విశాఖే ఉత్తమం | Vizag Is Best Place For AP Capital Says GN Rao | Sakshi
Sakshi News home page

విశాఖే ఉత్తమం

Jan 30 2020 1:41 AM | Updated on Jan 30 2020 9:14 AM

Vizag Is Best Place For AP Capital Says GN Rao - Sakshi

జీఎన్‌ రావు

సాక్షి, హైదరాబాద్‌: ‘ఆంధ్రప్రదేశ్‌ కార్య నిర్వాహక రాజధానిగా విశాఖపట్నం మెట్రోపాలి టన్‌ ఏరియాలో సముద్రానికి దూరంగా ఉన్న వాయవ్య ప్రాంతం సరిగ్గా సరిపోతుంది. ఇదే విషయాన్ని నేను నేతృత్వం వహించిన నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. విశాఖ మెట్రోపాలిటన్‌ ఏరియా అందుకు అనువైన ప్రాంతం కాదని మా కమిటీ చెప్పిందంటూ చేస్తున్న ప్రచా రం శుద్ధ తప్పు. ఆ ప్రాంతం అనువైనది కాదని నివేదికలో మేం ఎక్కడా పేర్కొనలేదు. అన్ని విధాలా అది యోగ్యమైందనే చెప్పాం’ అని రాజధాని ప్రాంతంపై సిఫారసుల కోసం ఏర్పాటైన నిపుణుల కమిటీకి నేతృత్వం వహిస్తున్న విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జీఎన్‌ రావు స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు ప్రచురించిన కథనాల్లో వక్రీకరణలను ఆయన ఖండించారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

సాధారణ ప్రజలను కలిశాం..
‘ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి సంబంధించి మా కమిటీ మూడు ప్రాంతాలను నివేదికలో పేర్కొంది. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖ పట్నం మెట్రోపాలిటన్‌ ఏరియాని, లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌గా అమరావ తిని, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌గా కర్నూలు పేర్లను సూచించాం. నాతోపాటు కమిటీలో ఏడుగురు నిపుణులైన సభ్యులున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నెల రోజుల పాటు పర్యటించి అధికారు లు, సాధారణ ప్రజలు, ఇతర రంగాలకు చెందిన నిపుణులతో మాట్లాడారు. చారిత్రకంగా ఆయా ప్రాంతాలకు ఉన్న ప్రాధాన్యాలను పరిశీలిం చారు. భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేశారు. ఆ తర్వాతే సమగ్ర వివరాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. 

తుపాన్లు కోస్తా అంతా వస్తాయి...
ప్రతి ప్రాంతానికి కొన్ని ప్రతికూలాంశా లుంటాయి. వాటిని అధిగమించేలా చర్యలు  చేపట్టి ముందుకు సాగాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఏ ప్రాంతాలు వేటికి క్యాపిటల్‌ సిటీగా ఉంటే బాగుంటుందో నివేదిక రూపొందించాం. విశాఖ మెట్రోపాలిటన్‌ ఏరియాను ఇలా పరిశీలించిన తర్వాతే ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా> చేస్తే బాగుంటుందని సూచించాం. అక్కడి జనాభా ఒత్తిడి, తుపాన్లు లాంటి ప్రకృతి విపత్తులు, సముద్రపు కోత తదితర  పర్యవసానాలను అంచనా వేసే విశాఖ మెట్రోపాలిటన్‌ ఏరియా అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నాం. విశాఖ నగరం మధ్య ప్రాంతంలో కాకుండా సముద్రానికి కాస్త దూరంగా వాయువ్య ప్రాంతాన్ని ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా మార్చుకుంటే యోగ్యంగా ఉంటుందని స్పష్టంగా చెప్పాం. సముద్రానికి ఆనుకొని నిర్మాణాలు చేపట్టమని చెప్పలేదు. అన్ని విధాలా అనుకూలమైన ప్రాంతాన్ని సూచించాం. నగరానికి ఉన్న ప్రతికూలాంశాల ఆధారంగా స్పష్టమైన వివరాలను పొందుపరుస్తూ పేర్కొన్నాం. కానీ దీన్ని వక్రీకరిస్తూ, విశాఖ అనువైన ప్రాంతం కాదని కమిటీ నివేదించిందంటూ ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు. నివేదిక మొత్తం చదివితే ఈ విషయం బోధపడుతుంది. తుపాన్లు రాని ప్రాంతం ఎక్కడా ఉండదు. కోస్తా మొత్తం వస్తాయి. అన్నీ పరిశీలించాకే నివేదిక ఇచ్చాం. 

మూడు క్యాపిటళ్లు... నాలుగు రీజినల్‌ కమిషనరేట్లు
అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగానే మూడు క్యాపిటళ్లతో నివేదిక రూపొందించాం. దీంతోపాటు ప్రాంతాల వారీగా ప్రగతి కోసం రాష్ట్రాన్ని నాలుగు రీజినల్‌ కమిషనరేట్లతో అనుసంధానించాలనీ పేర్కొన్నాం. విశాఖపట్నం కేంద్రంగా విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో జోన్‌–1 ఏర్పాటు చేయాలన్నాం. ఏలూరు కేంద్రంగా ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాతో కలిపి జోన్‌–2, గుంటూరు కేంద్రంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను జోన్‌–3గా ఏర్పాటు చేయాలని సూచించాం. కడప కేంద్రంగా రాయలసీమ ప్రాంతాన్ని జోన్‌–4గా ఉంచాలని సూచించాం. రీజనల్‌ కమిషనర్లుగా సీనియర్‌ అధికారులను నియమించి పోలీసు వ్యవస్థతో అనుసంధానించాలని సిఫారసు చేశాం. ఏ ప్రాంతాల్లో ఏ తరహా పురోగతి అవసరమో ప్రత్యేకంగా పేర్కొన్నాం. ఆయా ప్రాంతాల  అభివృద్ధికి  ప్రణాళికల రూపకల్పన, కచ్చితమైన అమలు, అందుకు వీలుగా అధికారుల నియామకం చేపట్టాలని సూచించాం. 

కార్యాలయాల్లో కూర్చుని నిర్ణయించలేదు..
నిపుణుల ఆధ్వర్యంలో కమిటీ నివేదిక రూపొందించాం. ఇందులో ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలు లేవు. కార్యాలయాల్లో కూర్చుని ఏకపక్షంగా నిర్ణయించి నిర్ధారించలేదు. మా కసరత్తు అంతా శాస్త్రీయంగానే సాగింది. భూకంప ప్రభావిత జోన్లను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. ఇక ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటు అంటే రాజధాని మొత్తం విశాఖకు తరలుతుందని కాదు. ఈ విషయంలోనూ స్పష్టత ఇచ్చాం. అమరావతిలో ఇప్పటికే నిర్మించిన భవనాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే వీలుంది. వాటిని వాడుకోవాలని కూడా నివేదికలో పేర్కొన్నాం. గతంలో రైతులకు ఉన్న కమిట్‌మెంట్స్‌ (హామీలు) కూడా నెరవేర్చాలని పేర్కొన్నాం. 

పత్రికా ప్రకటనలు ఇచ్చాకే పర్యటించాం...
నివేదిక రూపొందించే విషయంలో ప్రజలందరినీ కలిశారా? అంటూ వితండవాదం ఎత్తుకోవటం సరికాదు. ప్రతి ఇంటికి వెళ్లి మాట్లాడరు. ఆయా ప్రాంతాలకు కమిటీ సభ్యులు వస్తున్నారని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చాకే పర్యటించాం. అమరావతిలో కూడా స్థానిక రైతులతో మాట్లాడాం. దాదాపు మూడు నాలుగు వేల మంది అక్కడి ఆఫీసుకు వచ్చి కమిటీ సభ్యులతో మాట్లాడారు. మా నివేదికను కొంత మంది తగలబెట్టడం బాధాకరం’’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement