ఆదిలాబాద్ జిల్లాలో విష జ్వరాలు జనాన్ని పీడిస్తున్నాయి.
అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో విష జ్వరాలు సామాన్యులను పీడిస్తున్నాయి. అంతగా వైద్య సౌకర్యాలు లేని నెన్నెల, జైపూర్, జైనూర్ మండలాల్లో జ్వర బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. నెన్నెల మండలం మందులపల్లిలో ఇంటికి ఇద్దరు చొప్పున జ్వరం బారిన పడ్డారు. వారం క్రితం గ్రామంలో పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించినప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు. దాదాపు 150 మంది మంచాన పడ్డారని గ్రామస్తులు తెలిపారు.
అలాగే, జైపూర్ మండలం వేలాల గ్రామంలో వంద మందికి పైగా జ్వరాల బారినపడ్డారు. స్థానిక పీహెచ్‌సీ బృందం గ్రామంలో వైద్య శిబిరం కూడా నిర్వహించింది. ఆయా మండలాల బాధితులు మంచిర్యాల, కరీంనగర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి తీవ్రంగా నష్టపోతున్నారు. ఐటీడీఏ పీవో కర్ణన్.. జైనూర్ మండల కేంద్రంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జ్వర బాధితులను బుధవారం పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.