
చదువు.. చదివించు
ఆంధ్రప్రదేశ్‌ను ఎడ్యుకేషన్, నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ది చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు
సాక్షి, విజయవాడ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ను ఎడ్యుకేషన్, నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ది చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. 2019-20 నాటికి రాష్ట్రంలో నూరు శాతం అక్షరాస్యత సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించామన్నారు. విజయవాడలో మంగళవారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంలో ఆయన మాట్లాడారు. చదువు సంస్కారాన్ని నేర్పుతుందని, సమాజంలో గౌరవాన్ని, మర్యాదనూ పెంచుతుందని తెలిపారు. చదువు అవసరాన్ని గుర్తించి అక్షరాలు నేర్చుకోవాలని, ఇతరులపై ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని మహిళలకు సూచించారు.
చదువుకొని ఇతరులను చదివించాలని కోరారు. డబ్బు కంటే విజ్ఞానం ఎంతో విలువైనదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ చదువుకొని విజ్ఞానవంతులు కావాలని పిలుపునిచ్చారు. అక్షరాస్యత విషయంలో ప్రస్తుతం దేశంలో 30వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను 2022 నాటికి మూడో స్థానంలో, 2029 నాటికి ప్రథమ స్థానంలో నిలుపుతామన్నారు. వయోజనుల కోసం అవసరమైతే సిలబస్‌లోనూ మార్పులు తెస్తామన్నారు. త్వరలో డ్వాక్రా సంఘాలకు రెండో విడత కింద రూ.7 వేల చొప్పున మాఫీ నిధులను విడుదల చేస్తామన్నారు. డ్వాక్రా మహిళల ఉత్పత్తుల కోసం సరికొత్త మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఆరోదశ అక్షరాస్యత కార్యక్రమాన్ని, ప్రత్యేక వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
15న పట్టిసీమ ప్రారంభం
పట్టిసీమ పథకాన్ని ఈ నెల 15న ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే జూలై నాటికి గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా పూర్తిగా కృష్ణాడెల్టాకు అందుతాయన్నారు. రాష్ట్రంలో ఇంకా 40 లక్షల మందికి గ్యాస్ సిలిండర్లు లేవని, వారందరికీ రెండేళ్లలో సిలిండర్లు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. విజయవాడలో మంగళవారం స్త్రీనిధి బ్యాంక్ తొలి సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న 80 లక్షల మంది డ్వాక్రా మహిళల వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదని, వీరంతా వ్యాపారం చేస్తే టాటా, బిర్లా కంపెనీల కంటే ఎక్కువ ఆదాయాన్ని సృష్టించవచ్చని చెప్పారు.
డ్వాక్రా బజార్‌లన్నింటినీ ఒక చైన్‌లా అభివృద్ధి చేస్తే పెద్ద కంపెనీలా మారుతుందన్నారు. 80 లక్షల మంది మహిళలు సగటున రూ.10 వేల ఆదాయం సంపాదించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. వచ్చిన ఆదాయంతో ఇంటి అవసరాలన్నింటినీ తీర్చే ప్రతి మహిళా ఒక ఆర్థిక మంత్రేనని చెప్పారు. డ్వాక్రా మహిళలు దూర విద్య ద్వారా చదువుకొనేందుకు అవసరమైతే సిలబస్‌ను మారుస్తామని అన్నారు.
డ్వాక్రా మహిళల పెట్టుబడి నిధి ప్రస్తుతం రూ.14 వేల కోట్లుందని, దీనికి ఐదు రెట్లు అంటే రూ.లక్ష కోట్ల రుణం తీసుకోవచ్చని, దానికి రెండింతలు అంటే రూ.రెండు లక్షల కోట్ల వ్యాపారానికి అవకాశం ఉందన్నారు. 2013-14 సంవత్సరానికి స్త్రీనిధి బ్యాంక్‌కు ప్రభుత్వం ఇచ్చిన రూ.68 కోట్లపై వచ్చిన రూ.3.88 కోట్ల డివిడెండ్ చెక్‌ను బ్యాంక్ ఎండీ సత్యనారాయణ సీఎంకు అందించగా ఆయన దాన్ని తిరిగి డ్వాక్రా సంఘాలకు ఇచ్చారు.
గృహనిర్మాణ శాఖపై సమీక్ష..
అన్ని వర్గాల వారికి నివాసయోగ్యమైన పక్కా గృహాల నిర్మాణానికి పబ్లిక్ హౌసింగ్ విధానాన్ని రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో గృహనిర్మాణ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన రియల్ వ్యాపారులు, కన్సల్టెంట్లను ఇందులో ప్రమేయం కల్పించాలన్నారు. ప్రి-ఫ్యాబ్రికేటెడ్ నమూనాలను ప్రయోగాత్మకంగా పరిశీలించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
మీ వైఫల్యం వల్లే తీరని కళంకం
ఎలుక ఘటనపై ముఖ్యమంత్రి అసహనం
ఒక్క శాఖ వైఫల్యం ప్రభుత్వానికి తీరని కళంకాన్ని తెచ్చిపెట్టిందని గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఎలుకలు కొరికి శిశువు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో వైద్యఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రైవేటు గొలుసు ఆస్పత్రులను నిర్వహించే ఒక్కో సంస్థ 50కిపైగా ఆస్పత్రులను విజయవంతంగా నిర్వహిస్తున్నప్పుడు ఇంత పెద్ద వ్యవస్థ ఉండీ ఎందుకు చేయలేకపోతున్నారో ప్రభుత్వ వైద్యశాలల అధికారులు, సిబ్బంది ప్రశ్నించుకోవాలన్నారు.
వైద్య ఆరోగ్య శాఖను సమూలంగా ప్రక్షాళన చేయాల్సివుందన్నారు. కాగా, ఎన్టీఆర్ వైద్య సేవలో గుండె మార్పిడి, శస్త్ర చికిత్సలను చేర్చాలని సీఎం ఆదేశించారు. ప్రతి ఆస్పత్రిలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి వైద్య సేవల నిర్వహణ, వైద్యులు, సిబ్బంది పనితీ రు, వివిధ సేవల నాణ్యతపై ఐవీఆర్‌ఎస్ ద్వారా రోగుల నుంచి సమాచారం సేకరించి తనకు పంపాలన్నారు.