16 లోక్‌సభ స్థానాల్లో మాదే విజయం | We won in 16 Lok Sabha seats | Sakshi
Sakshi News home page

16 లోక్‌సభ స్థానాల్లో మాదే విజయం

Dec 20 2018 2:20 AM | Updated on Mar 18 2019 7:55 PM

We won in 16 Lok Sabha seats - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 16 స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎంపీలు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారనేందుకు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి కేంద్రంలో టీఆర్‌ఎస్‌ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తిరస్కరణకు గురైన కాంగ్రెస్‌ నేతలు ఓటమిని అంగీకరించకుండా సాకులు వెతుక్కుంటున్నారని విమర్శించా రు.

ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎంలపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు చంద్రబాబు వల్లే ఓడామని గాంధీభవన్‌లో కూర్చుని విశ్లేషించుకుంటున్నారన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పక్షాన లేరన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తించి ఓటమిని అంగీకరించాలని, అలాగే ప్రభుత్వానికి పాలనలో సూచనలు చేసి హుందాగా వ్యవహరించాలన్నారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, కె.కవిత, బూర నరసయ్యగౌడ్, బండ ప్రకాశ్, లింగయ్య యాదవ్, బీబీ పాటిల్, నగేశ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి బుధవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 

బఫూన్‌ అనే అంటారు..
సిల్లీ వేషాలు వేస్తే ఎవరినైనా బఫూన్‌ అనే అంటారని ఇటీవల రాహుల్‌ను ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కవిత పేర్కొన్నారు. గతంలో లోక్‌సభలో రాహుల్‌ గాంధీ.. ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లి ఆయన్న కౌగిలించుకున్న తీరును దేశం మొత్తం చూసిందని, దీన్ని అందరూ తప్పుబట్టారని పేర్కొన్నారు. ఇలాంటి సిల్లీ వేషాలు వేస్తే బఫూన్‌ అనే అంటారని విమర్శించారు. ‘దేశంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ బలపడుతోంది. దేశ ప్రజలే మా ప్రధాన ఎజెండా తప్ప రాజకీయ పార్టీలు కాదు. ఇప్పటి ఎన్డీయే ప్రభుత్వం పాలనలో విఫలమైంది. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ రావాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తిని ప్రధాని చేయడం, లేదా ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావడం అన్నది ప్రధానం కాదు.

దేశ ప్రజలే ప్రధాన ఎజెండాగా వారి సమస్యలను ఎదుర్కోవడం ముఖ్యం. తెలంగాణలో మేం సఫలీకృతం అయ్యాం. తెలంగాణ తరహా ప్రగతి.. దేశం మొత్తం ప్రతిబింబించాలని కోరుకుంటున్నాం. దీన్ని నిజం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ లేని ఒక బలమైన కూటమి ఏర్పాటుకు కృషి చేస్తాం. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎక్కడ కూడా పుంజుకోలేదు. మూడు రాష్ట్రాల్లో యాదృచ్ఛికంగా నెగ్గుకొచ్చింది తప్ప గొప్పగా సాధించిందేమీ లేదు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జాతీయ పార్టీలు విఫలమయ్యాయి. భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలు దేశ రాజ కీయాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రాంతీయ పార్టీలకు దేశ ప్రజల సమస్యలను ఎదుర్కొనే సత్తా ఉంది’ఎంపీ కవిత అన్నారు. 

హైకోర్టు విభజనకు నోటిఫికేషన్‌ సిద్ధం...
ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించి కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్‌ సిద్ధం చేసిందని ఆ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పినట్లు ఎంపీ జితేందర్‌ రెడ్డి తెలిపారు. దీనికి త్వరలోనే రాష్ట్రపతి ఆమోదం పొందుతుందని చెప్పారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చట్టం అమలుకు సంబంధించి పెం డింగ్‌లో ఉన్న 52 అంశాల సాధనకు పార్లమెం టులో పోరాడతామని, అయితే సభ సజావుగా నడిచే పరిస్థితి లేకపోవడంతో పలువురు కేంద్ర మంత్రులను కలుస్తామని ఆయన పేర్కొన్నారు.

ఎయిమ్స్‌ నిధుల మంజూరును వేగవంతం చేసే లా, సీతారామసాగర్‌ ప్రాజెక్టుకు, రీజనల్‌ రింగ్‌రోడ్డుకు అనుమతులు, మిషన్‌ భగీరథ, కాకతీయ పథకాలకు కేంద్రం నుంచి నిధులు, బైసన్‌పోలో గ్రౌండ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడంపై మంత్రులను కోరతామన్నారు. రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ల పెంపు అంశాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపాడ్డారు. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్‌ ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు గుర్తించి సగం ఖర్చు భరించేందుకు సిద్ధమని చెప్పినా కేంద్రం ముందుకు రావట్లేదన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement