మేమింతే..

Traffic Challans Rise in Hyderabad Lockdown Time - Sakshi

రోజుల్లో 2,55,934 ట్రాఫిక్‌ ఉల్లంఘనలు   

రోజుకు సుమారు 31,991 నిబంధనల అతిక్రమణ  

ట్రాఫిక్‌ నియమాలు పాటించని వాహన చోదకులు  

ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు రయ్‌రయ్‌

సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ ట్రాఫిక్‌ ఉల్లంఘనుల ముందు ఏమీ పనిచేయడం లేదు. గత ఎనిమిది రోజులుగా అంటే.. ఈ నెల 22 నుంచి 29 వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో నమోదైన 2,55,934 ఉల్లంఘన గణాంకాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. అంటే రోజుకు 31,991 మంది ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమిస్తున్నారు. చివరకు కేంద్రం ప్రకటించిన జనతా కర్ఫ్యూ రోజున సైబరాబాద్‌లో 8,947 ఈ– చలాన్‌ కేసులు, 85 కాంటాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేసులు నమోదవడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఆ రోజు జనాలు ఎవరూ రోడ్లపైకి రాకుండా ఇళ్లలోనే ఉండాలని చెప్పినా.. కొంతమంది ఈ విషయాన్ని పట్టించుకోలేదని ట్రాఫిక్‌ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి.  

మారని తీరు..   
కరోనా వ్యాప్తి నియంత్రణకు ఇంట్లోనే ఉండాలని నెత్తీ నోరూ బాదుకుంటున్నా నిత్యావసరాల కోసం రోడ్డుపైకి ఎక్కుతున్న వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడం కలవరానికి గురిచేస్తోంది. సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో జారీ చేసిన ఈ– చలాన్‌లలో ఎక్కువగా హెల్మెట్‌ లేకపోవడం, ట్రిపుల్‌ రైడింగ్‌ ఉండటం కలవరానికి గురిచేస్తోంది. ముఖానికి కనీసం మాస్క్‌ లేకుండా ప్రయాణిస్తున్న వాహనచోదకులు కూడా ఉన్నారని పోలీసులు అంటున్నారు. సైబరాబాద్‌లో 1,25,076 ఈ చలాన్‌ కేసులు, 3256 లేజర్‌ గన్‌ కేసులు, సర్వై లెన్స్‌ కెమెరా మానిటరింగ్‌ సిస్టమ్‌ ద్వారా 2870 కేసులు, సోషల్‌ నెట్‌వర్క్‌ ద్వారా అందిన ఫిర్యాదులతో 862 కేసులు మొత్తంగా 1,22,064 ఈ– చలాన్‌లు జారీ చేశారు. కాంటాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ద్వారా అంటే పోలీసులే నేరుగా వాహనాలు ఆపి వివిధ ట్రాఫిక్‌ ఉల్లంఘనల కింద 2,192 కేసులు నమోదుచేశారు. రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 19,869 ఈ– చలాన్, 611 లేజర్‌గన్‌ కేసులు, సోషల్‌ నెట్‌వర్క్‌ ద్వారా అందిన ఫిర్యాదులతో 56.. మొత్తంగా 20,536 ఈ– చలాన్‌లు జారీ చేశారు. కాంటాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ద్వారా అంటే పోలీసులే నేరుగా వాహనాలు ఆపి వివిధ ట్రాఫిక్‌ ఉల్లంఘనల కింద1,142 కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 1,10,000 ట్రాఫిక్‌ ఉల్లంఘనలు నమోదయ్యాయి.

నిబంధనలు పాటించాల్సిందే..
ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించి పరిమితికి మించి వాహనాలపై ప్రయాణిస్తుండటంతో కరోనా వ్యాప్తికి కారకులవుతారు. ఓ వైపు భౌతిక దూరం అంటూ చెబుతున్నా వాహనదారులు పాటించకపోవడం శోచనీయం. బైక్‌పై ఒక్కరూ, కారులో ఇద్దరికి మించి వెళ్లొద్దు. పరిమితికి మించి ప్రయాణికులతో పాటు హెల్మెట్‌ ధరించకపోవడం, కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్‌ జంపింగ్, అధిక వేగంతో వాహనాలు దూసుకెళుతున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. అత్యవసరమైతే  రోడ్లపైకి రావాలి. లేనిపక్షంలో ఇంట్లోనే ఉండటం మంచిది  – సజ్జనార్, సైబరాబాద్‌ సీపీ

మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో ఇలా..
హైదరాబాద్‌ – 1,10,000
సైబరాబాద్‌ – 1,24,256
రాచకొండ –  21,678

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top