భూమి కంపించింది

Vibrational Waves For Many Districts In Telugu States - Sakshi

ఆదివారం తెల్లవారుజామున 2.37 గంటలకు స్వల్ప భూప్రకంపనలు

తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు కంపన తరంగాలు

రిక్టర్‌ స్కేల్‌పై 4.6గా తీవ్రత నమోదు

ఆరు సెకన్ల పాటు కంపించిన భూమి

ఇళ్ల నుంచి బయటకొచ్చిన జనం

కంపన కేంద్రం సమీపంలో ఇళ్లకు బీటలు

సాక్షి నెట్‌వర్క్‌: అంతా గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్ధాలు వినిపించాయి. పడుకున్న తమను ఎవరో కదిపినట్లుగా అనిపించింది. దీంతో ఏం జరుగుతుందోనని తెలియక జనం ఇళ్ల నుంచి పరుగు పరుగున బయటకు వచ్చారు. అనంతరం ఇది భూకంపం అని తెలుసుకుని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.

ఈ ప్రకంపనలకు సంబంధించి సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పాతవెల్లటూరును భూకంప కేంద్రంగా ఎన్జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు. తెల్లవారుజామున సరిగ్గా 2.37 గంటల నుంచి 6 సెకన్లపాటు భూమి కంపించినట్లు ఇక్కడ ఏర్పాటు చేసిన సిస్మోగ్రాఫ్‌లో నమోదైందని తెలిపారు. భూమి పొరల్లో జరిగిన సర్దుబాట్ల ఫలితంగా ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు.

7 కిలోమీటర్ల లోతులో కంపన కేంద్రం..
వెల్లటూరు వద్ద (పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామం) ఏర్పాటు చేసిన సిస్మోగ్రాఫ్‌లో తెల్లవారుజామున 2.37 గంటల తర్వాత 6 సెకన్లపాటు భూమి కంపించినట్లు రికార్డయ్యింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 4.6గా నమోదైంది. భూమి పొరల్లో 7 కిలోమీటర్ల లోతులో ఉన్న భూకంప నాభి కేంద్రం నుంచి తరంగాలు వచ్చాయి. ఈ గ్రామానికి సమీపంలో ఉన్న గుడిమల్కాపురం, దొండపాడు, అడ్లూరు, శోభనాద్రిగూడెం, మల్లారెడ్డిగూడెం గ్రామంలో కంపన తరంగాలు భీకర శబ్ధంతో వచ్చాయి. తరంగాల ప్రభావం సుమారు 150 కిలోమీటర్లకు పైగా వెళ్లింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఖమ్మం, ఏపీలోని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భూమి కంపించింది. అయితే కంపన కేంద్రం వద్ద తరంగాల తీవ్రత ఎక్కువ ఉండటంతో వెల్లటూరు, నార్లబోడులోని ఇళ్లకు బీటలు పడ్డాయి.

అంతటా కలకలం..
ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా భూకంపం కలకలం రేపింది. ఏదో జరుగుతుందని ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ప్రజలు తెల్లవారే వరకు ఇళ్లలోకి వెళ్లలేదు. గతంలో కన్నా భీకర శబ్ధాలు ఎక్కువగా రావడంతో చింతలపాలెం, మేళ్లచెరువు, మఠంపల్లి మండలాల్లోని ప్రజలకు కునుకు పట్టలేదు. సమాచారం తెలుసుకున్న ఎన్జీఆర్‌ఐ శాస్త్రవేత్త నగేశ్‌ తన బృందంతో చింతలపాలెం మండలం మల్లారెడ్డిగూడెంలో సమావేశం ఏర్పాటు చేసి భూకంపాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. భూ కంపాలు వచ్చినప్పుడు ఇళ్ల నుంచి బయటకు రావాలని చెప్పారు. ఆయన వెంట ఎన్జీఆర్‌ఐ సాంకేతిక బృందంతోపాటు కోదాడ ఆర్డీవో కిశోర్‌కుమార్‌ ఉన్నారు.

నెల రోజుల్లో 300 సార్లు..
కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్న సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లో గత నెలరోజులుగా భూమి కంపిస్తోంది. భూకంపనాలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఇది భూకంప మా..? లేక ఇక్కడ ఉన్న మైనింగ్‌ తవ్వకాల వల్ల ఇలా జరుగుతుందా..? అనే విషయం చర్చించుకుంటున్నారు. అయితే ఒక్కోరోజు పదుల సంఖ్యలో కంపనాలు వస్తుండటం, ప్రజల భయాందోళనతో ఈ నెల 12న ఎన్జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు చింతలపాలెం మండలంలోని దొండపాడుతోపాటు కృష్ణానదికి అవతల ఉన్న గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కొత్తపల్లి వద్ద సిస్మోగ్రాఫ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఈ నెల 12 నాటి నుంచి ఇప్పటివరకు 300 సార్లు ఈ ప్రాంతంలో భూమి కంపించింది. ఈ కంపనాల తీవ్రత 2.5 దాటలేదు. రాష్ట్రంలో 1969 జూలై 13న భద్రాచలం సమీపంలో వచ్చిన భూకంప తీవ్రత వెల్లటూరు కన్నా తక్కువగా ఉందన్నారు.

ఖమ్మం జిల్లాను తాకిన కంపనాలు
భూ ప్రకంపనలు ఖమ్మం జిల్లాలోని 3 మండలాలను తాకాయి. జిల్లాలోని చింతకాని, ముదిగొండ, కూసుమంచి మండలాల్లో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 2.37 గంటలకు సమయంలో ఒక్కసారిగా భూమి 3 సెకన్ల పాటు కంపించింది. భూ ప్రకంపనల సమయంలో శబ్ధంతో ఇళ్లలో ఉన్న వస్తువులు కదులుతూ ఉండటంతో నిద్ర మత్తులో ఉన్న ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సరిగ్గా ఐదేళ్ల కిందట జనవరి 26న రాత్రి చింతకాని మండలంలో ఇలాగే స్వల్పం గా భూ ప్రకంపనలు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు.

చింతకాని మండలంలోని నాగులవంచ, మత్కేపల్లి, చినమండవ, పాతర్లపాడు, తిమ్మినేనిపాలెం, తిరుమలాపురం, చింతకాని, జగన్నాథపురం, గాంధీనగర్‌కాలనీ, రామకృష్ణాపురం, కొదుమూరు, లచ్చగూడెం గ్రామాల్లో భూ ప్రకంపనలు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. ముదిగొండ మండలంలోని గంధశిరి, బాణాపురం, వల్లబి, మాధాపురం గ్రామాల్లో భూమి కంపించినట్లు చెప్పారు. అలాగే కూసుమంచి మండలంలోని కేశ్వాపురం, అగ్రమారం, నేలపట్ల, జీళ్లచెరువు, కూసుమంచి, గట్టుసింగారం, గోరీలపాడుతండా తదితర గ్రామాల్లో భూమి కంపిచినట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు.

ఓరుగల్లులో కంపించిన భూమి..
ఉమ్మడి వరంగల్‌ పరిధి ధర్మసాగర్‌ మండల కేంద్రం, దుగ్గొండి మండలం ముద్దునూరు గ్రామంతోపాటు పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున రెండు నుంచి మూడు సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. గ్రామంలోని పలు ఇళ్లలో కొన్ని వస్తువులు కదిలినట్లు గ్రామస్తులు తెలిపారు. అలాగే పరకాల పట్టణంలోని గండ్రవాడ, హరితనగర్‌ ప్రాంతాల్లో భూమి కంపించిందని కాలనీవాసులు తెలిపారు.

ఏపీలోను ప్రకంపనలు
ఈ భూప్రకంపనలు కృష్ణా జిల్లా నందిగామ, జగ్గయ్యపేట, కంచికచర్ల, వీరులపాడు, చందర్లపాడు, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాలతోపాటు విజయవాడ నగరంలోని భవానీపురం, విద్యాధరపురం, గుంటూరు జిల్లా మాచవరం, బెల్లంకొండ, పిడుగురాళ్ల, అచ్చంపేట, తాడికొండ, క్రోసూరు, నాదెండ్ల, సత్తెనపల్లి తదితర మండలాల్లో అలజడి రేపాయి. 

నగరంలోనూ భూప్రకంపనలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో సంభవించిన భూప్రకంపనల తీవ్రత హైదరాబాద్‌ నగరాన్నీ తాకింది. అయితే దీని తీవ్రత నగరంలో తక్కువగానే నమోదైంది. బోయిన్‌పల్లి, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, నిజాంపేట్, ప్రగతినగర్‌ తదితర ప్రాంతాల్లో కొందరి ఇళ్లల్లో వస్తువులు కిందపడిపోయాయి

ప్రజలు ఆందోళన చెందొద్దు
రాతిపొరల్లో ఒత్తిడి వల్ల భూకంపాలు వస్తున్నాయి. ఇలా నిత్యం రావచ్చు.. రాకపోవచ్చు. ప్రకంపనలు వచ్చినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇళ్ల నుంచి బయటకు రావాలి. వెల్లటూరు వద్ద భూకంపన కేంద్రంగా గుర్తించాం. ఇక్కడ దీని తీవ్రత 4.6గా ఉంది. ఈ తరంగాలు తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ, ఖమ్మంతోపాటు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కృష్ణా జిల్లాల వరకు వెళ్లాయి. ఎక్కడా ఎలాంటి నష్టం జరగలేదు. ప్రజలు ఆందోళన చెందొద్దు. – నగేశ్, ఎన్జీఆర్‌ఐ శాస్త్రవేత్త

హైదరాబాద్‌కు ప్రమాదం లేదు 
హైదరాబాద్‌కు 150 నుంచి 200 కి.మీల దూరంలో చోటుచేసుకున్న భూప్రకంపనలు వల్ల నగరానికి ఎలాంటి ప్రమాదం లేదని ట్రిపుల్‌ ఐటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ప్రదీప్‌ రామన్‌చర్ల తెలిపారు. అయితే ఆయా ప్రాంతాలతోపాటు అన్ని చోట్లా ఇళ్ల నిర్మాణానికి ఫౌండేషన్‌ వేసేప్పుడు విధిగా ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ వేసుకొని నిర్మాణం చేస్తే ఎంతో మేలు చేకూరుతుందని సూచించారు.

అదేవిధంగా ఇంటి నిర్మాణం చేసిన తర్వాత గ్రౌండ్‌ఫ్లోర్‌లో పార్కింగ్‌ ఇచ్చేప్పుడు విధిగా షేర్‌వాల్‌ నిర్మాణం చేసుకోవడం తప్పనిసరని ఇళ్ల నిర్మాణదారులు గుర్తించాలన్నారు. ఇలాంటి సూచనలన్నీ నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌లో స్పష్టంగా పేర్కొన్నారని, వాటిని విధిగా పాటించి ఇళ్ల నిర్మాణం చేయాలన్నారు. ఇక్కడ కూడా చాలావరకు బహుళ అంతస్తుల నిర్మాణాలు చేస్తున్నారని, వాటిల్లో కూడా నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌కు అనుగుణంగా నిర్మాణం చేసుకోవాలన్నారు. – ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌ రిజిస్ట్రార్, ప్రదీప్‌ రామన్‌చర్ల

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top