విజృంభిస్తున్న విష జ్వరాలు! 

Toxic fevers was booming! - Sakshi

ఏజెన్సీ ప్రాంతాల్లో 6,210 కేసుల నమోదు 

ఆదిలాబాద్‌లో డయేరియాతో నలుగురు మరణం 

పెద్దపల్లిలో విషజ్వరాలతో 11, డెంగీతో ఇద్దరు మృతి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్‌తో పాటు డెంగీ జ్వరాలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో నిండిపోతున్నాయి. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోతే రోగుల సంఖ్య మరింత పెరిగి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే ప్రమాదముందని నిపుణులు పేర్కొంటున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మలేరియా, టైఫాయిడ్‌తో పాటు చికున్‌గున్యా, డెంగీ వంటి విష జ్వరాలు సోకడంతో ఇప్పటికే అనేక మంది ఆస్పత్రి పాలయ్యారు. పట్టణ ప్రాంతాల్లో కూడా రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మహిళలు, చిన్నారులు, విద్యార్థులు అంతా విషజ్వరాల బారినపడుతున్నారు. కొన్ని జిల్లాల్లో విషజ్వరాలతో పాటు ఇతర సీజనల్‌ వ్యాధుల కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆస్పత్రికి వచ్చే ఔట్‌ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. 

ఏజెన్సీ ప్రాంతాల్లో సమస్య తీవ్రం.. 
ఏజెన్సీ ప్రాంతాలైన ఆదిలాబాద్, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాచలం జిల్లాల్లో విషజ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలో ఇప్పటివరకు 6,210 కేసులు నమోదయ్యాయి. జిల్లా ఆస్పత్రిలో 123 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో ఆదిలాబాద్‌ జిల్లాలో డయేరియా బారిన పడి నలుగురు మృతి చెందారు. మరో 35 డెంగీ కేసులు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో ఇటీవల విషజ్వరాల తో 11 మంది, డెంగీతో మరో ఇద్దరు మృతి చెందా రు. యాదాద్రి జిల్లాలో ఇప్పటికే 4 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చి పరీక్షలు చేసుకున్న వారిలో 99 మందికి డెంగీ ఉన్నట్లు నిర్ధారించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 28 డెంగీ కేసు లు, 27 చికున్‌గున్యా కేసులు నమోదైనట్లు తెలిసింది. వరంగల్‌ జిల్లాలోనూ డెంగీ లక్షణాలతో పిల్లలు అధిక సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. సీజనల్‌ వ్యాధులు వ్యాపించడంతో జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో పడకలు ఖాళీ లేక రోగులను వెనక్కి పంపేస్తున్నారు. 

పరిస్థితి చేయిదాటిపోతే.. 
డెంగీ మరణాలతో జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. జిల్లాల్లో వందలాది మంది రోగులు డెంగీ లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్నారు. ఇప్పటికే 10 మంది దాకా మృత్యువాత పడ్డారు. డెంగీ రోగులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. సరైన వైద్యం అందక చాలా మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా భావించిన ప్రైవేటు ఆస్పత్రులు పరీక్షల పేరిట వేల రూపాయలు దండుకుంటున్నాయన్న ఆరోపణలు వస్తున్నా యి. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీ కేంద్రాల్లో వైద్యుల కొరతతో రోగులు తప్పనిసరై ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తుండటంతో చెత్తా చెదారం పేరుకుపోయింది. దీనికి వర్షం తోడు కావటంతో రోగాలు ప్రబలుతున్నాయి. అధికారికంగా జిల్లాలో ఇప్పటివరకు సుమారు 10 వరకు డెంగీ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు చెబుతున్నారు. 

గత గణాంకాల్లోకి వెళ్తే.. 
గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు దేశ వ్యాప్తంగా 78,691 డెంగీ కేసులు నమోదు కాగా.. 122 మంది చనిపోయినట్లు కేంద్రం తన నివేదికలో వెల్లడించింది. 2016లో 1,29,166 కేసులు నమోదైతే 245 మంది చనిపోయారు. మలేరియా కేసులు గత నెల వరకు 4,10,141 నమోదు కాగా, సాధారణ మలేరియా కేసులు 5,92,905 రికార్డయ్యాయి. 75 మంది ప్రాణాలు కోల్పోయారు. 2015లో 99,913 డెంగీ కేసులు నమోదుకాగా.. 220 మంది మృతి చెందారు. 2013లో 75,808 డెంగీ కేసులు నమోదు కాగా.. 192 మంది చనిపోయారు. 2011 కంటే 2012లో ఏకంగా 50,222 మందికి డెంగీ సోకగా 242 మంది మృత్యువాతపడ్డారు. 2010లో 28,292 డెంగీ కేసులు నమోదుకాగా.. 110 మంది మృతి చెందారు. ఈ ఏడాది కూడా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జ్వరాలు ఎక్కువగా సోకే అవకాశముందని కేంద్రం రాష్ట్రాలను హెచ్చరించింది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top