తెలంగాణ సాహిత్య విశ్వరూపాన్ని ఆవిష్కరిస్తాం | World Telugu Conference must unfold literary creativity of Telangana: MP Kavitha | Sakshi
Sakshi News home page

తెలంగాణ సాహిత్య విశ్వరూపాన్ని ఆవిష్కరిస్తాం

Dec 15 2017 2:01 AM | Updated on Aug 11 2018 7:54 PM

World Telugu Conference must unfold literary creativity of Telangana: MP Kavitha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘తెలంగాణలో తెలుగు భాషాభివృద్ధికి జరిగిన కృషిని ప్రపంచ తెలుగు మహాసభల్లో చాటిచెబుతాం. రేపటినాడు తెలంగాణలో తెలుగు ఎలా వెలగాలి అన్న దిశలో తెలుగు మహాసభలు తోవ చూపుతాయి. 25, 30 ప్రక్రియల్లో మొట్టమొదట రాసింది తెలంగాణ కవులే. ఈ మహాసభలు తెలంగాణ సాహిత్య విశ్వరూపాన్ని ప్రదర్శించే వేదిక అవుతాయి..’అని తెలంగాణ జాగృతిఅధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ భాషాభిమాని అయినందునే ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణలో జరుగుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. మహాసభల గురించి, తెలుగు భాషా, సంస్కృతి, చరిత్రల పరిరక్షణకు జాగృతి చేసిన కృషి గురించి ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

తెలంగాణ తల్లి–తెలుగు తల్లి వివాదం
ఉద్యమ సందర్భంలో కేసీఆర్‌ ఒక మాట చెప్పిండు. ప్రాంతాలకు తల్లి ఉంటది. భరతమాత ఉంటది. తెలంగాణ తల్లి ఉంటది. ఆంధ్రా మాత ఉంటది. ఎప్పుడైతే తెలంగాణను ఆంధ్రాలో కలుపుకోవాలని కుట్ర జరిగిందో.. ఆనాడు ఇద్దరికీ కామన్‌గా ఏముందో అని వెతుక్కుని తెలుగు ఉంది కాబట్టి తెలుగు తల్లిని పుట్టించారు. తెలంగాణ పదం పుట్టినప్పుటి నుంచి తెలంగాణ తల్లి ఉంది. మన భూమిని, ప్రాంతాన్ని తల్లిలా పూజిస్తాం. తెలుగుతల్లి మాకేం పెట్టలేదు. అన్యాయం చేసింది. కాబట్టి మేం తెలుగు తల్లిని గుర్తించం. తెలంగాణ తల్లిని గుర్తిస్తం. ఆంధ్రా మాతను ఆదరిస్తం. కాబట్టి తెలుగు తల్లిని ముందు పెట్టి తెలంగాణను విమర్శించడాన్ని సహించం. ఉద్యమ సమయంలో మా నేత కేసీఆర్‌ చెప్పిండు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు మా వైఖరిలో మార్పు లేదు. ఈ మహాసభల్లో తెలంగాణ తల్లికే దండ వేస్తం. జాతీయ గీతం ఆలపించుకుంటం.  

మహాసభల ముఖ్య ఉద్దేశం..
మన వాళ్లను ప్రపంచం ముందు కీర్తించుకోవాలి. పాల్కుర్కి సోమన్న ఉన్నడు. అసలు తెలుగు అన్న పదాన్ని మొట్టమొదట వాడిందే ఆయన. అంతకు ముందువారు తెనుగు అనేవారు. సోమన్న పామర భాషనే వాడతానని ఘంటాపథంగా చెప్పారు. ఇలాంటి వారికి సమైక్య పాలనలో గుర్తింపు లభించలేదు. ఇవాళ పాల్కుర్కి సోమన్నను పీఠం ఎక్కిస్తం. పోతనకు పీఠం వేస్తం.

మహాసభల నిర్వహణపై వివాదాలు
మనదీ అనుకుంటే అన్నీ మనవిలాగే ఉంటాయి. మనవి కావు అనుకుంటే అన్నీ భిన్నంగా కనిపిస్తాయి. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు. ప్రజల కార్యక్రమం. తెలుగు భాషకు సంబంధించి భాష పేరుతోనే అణగదొక్కబడ్డామని ఉద్యమం చేశాం. భాషకు మన బిడ్డలు చేసిన గొప్పతనాన్ని చెబుతామంటే విభేదాలు ఎందుకు. విరసం.. కొంచెం కాంక్రీట్‌గా, వారం రోజుల ముందు ఏం చర్చించాలి.. ఏం చేయాలన్నది చెబితే వారి గౌరవం పెరిగేది. విరసం నుంచి వచ్చిన వర్క్‌ను ఆదరిస్తాం. కానీ, వాళ్లు ఎస్కేప్‌ రూట్‌ ఎందుకు ఎంచుకున్నారు. మహాసభలను ఎందుకు బహిష్కరించాలి.

పరిపాలనా వ్యవహారాల్లో తెలుగు..
ఆదర్శం చెప్పడానికి బావుంటది. కానీ బ్యాక్‌ గ్రౌండ్‌లో జరగాల్సిన వర్క్‌ జరగలేదు. తమిళనాడులో వారి భాష అభివృద్ధికి ఏ ప్రభుత్వం ఉన్నా పనిచేసింది. మనం జీవోలు తెలుగులో తెస్తే సమాంతర పదాలు ఎక్కడ ఉన్నాయి. ఎవరికి అర్థం అవుతాయి. తెలుగు భాషను పరిపుష్టం చేయడానికి, తెలుగులో ఇంకా పదాలు కనిపెట్టడానికి నాటి ప్రభుత్వాలు ఎందుకు పనిచేయలేదు. మూడేళ్లలో ఇవన్నీ ఎక్కడ చేస్తాం. అకాడమీలను మూలన పడేశారు. ఇపుడు పునరుద్ధరించాం.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి..
సీఎం కేసీఆర్‌ స్వయంగా భాషాభిమాని కావడం అదృష్టం. కాబట్టే ఈ సభల్లో సాహిత్యంపైనే చర్చ జరగాలని కోరారు. బాల సాహిత్యం, స్త్రీ సాహిత్యం మీద అన్నింటి మీదా చర్చలు జరగాలనే ఏడు వేదికలు సిద్ధం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు వద్దన్నారు. ఎంత మందికి వీలైతే అన్ని చర్చలు జరగాలి. కాన్‌సెప్ట్‌ సాహిత్యం, సంస్కృతికి కూడా ప్రాధాన్యం ఉంటుంది. ఆగస్టు 15న కళాకారులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. అన్నింటినీ కలపడం లేదు. సాహిత్యానికి, చర్చకు పెద్దపీట వేయాలన్నది సీఎం కేసీఆర్‌ ఆలోచన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement