అడుగడుగునా గుంతలే..!

Villages Roads Is Not Good In Adilabad District Rebbena - Sakshi

అధ్వానంగా మారిన  నంబాల–నారాయణపూర్‌ రోడ్డు

మరమ్మతుపై దృష్టి సారించని పాలకులు

ఇబ్బందుల్లో మూడు  గ్రామ పంచాయతీల ప్రజలు

రెబ్బెన : గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని పాలకులు చెబుతున్న మాటలు ఆచరణలో కనిపించడం లేదు. ఆయా గ్రామాలకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం సరిగా లేక ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. రోడ్డుపై అడుగడుగునా ఏర్పడిన గుంతలతో నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నాయే తప్ప పాల కుల్లో మాత్రం స్పందన కరువైంది. మండలంలోని నంబాల– నారాయణపూర్‌ ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో మూడు గ్రామ పంచాయతీల పరిధిలోని వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
గుంతల రోడ్డుతో అవస్థలు.. 
మండలకేంద్రంలోని రైల్వేగేట్‌ నుంచి నారాయణపూర్‌ వరకు గత కాంగ్రెస్‌ హయాంలో రూ. లక్షలు వెచ్చించి రోడ్డు మరమ్మతు చేపట్టారు. అధికారుల పర్యవేక్షణ కరువై పనుల్లో నాణ్యత కొరవడడంతో కొన్నాళ్లకే రహదారి ఛిద్రంగా మారిపోయింది. రైల్వేగేట్‌ నుంచి నారాయణపూర్‌ వరకు రోడ్డు మొత్తం అడుగడుగున గుంతలమయంగా మారిపోయింది. దీంతో ఈ రోడ్డు గుండా వెళ్లాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. ఈ దారి గుండానే మండలకేంద్రం మీదుగా బెల్లంపల్లి, మంచిర్యాల, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌ ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో గుంతలరోడ్డుపై ప్రయాణం చేయలేక ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు వాహనదారులు, ప్రయాణికులు. 
మూడు పంచాయతీ ప్రజలకు తప్పని తిప్పలు.. 
గుంతలమయంగా మారిన నంబాల–నారాయణపూర్‌ రోడ్డు మూలంగా నంబాల, నారాయణపూర్, కిష్టాపూర్‌ పంచాయతీ పరిధిలోని సుమారు 12 గ్రామాల ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. నిత్యం ఏదో పని నిమిత్తం ఆయా గ్రామాల ప్రజలు ఈ రోడ్డు గుండానే మండలకేంద్రానికి రాకపోకలు సాగిస్తుంటారు. రహదారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో నడుంనొప్పితో పాటు వాహనాలు సైతం త్వరగా పాడైపోతున్నాయని ప్రైవేట్‌ వాహనాల యజమానాలు, ద్విచక్రవాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డును బాగు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.  

గుంతలతో నరకం చూస్తున్నాం 
నంబాల నుంచి నారాయణపూర్‌ వరకు ఉన్న బీటీ రోడ్డు మొత్తం గుంతల మయంగా మారడంతో నిత్యం నరకం అనుభవిస్తున్నాం. రోడ్డు అధ్వానంగా మారినా మరమ్మతు మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇంకెన్ని రోజులు ఈ కష్టాలు పడాలో ఏమో.

రోడ్డు మరమ్మతు చేపట్టాలి 
నంబాల– నారాయణపూర్‌ రోడ్డు కు అధికారులు వెంటనే మరమ్మ తు చేపట్టాలి. రెబ్బెన రైల్వే గేట్‌ నుంచి మొదలు నారాయణపూర్‌ వరకు రోడ్డు పూర్తిగా చెడిపోయింది. ఈ రోడ్డుపై వెళ్లాలంటే జంకుతున్నాం. అత్యవసర సమయంలో రెబ్బెనకు చేరుకోవాలన్నా సకాలంలో చేరుకోలేకపోతున్నాం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top