బండెనక బండి.. రావాలే

Vehicle flow from 14 directions to Public meeting - Sakshi

ఔటర్‌పై 14 దిక్కుల నుంచి వాహన ప్రవాహం

జిల్లాల వారీగా వచ్చే వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్‌

19 ప్రాంతాల నుంచి సభాస్థలికి జులూస్‌లు  

ఆదివారం ప్రయాణాలు మానుకోవాలన్న ఆర్టీసీ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ నాలుగున్నరేళ్ల విజయ ప్రస్థానాలను పంచుకునేందుకు ఆదివారం కొంగర కలాన్‌లో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు దాదాపు పూర్తి కాగా, సభలో పాల్గొనే నిమిత్తం శుక్రవారం నుంచే పలు జిల్లాల నుంచి బండెనక.. బండి పెట్టి ట్రాక్టర్లు కదిలాయి. శనివారం ఉదయం నుంచే వాహనాలు సభాస్థలి పరిసరాలకు చేరుకునే అవకాశం ఉండటంతో పోలీసులు జిల్లాల వారీగా వచ్చే వాహనాలు, పార్కింగ్, తిరిగి వెళ్లే రూట్లను నిర్ధారించి వివరాలను వెల్లడించారు.

హైదరాబాద్‌ సహా జిల్లాల నుంచి వచ్చే వాహనాలన్నీ ఔటర్‌ రింగ్‌ రోడ్డు ద్వారానే వస్తుండటంతో మొత్తం 14 మార్గాలను ఎంపిక చేశారు. ఔటర్‌ రింగు రోడ్డు ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ దిగాలి, పార్కింగ్, తిరుగు ప్రయాణం తదితర వివరాలతో కూడిన రూట్‌మ్యాప్‌ను అన్ని జిల్లాలు, పార్టీ నాయకులకు పంపారు. జిల్లాలు, పార్కింగ్‌ నుంచి సుమారు 19 ప్రాంతాల నుంచి కళా ప్రదర్శనలు, అభివృద్ధి నమూనాలను చూపుతూ భారీ జులూస్‌లతో సభా ప్రాంగణానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రమాదాలకు తావులేకుండా లైన్‌ను పాటిస్తూ నిర్ణీత వేగంతో వాహనాలన్నీ ప్రయాణించేలా పోలీస్‌ యంత్రాంగం తగు ఇండికేషన్లతో పాటు ప్రత్యేక చర్యలు తీసుకోనుంది.
 
ఆదివారం ఔటర్‌పై ప్రయాణం వద్దు..
సెప్టెంబర్‌ 2న ఒక్కరోజు సాధారణ ప్రయాణికులు ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రయాణాన్ని మానుకోవాలని లేదా ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని హెచ్‌ఎండీఏ విజ్ఞప్తి చేసింది. ప్రగతి నివేదన సభతో ఔటర్‌పై భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్‌ డాక్టర్‌ జనార్దన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

అలాగే ఔటర్‌ మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లాలనుకునే ప్రయాణికులు సైతం ఇతర రూట్లను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే ప్రగతి నివేదన సభ కోసం ఆర్టీసీ తమ సర్వీసులను నడపాలని నిర్ణయించిన దరిమిలా.. ఆదివారం సిటీలో బస్సుల కొరత ఉంటుందని, ఆ ఒక్క రోజు ప్రయాణాలను మానుకోవాలని ఆర్టీసీ సైతం విజ్ఞప్తి చేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top