అంత డబ్బు మా దగ్గర్లేదు

We do not have that much money - Sakshi

విద్యుత్‌ కొనుగోళ్ల ముందస్తు ఎల్సీ జారీపై చేతులెత్తేసిన డిస్కంలు

ప్రతి నెలా ఎల్సీ జారీకి కావాల్సింది రూ.1,089 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర, ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి విద్యుత్‌ కొనుగోళ్ల కోసం లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌(ఎల్సీ) తప్పనిసరి చేస్తూ కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ గత నెల 28న జారీ చేసిన ఉత్తర్వులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆగస్టులో రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ కొనుగోళ్ల కోసం తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆ మేర వ్యయాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేసి ముందస్తుగా ఎల్సీ జారీ చేసేందుకు మరో రెండు రోజులే ఉన్నాయి. ఈ నెల 31లోగా డిస్కంలు ఎల్సీ జారీ చేస్తేనే ఆ మేర విద్యుత్‌ను కేంద్ర, ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి రాష్ట్రాలకు సరఫరా చేయాలని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఎల్సీ జారీ చేసే సత్తా తమకు లేదని చేతులెత్తేశాయి. ఎన్టీపీసీ వంటి కేంద్ర విద్యుదుత్పత్తి కంపెనీలతోపాటు ప్రైవేటు జనరేటర్ల నుంచి విద్యుత్‌ కొనుగోళ్లకు ప్రతి నెలా రూ.1,089 కోట్లు అవసరమని తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రస్తుతం డిస్కంల వద్ద రూ.400 కోట్ల నిధులు మాత్రమే ఉన్నాయని, విద్యుత్‌ కొనుగోళ్లకు ముందస్తు ఎల్సీ జారీ చేసేందుకు రూ.1,000 కోట్లను కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఆగస్టులో విద్యుత్‌ ఉద్యోగులకు జీతాల చెల్లింపుతో పాటు ఇతర ఖర్చులకు డిస్కంల వద్ద ఉన్న రూ.400 కోట్ల నిధులు ఆవిరైపోతాయని, ముందస్తుగా ఎల్సీ జారీ చేసే పరిస్థితి లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎల్సీ నిబంధన అమలును కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ వాయిదా వేయని పక్షంలో, నిరంతర విద్యుత్‌ సరఫరాను కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు అత్యవసరంగా నిధులు విడుదల చేయాల్సి ఉంటుందని ట్రాన్స్‌కో వర్గాలు పేర్కొంటున్నాయి. డిస్కంల వద్ద నిధులు లేనిపక్షంలో కనీసం వారం, పక్షం రోజులకు అవసరమైన విద్యుత్‌ కొనుగోళ్లకు అయినా ఎల్సీ జారీ చేయాల్సిందేనని కేంద్రం నిబంధన పెట్టింది. అదీ సాధ్యం కాని పక్షంలో ఏ రోజుకు ఆ రోజు అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ఒక రోజు ముందుగానే విద్యుత్‌ కంపెనీలకు ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్‌ రూపంలో నిధులను బదిలీ చేయాలని చెప్పింది. ఈ విషయంలో విఫలమైన డిస్కంలకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేయాలని ప్రాంతీయ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్లను ఆదేశించింది. మరో రెండు రోజుల్లోగా రాష్ట్ర డిస్కంలు ఎల్సీ జారీ చేయకపోయినా, కనీసం నగదు బదిలీ చేయకపోయినా రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా సమస్యలు తప్పవని ఆందోళన వ్యక్తమవుతోంది. 

నేడు దక్షిణాది రాష్ట్రాల భేటీ.. 
లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దక్షిణాది రాష్ట్రాల విద్యుత్‌ కమిటీ(ఎస్‌ఆర్పీసీ) సోమవారం బెంగళూరులో సమావేశమై తదుపరి కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఎల్సీ నిబంధనల అమలును వాయిదా వేయాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశాలున్నాయి. రాష్ట్రాల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఇప్పటికే తప్పుబడుతూ కేంద్రానికి లేఖ రాసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top