ఆ దూత చెప్పినట్టు బంగారు గొలుసు కోసం సిద్ధమయ్యారు. బంగారం ఇవ్వకపోతే కానుకగా రూ.50 వేలు లేదా అంతకుమించిన గిఫ్ట్‌ దూతకు అందించాలన్న హుకూం కూడా జారీ అయినట్టు ఆ జిల్లాలోని అన్ని ఠాణాల్లో చర్చ జరుగుతోంది. ఇవేవీ ఇవ్వకపోతే చార్జిమెమోలు, పీపీఐ(పోస్ట్‌పోన్‌ ఆఫ్‌ ఇంక్రిమెంట్‌), సెన్సూర్‌.. ఇలా ఏదో ఒక పనిష్మెంట్‌ ఇస్తాడన్న భయంతో అధికారులందరూ బంగారాన్ని బర్త్‌డ్‌గా కానుకగా అందించినట్టు తెలిసింది.అవాక్కయిన ఉన్నతాధికారులు

వరంగల్, కరీంనగర్‌ రేంజ్‌లో ఉన్న ఓ జిల్లా ఎస్పీ తన బర్త్‌డే వేడుకలకు ఇలా కానుకలు డిమాండ్‌ చేయడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. బర్త్‌డే వేడుకకు కానుకలు ఇవ్వకపోతే ఇబ్బంది పెడతారన్న భయంతో ఒక్కొక్కరు రెండు తులాల బంగారం కానుకగా ఇచ్చారని ఇంటెలిజెన్స్‌కు ఫిర్యాదులు అందాయి. సంబంధిత దూత నుంచి వెళ్లిన ఓ వాట్సాప్‌ మెసేజ్‌ నిఘా వర్గాలకు చేరినట్టు తెలిసింది. దీనిపై డీజీపీతోపాటు సంబంధిత ఉన్నతాధికారులు ఎస్పీ వ్యవహారంపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. బర్త్‌డే పార్టీకి బంగారం డిమాండ్‌ చేయడంపై ఐపీఎస్‌ అధికారులంతా అవాక్కయినట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఓ డీఐజీ(ప్రస్తుతం ఐజీ) ర్యాంక్‌ అధికారి కూతురు బర్త్‌డేకు ఇలాంటి డిమాండ్‌ పెట్టి ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యారు.మొదట్నుంచీ వివాదాస్పదుడే..

గ్రూప్‌–1 నుంచి ప్రమోషన్‌పై ఐపీఎస్‌ అయిన సంబంధిత అధికారి మొదట్నుంచీ వివాదాస్పదుడిగానే ముద్రపడ్డాడు. ఓ ఉమ్మడి కమిషనరేట్‌కు డీసీపీగా పనిచేసిన ఆయన.. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని శివారు జిల్లాకు ఎస్పీగా బదిలీ అయ్యాడు. సంబంధిత జిల్లా పరిధిలో ఎస్‌వోటీ అధికారులు ఓ రిసార్ట్‌పై దాడికి వెళ్లినప్పుడు ఎస్పీ పట్టుబడటం, ఆ తర్వాత విషయం బయటకు రాకుండా అక్కడ్నుంచి బదిలీ చేసి ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారు. ఇప్పుడీ బర్త్‌డే వేడుకల అంశంపై ఉన్నతాధికారులు ఏం చర్య తీసుకుంటారోనన్న చర్చ పోలీస్‌ శాఖలో సాగుతోంది.

Back to Top