వేణు సంకోజుకు కాళోజీ పురస్కారం

Venu Sankoju Gets Kaloji 2019 Literary Award - Sakshi

సాహితీసేవకుడికి కాళోజీ పురస్కారం

నేడు హన్మకొండలో అందుకోనున్న వేణు సంకోజు 

సాక్షి, నల్లగొండ: సాహితీసేవకుడు.. వేణు సంకోజుకు ప్రతిష్టాత్మకమైన కాళోజీ–2019 సాహితీ పురస్కారం వరించింది. ఆయన బుధవారం హన్మకొండలోని వాగ్దేవి కళాశాలలో నిర్వహించే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన వేణు సంకోజు 5 దశాబ్దాలుగా అనేక కవితలు, రచనలతో సాహితీ సేవలు కొనసాగిస్తున్నారు. ఆయన రాజనీతి శాస్త్రంలో ఎంఏ, ఎంఫిల్, పీజీడీసీఈ, జనర్నలిజంలో పీజీడీ సాధించారు. 1972 నుంచి కవితలు, కథలు, వ్యాసాలు, గ్రంథ రచనలు సాగిస్తున్నారు.  1984లో నల్లగొండలో జయమిత్ర సాంస్కృతిక సాహిత్య వేదిక స్థాపించి వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 

ఆయన రచనలు 
1995లో మనిషిగా పూచే మట్టి అనే తొలి కవితా సంపుటిని ప్రచురించారు. ఈ పుస్తకాన్ని ప్రజా కవి కాళోజీ నారాయణరావు ఆవిష్కరించడం విశేషం. 2001లో మలి కవితా సంపుటి మనం, 2008లో నేల కల, ప్రాణ ప్రదమైన కవితా సంపుటిలను ప్రచురించారు. 2008లో స్పర్ష కథల సంపుటి, ఇదే సంవత్సరం తెలుగులో కథా సాహిత్య పరిశోధనకు గాను ఎంఫిల్‌ పట్టాను పొందారు. విద్యార్థినుల రచనలతో చలనం అనే ఒక ప్రయోగాత్మక సంపుటిని, ప్రతిజ్ఞ అనే శ్రీశ్రీ సాహిత్య విశేష సంచికను ప్రచురించారు. 

ఉద్యమాల్లోనూ..కీలకపాత్ర
1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో కీలక సంబంధాలను కలిగి ఉండి అనేక ప్రసంగాలు, కవితా పఠనాలు, పత్ర సమర్పణలు చేశారు. 2001లో తెలంగాణ రచయితల వేదికను స్థాపించి 2007 వరకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2005 సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ పౌర శాస్త్ర పాఠ్యప్రణాళికా సభ్యునిగా, రచయితగా భూమిక నిర్వహించారు. ఇదే సంవత్సరం సుద్దాల హనుమంతు మోనోగ్రాఫ్‌ నిర్మాణంలో తెలుగు అకాడమీలో కీలకపాత్ర పోషించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో జిల్లా జేఏసీలో కీలకబాధ్యతలు నిర్వర్తించారు.

పురస్కారాలు
2001లో మనం అనే కవితా సంపుటికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం అందజేసింది. 2014లో తెలంగాణ అమెరికా ఎన్నారైల సంఘం వారు సాహితీ సేవ పురస్కారాన్ని అందజేశారు. 2002లో రామన్నపేట కాళోజీ కళావేదిక పురస్కారం, 2004లో చౌటుప్పల్‌ అక్షర భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పురస్కారం, 2006లో భువనగిరిలో ప్రజాభారతి పురస్కారం, 2012లో నెలవంక– నెమలీక సాహిత్య మాస పత్రిక వారి వచన కవితా పురస్కారం అందుకున్నారు. 2012లో స్థానిక తేజస్విని సంస్థ పక్షాన జీవన సాఫల్య పురస్కారం, 2014లో ముదిగంటి వెంకటనర్సింహారెడ్డి రాష్ట్రస్థాయి పురస్కారం , కరీంనగర్‌ శాతవాహన విశ్వవిద్యాలయం రాష్ట్రస్థాయి పురస్కారం, 2018లో తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ ప్రతిభా పురస్కారం అందుకున్నారు.  

 కాళోజీ స్మారక పురస్కారం గర్వకారణం 
కాళోజీ నారాయణరావు స్మారక పురస్కారం రావడం గర్వంగా ఉంది. నాకు ఆయనతో ఎనలేని అనుబంధం ఉంది. 1995లో నేను రచించిన మనిషిగా పూచే మట్టి అనే తొలి కవితా సంపుటిని ఆయన చేతుల మీదుగానే ఆవిష్కరించారు.  నాకు అందిన సాహితీ సా హిత్య పురస్కారాలన్నింటిలో ఇది ఎంతో ఆ త్మీయమైనదిగా భావిసు ్తన్నా. ఆయన ఉద్యమాలు, ఆయన రచనల ద్వా రా నేను ఇప్పటికే స్ఫూ ర్తిని పొందుతుంటాను. నేటి తరం కవులకు, రచయితలకు కాళోజీ నారాయణరావు ఆదర్శనీయులు.
 – వేణు సంకోజు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top