ఆర్టీసీ సమ్మె: కేసీఆర్‌తో ఎంపీ కేకే కీలక భేటీ

TSRTC Strike: MP KK Meets CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మెపై చర్చల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, ఎంపీ కే కేశవరావు, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ భేటీ అయ్యారు. ఆర్టీసీ జేఏసీతో చర్చల అంశాన్ని కేకే.. కేసీఆర్‌ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి సమ్మతమైతే.. ఆర్టీసీ జేఏసీతో చర్చలకు తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని కేకే కేసీఆర్‌తో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ మధ్య చర్చలకు హైకోర్టు విధించిన డెడ్‌లైన్‌ శుక్రవారంతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌తో కేకే భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 18వ తేదీ కల్లా చర్చలు ముగించి.. శుభవార్తతో రావాలని అటు ప్రభుత్వానికి, ఇటు ఆర్టీసీ జేఏసీకి హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే.

ఇక, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తాను మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధమని కేకే సంచలన ప్రకటన చేశారు. సమ్మె వెంటనే విరమించి.. చర్చలకు సిద్ధపడితే.. తాను మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధమని ఆయన ఒక ప్రతిపాదన చేశారు. ఆయన ప్రతిపాదనపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఒకింత సుముఖత వ్యక్తం చేశాయి. కేకే మధ్యవర్తిత్వంలో చర్చలకు సిద్దమని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో సమ్మె కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చల దిశగా కేసీఆర్‌-కేకే భేటీలో కీలక ముందడుగు ఏమైనా పడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరికాసేపట్లో కేసీఆర్‌ హుజూర్‌నగర్‌ ఎన్నికల సభలో పాల్గొనేందుకు వెళుతున్నారు.

అజయ్‌ సమీక్ష
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నగరంలోని రవాణా శాఖ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ గురువారం సమీక్ష నిర్వహించారు. రవాణా, ఆర్టీసీ అధికారులతో ఆయన చర్చించారు. సమ్మె నేపథ్యంలో తీసుకుంటున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మాట్లాడారు. ఇక, ఆర్టీసీ ఎండీ నియామకంపై ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top