నగరం చెత్త మయం | Workers Strike Have accumulated with Worst | Sakshi
Sakshi News home page

నగరం చెత్త మయం

Jul 8 2015 12:34 AM | Updated on Sep 3 2017 5:04 AM

నగరం చెత్త మయం

నగరం చెత్త మయం

ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త...

- కార్మికుల సమ్మెతో  పేరుకుపోయిన చెత్త
- దుర్గంధంతో ప్రజల ఇక్కట్లు
- పొంచి ఉన్న రోగాల ముప్పు
సాక్షి, సిటీబ్యూరో:
ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త. వీధుల్లో నిండిపోయి దర్శనమిసుతన్న చెత్తకుండీలు. కంపు కొడుతున్న కాలనీలు. ముసురుతున్న ఈగలు.. దోమలు.. వాటి చుట్టూ వీధి కుక్కలు.. ఇదీ నగరంలో పారిశుద్ధ్య పరిస్థితి. రెండో రోజైన మంగళవారం కూడా జీహెచ్‌ఎంసీ కార్మికులు సమ్మె కొనసాగించడంతో నగరం దుర్గంధంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎక్కడి చెత్త అక్కడే గుట్టలుగా పేరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రధాన రహదారులపై పరచినట్లుగా చెత్త పేరుకుపోయింది.

జీహెచ్‌ఎంసీలోని పారిశుద్ధ్య కార్మికులతోపాటు, దోమల నివారణ, తదితర విభాగాల్లోని కార్మికులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు 26 వేల మంది ఉన్నారు. వీరంతా విధులను బహిష్కరించడంతో నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తిగా పడకేశాయి. ఏమూల చూసినా చెత్త గుట్టలు గుట్టలుగా పోగైంది. ప్రధాన రహదారుల్లోనూ ఇదే దుస్థితి. గ్రేటర్‌లో రోజూ దాదాపు 3800 మెట్రిక్ టన్నుల చెత్తను తరలిస్తారు. అలాంటిది గత రెండు రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు విధులను బహిష్కరించడంతో నగరం దుర్గంధభరితంగా మారింది.

దీంతో వెక్టర్‌బోర్న్ వ్యాధుల ప్రభావం పొంచి ఉంది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు అన్ని జోన్లు, సర్కిళ్ల పరిధిలోనూ కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో పరిస్థితి తీవ్రత కనిపించింది. మంగళవారం జరిగిన చర్చల్లోనూ యూనియన్ల  డి మాండ్లు పరిష్కారం కాకపోవ డంతో సమ్మె కొనసాగుతుందని ఆయా కార్మికసంఘాలు స్పష్టం చేశాయి. సమ్మె నిర్వహిస్తున్న యూనియన్లలో సీఐటీయూ, ఏఐటీయూసీ, బీఎంఎస్, హెచ్‌ఎంఎస్, ఐఎఫ్‌టీయూ, ఏఐయూటీయూసీ, టీఆర్‌ఎస్ కేవీ, టీఎన్‌టీయూసీ తదితర కార్మిక సంఘాలున్నాయి.
 
సమ్మెలోకి మేం కూడా: జీహెచ్‌ఎంఈయూ
కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం కనబరుస్తుండటంతో బుధవారం నుంచి తాము కూడా సమ్మెలోకి దిగుతున్నట్లు అధికార  పార్టీకి అనుబంధ యూనియన్ అయిన టీఆర్‌ఎస్ కేవీ- జీహెచ్‌ఎంఈయూ అధ్యక్షుడు యు. గోపాల్ తెలిపారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్, అడిషన్ కమిషనర్(పరిపాలన)లకు సమ్మె నోటీసు అందజేశామన్నారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి నిరవధికంగా సమ్మె కొనసాగిస్తామన్నారు. తమ యూనియన్‌లో 14 వేల మంది ఔట్‌సోర్సింగ్ కార్మికులతోపాటు 4వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారన్నారు. వీరందరూ సమ్మెలో పాల్గొంటారని హెచ్చరించారు.
 
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు : కమిషనర్ సోమేశ్‌కుమార్
సాక్షి, సిటీబ్యూరో రంజాన్, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని  కార్మికులు వెంటనే  సమ్మె విరమించి విధులకు హాజరుకావాల్సిందిగా కమిషనర్ సోమేశ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు ప్రయత్నాలు జరుగుతున్నందున వెంటనే విధులకు హాజరు కావాలని కోరారు. మరోవైపు..  సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా సోమేశ్‌కుమార్ సీనియర్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు పర్యవేక్షించాలని  స్వచ్ఛ కమిటీలకు సూచిం చారు. జీహెచ్‌ఎంసీ కార్మికులు విధులకు హాజరుకాని పక్షంలో స్థానికంగా అందుబాటులో ఉండే కార్మికుల సేవలను తాత్కాలికంగా వినియోగించుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement