
'మోడీ భయంతోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది'
నరేంద్ర మోడీ భయంతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు.
హైదరాబాద్ : నరేంద్ర మోడీ భయంతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు. కేంద్రమంత్రి పదవి చేపట్టిన అనంతరం తొలిసారి హైదరాబాద్ వచ్చిన ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. బేగం పేట విమానాశ్రయం నుంచి వెంకయ్య నాయుడు ర్యాలీగా బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఆయనకు కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సన్మానించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరి సరికాదని వెంకయ్య అన్నారు. కేంద్రంతో సానుకూల వైఖరితోనే అభివృద్ధి సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. దత్తాత్రేయకు త్వరలోనే కేంద్రంలో బాధ్యతలు పెరుగుతాయని ఆయన తెలిపారు. మరోవైపు అంబర్ పేట బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఈ కార్యక్రమానికి గైర్హాజరు అయ్యారు. దేశంలో పేద ప్రజల కల సాకారం కాబోతుందని ఆయన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేస్తామని వెంకయ్య హామీ ఇచ్చారు.