‘వావ్‌’ హైదరాబాద్‌!

Women groups in the name of Women on Wheels - Sakshi

‘ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌’ పేరుతో మహిళా బృందాలు

దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు

తొలిదశలో ప్రతి డివిజన్‌కు ఒకటి 

ఆవిష్కరించిన నగర కొత్వాల్‌ అంజనీకుమార్‌

భరోసా, షీ–టీమ్స్‌ ఏర్పాటుతో ఇప్పటికే మహిళల భద్రతలో తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకున్న సిటీ పోలీసు విభాగం మరో అడుగు ముందుకు వేసింది. గస్తీలో మహిళా సిబ్బందికి ప్రాధాన్యం కల్పిస్తూ ‘ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌’(వావ్‌) పేరుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. దేశంలోనే తొలిసారిగా కంబాట్‌ సిస్టమ్‌లో శిక్షణ తీసుకుని రంగంలోకి దిగుతున్న ఈ టీమ్స్‌ను నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ సోమవారం ఇక్కడ గోషామహల్‌ పోలీసుస్టేడియంలో ఆవిష్కరించారు. తొలిదశలో డివిజన్‌కు ఒకటి చొప్పున కేటాయించారు. త్వరలో ప్రతిఠాణాకు ఒక బృందం ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ టీమ్స్‌ పోలీసు ఉన్నతాధికారుల ఎదుట ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ డెమో ఇచ్చాయి. 

సుశిక్షితులైన ఈ 43 మందితో 20 వావ్‌ టీమ్స్‌ ఏర్పాటు చేశారు. వీరు బ్లూకోల్ట్స్‌లో అంతర్భాగంగా ఒక్కో ద్విచక్రవాహనంపై ఇద్దరు చొప్పున గస్తీ తిరుగుతూ ఉంటారు.తొలిదశలో నగరంలోని 17 డివిజన్లకూ ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. మరో మూడింటిని ప్రత్యేక సందర్భాలు, పర్యాటక ప్రాంతాల్లో వినియోగిస్తారు. భవిష్యత్తులో ప్రతి పోలీసుస్టేషన్‌కు ఒక వావ్‌ టీమ్‌ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సాధారణ గస్తీతోపాటు డయల్‌–100కు వచ్చే కాల్స్‌ ఆధారంగానూ ఈ టీమ్స్‌ పనిచేస్తుంటాయి. నేరాలు నిరోధించడం, సమాచారం సేకరించడంతో పాటు ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ బాధ్యతల్నీ నిర్వర్తించనున్నాయి. ప్రత్యేక లోగోతో కూడిన ద్విచక్ర వాహనంపై సంచరించే బ్లూకోల్ట్స్‌ యూనిఫామ్‌తోపాటు వారికి కమ్యూనికేషన్‌ పరికరాలు, ప్లాస్టిక్‌ లాఠీ తదితరాలూ అందించారు. 

రెండు నెలల కఠోర శిక్షణ... 
ఇప్పటివరకు నగరంలో కేవలం పురుష పోలీసులు మాత్రమే బ్లూకోల్ట్స్‌ పేరుతో గస్తీ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, మహిళా పోలీసులకూ అన్ని రకాలైన విధుల్లోనూ భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించిన సిటీ పోలీసు కమిషనర్‌ ‘వావ్‌’బృందాలకు అంకురార్పణ చేశారు. గత ఏడాది కానిస్టేబుళ్లుగా ఎంపికై, ఇటీవలే శిక్షణ పూర్తిచేసుకుని వచ్చిన యువ మహిళా కానిస్టేబుళ్ల నుంచి అవసరమైన అర్హతలు ఉన్న 43 మందిని ఎంపిక చేశారు. వీరికి రెండు నెలలపాటు కఠోర శిక్షణ ఇచ్చారు. ఇందులో ఎలాంటి ఆయుధం లేకుండా అసాంఘిక శక్తుల్ని ఎదుర్కోవడం నుంచి ఉగ్రవాదులతోనూ పోరాడే పాటవాలను నేర్పించారు. ఏడీబీ టూల్స్, టీడీ 9 కాంబోస్‌ వంటి అత్యాధునిక శిక్షణలు ఇచ్చారు. మహిళా పోలీసులకు ఈ తరహా శిక్షణలు ఇవ్వడం ఇదే తొలిసారి. 

పురుషులతో సమానంగా ఎదిగేలా..
మహిళాపోలీసులకు ఇదో మైలురాయి. పోలీసు విభాగంలోని మహిళాసిబ్బంది పురుష సిబ్బందితో సమానంగా ఎదిగేలా అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగానే ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌ బృందాలను ఏర్పాటు చేశాం. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగిన ‘వీ కెన్‌’అనే కార్యక్రమంలో పోలీసు విభాగంలో ఉత్తమ సేవలు అందించిన 63 మంది మహిళల్ని సన్మానించుకున్నాం. అప్పుడే మహిళా పోలీసుల్నీ అన్ని రకాలైన విధుల్లోనూ వినియోగించుకోవాలని, ఆ దిశలో చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే ఈ టీమ్స్‌ అందుబాటులోకి వచ్చాయి. 
– షికా గోయల్, అదనపు సీపీ

ప్రతి మహిళా టెక్నిక్స్‌ నేర్చుకోవాలి
ఈ బృందాల ఏర్పాటు మహిళా సాధికారతలో కీలక పరిణామం.ఈ ‘ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌’బృందాలు మనందరికీ సేవ చేస్తాయి. ప్రతి మహిళా కొన్ని కాంబాక్ట్‌ టెక్నిక్స్‌ నేర్చుకోవాల్సిందే. నిత్యజీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి వాటిని వాడాలి. సమాజంలో తిరగాల్సి వచ్చినప్పుడు ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా వెళ్లడానికి ఇవి ఎంతో ఉపయుక్తం.
– మెహరీన్‌ కౌర్,హీరోయిన్‌

సిటీ రోల్‌ మోడల్‌గా మారింది
‘భరోసా, షీ టీమ్స్‌తోపాటు మహిళల భద్రత కోసం తీసుకున్న అనేక చర్యలతో హైదరాబాద్‌ ఇతర నగరాలకు, రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా మారింది. ప్రతివారం ఎవరో ఒకరు వచ్చి అధ్యయనం చేసి వెళ్తున్నారు. ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌ బృందాల ఏర్పాటుతో మరో రికార్డు సొంతం చేసుకుంది. రాష్ట్రంలో గడిచిన మూడేళ్లుగా మహిళల కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం. పోలీసు రిక్రూట్‌మెంట్‌ లోనూ వీరి కోసం స్పెషల్‌డ్రైవ్స్‌ చేపడుతున్నాం. పోలీసింగ్‌ అంటే రఫ్‌ అండ్‌ టఫ్‌ ఉద్యోగమని, మహిళలు ఈ విధులు నిర్వర్తించలేరనే అభిప్రాయం ఈ బృందాల ఏర్పాటుతో పోతుంది. సమాజంలో సగం ఉండటమే కాదు పోలీసుస్టేషన్‌కు వచ్చేవారిలోనూ మహిళాబాధితులు ఎక్కువే. వీరి భద్రతకు కీలకప్రాధాన్యం ఇస్తున్నాం. ఎవరైనా ఎక్కడైనా తప్పు జరుగుతున్నట్లు గమనిస్తే కనీసం ముగ్గురికి చెప్పండి... లేదా 100కు ఫోన్‌ చేయండి’
– అంజనీకుమార్, కొత్వాల్‌
– సాక్షి, హైదరాబాద్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top