నాటకాలాడుతున్నది నువ్వా.. మేమా? | Botsa Satyanarayana Play Dramas: Sobha Nagireddy | Sakshi
Sakshi News home page

నాటకాలాడుతున్నది నువ్వా.. మేమా?

Aug 21 2013 2:44 AM | Updated on Jul 12 2019 3:10 PM

నాటకాలాడుతున్నది నువ్వా.. మేమా? - Sakshi

నాటకాలాడుతున్నది నువ్వా.. మేమా?

రాష్ట్ర విభజన విషయంలో నాటకాలాడుతున్నది పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణేనని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు భూమా శోభా నాగిరెడ్డి ధ్వజమెత్తారు. బొత్స వ్యాఖ్యలపై మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆమె తీవ్రంగా స్పందించారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో నాటకాలాడుతున్నది పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణేనని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు భూమా శోభా నాగిరెడ్డి ధ్వజమెత్తారు. బొత్స వ్యాఖ్యలపై మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆమె తీవ్రంగా స్పందించారు. బొత్స రాజకీయంగా రంగులు మార్చడం, తడవకో మాట మాట్లాడటం చూస్తే ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా ఉందని వ్యాఖ్యానించారు. తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని పీసీసీ అధ్యక్షుడు కాక ముందు బొత్స సత్యనారాయణ మాట్లాడారని, ఆ తరువాత రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అన్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ కోర్ కమిటీ ముందు బొత్స సమర్పించిన రోడ్‌మ్యాప్ ఏమిటో ఎందుకు బయటపెట్టడం లేదన్నారు.
 
 అధిష్టానం ముందు ఒక మాట, బయటకొచ్చి మరోమాట, ఆ పార్టీ సీమాంధ్ర నేతల శిబిరానికి వెళ్లి అక్కడో మాట, తెలంగాణ నేతల సమావేశానికి వెళ్లి అక్కడ మరో మాట చెప్పడం వాస్తవం కాదా అని ఆమె ప్రశ్నించారు. ‘అధిష్టానం వద్ద ‘జీ...హుజూర్ !’ అని తలలూపి వచ్చిన మీకు, మీ ముఖ్యమంత్రికి వైఎస్సార్ కాంగ్రెస్‌పై విమర్శలు చేసే కనీసార్హత లేదు’. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన మీ పార్టీ నేతలు కొద్ది రోజులుగా ఢిల్లీలో చేస్తున్న డ్రామాలేమిటి? అని ఆమె మండిపడ్డారు. ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయలేనప్పుడు సమైక్యంగా ఉంచాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. విభజన అంశాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నది మీరు కాదా అని ప్రశ్నించారు. విభజనపై నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ మూడున్నరేళ్లు ఎందుకు తీసుకుంది? కేవలం ఓట్లు, సీట్ల రాజకీయం కోసం కాదా?  అని ప్రశ్నించారు. రంగులు మార్చే బొత్స లాంటి నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హితవు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement