గ్రహణం వీడేనా..?

Wildlife Authorities Refused To Construct Double Road Under The Kinnerasani Sanctuary - Sakshi

సాక్షి, పాల్వంచ : కిన్నెరసాని అభయారణ్యం పరిధిలో డబుల్‌ రోడ్డు నిర్మాణానికి వైల్డ్‌లైఫ్‌ శాఖాధికారులు అనుమతి నిరాకరించారు. అభయారణ్యాల పరిధిలో ప్రస్తుతం ఉన్న రహదారుల కంటే ఒక్క ఇంచు కూడా ఎక్కువ విస్తీర్ణంలో వేయడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో రెండేళ్ల క్రితం మంజూరైన డబుల్‌ రోడ్డు పనులకు మంగళం పాడారు. ఇక్కడ సింగిల్‌ రోడ్డు నిర్మాణానికి కసరత్తు చేస్తున్నా.. అందులోనూ జాప్యం జరుగుతోంది. కిన్నెరసాని అభయారణ్యం పరిధిలో పాల్వంచ మండలం రాజాపురం నుంచి ఉల్వనూరు, చండ్రాలగూడెం మీదుగా కొత్తగూడెం మండలంలోని మైలారం నుంచి కొత్తగూడెం క్రాస్‌ రోడ్డు వరకు రూ.62 కోట్ల వ్యయంతో 2016లో డబుల్‌ రోడ్డు మంజూరైంది. అయితే 51 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రహదారి విస్తరణ పనులకు వైల్డ్‌లైఫ్‌ శాఖ ద్వారా అనుమతులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. అభయారణ్యంలో రోడ్డు విస్తరణకు ఆ శాఖ అనుమతి నిరాకరించింది. దీంతో రాజాపురం నుంచి ఉల్వనూరు వరకు రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్‌ రాజాపురం నుంచి రోడ్డు విస్తరణ పనులు చేపడుతుండగా గత ఏడాది మే లో వైల్డ్‌లైఫ్‌ శాఖా అధికారులు నిలిపివేశారు.  

ప్రమాదకరంగా కల్వర్టులు... 
రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా రహదారి పొడవునా కల్వర్టులు కూడా నిర్మించారు. అయితే రోడ్డుకు కల్వర్టులు ఎత్తుగా ఉండడంతో వర్షాకాలంలో రాకపోకలకు ప్రమాదకరంగా మారాయని వాహనదారులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఉల్వనూరు గ్రామ సమీపంలో, మల్లారం క్రాస్‌ రోడ్డు నుంచి రోడ్డుపై కంకర తేలి గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా తయారైంది. రోడ్డు నిర్మాణ పనులు గత జూలైలో నిలిచిపోగా.. విస్తరణ అనుమతులు కోసం ఆర్‌అండ్‌బీ అధికారులు కేంద్రం అనుమతి కోసం ఢిల్లీకి ప్రతిపాదనలు పంపారు. సంబంధిత అధికారులతో పలుమార్లు చర్చలు కూడా జరిపారు. అయినా విస్తరణ పనులకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. దీంతో చండ్రాలగూడెం నుంచి మైలారం వరకు వైల్డ్‌లైఫ్‌ పరిధిలో లేని ప్రాంతంలో 8 కిలోమీటర్ల వరకు మాత్రమే రోడ్డు నిర్మించారు. 30 కిలోమీటర్ల మేర పనులు నిలిపివేశారు. అయితే పాత రోడ్డుకు కూడా తమ అనుమతులు లేవని వైల్డ్‌లైఫ్‌ శాఖ అధికారులు అంటున్నారు. మరి అప్పుడు అనుమతి లేకుండా రహదారి నిర్మాణం ఎలా చేపట్టారనేది చర్చనీయాంశంగా మారింది.  

సింగిల్‌ రోడ్డు నిర్మిస్తాం
మండల పరిధిలోని రాజాపురం నుంచి ఉల్వనూరు వరకు, చండ్రాలగూడెం నుంచి మైలారం వరకు 51కిలోమీటర్లు వైల్డ్‌లైఫ్‌ శాఖ పరిధిలో నిర్మించాల్సిన డబుల్‌ తారు రోడ్డు విస్తరణ పనులకు అనుమతులు ఇవ్వడం లేదు. దీంతో రెండు సంవత్సరాలుగా పనులు నిలిచిన మాట వాస్తవమే. అనేక సార్లు ఢిల్లీకి వెళ్లి వైల్డ్‌లైఫ్‌ శాఖ అధికారులతో మాట్లాడినా, ప్రభు త్వం ద్వారా ప్రతిపాదనలు పంపినా వారు అనుమతి ఇవ్వడానికి నిరాక రించారు. చివరికి పాత సింగిల్‌ రోడ్డును పునరుద్ధరించాలనే ఆలోచనలో ఉన్నాం. అందుకోసం ఎస్‌ఈకి ప్రతిపాదనలు పంపాం. అక్కడి నుంచి అనుమతి వచ్చాక, వర్షాలు తగ్గిన తర్వాత రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తాం.  
– రాజేశ్వరరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top