
తెలంగాణ ఏ ఒక్కరి సొమ్ముకాదు
‘తెలంగాణ మీ తాత, ముత్తాతల సొమ్ముకాదని..’ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులపై టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గైని గంగారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలెక్టరేట్,న్యూస్‌లైన్ : ‘తెలంగాణ మీ తాత, ముత్తాతల సొమ్ముకాదని..’ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, కేంద్ర మం త్రి వెంకయ్యనాయుడులపై టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గైని గంగారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని నిరసిస్తూ గురువారం టీఆర్‌ఎస్ తెలంగాణబంద్‌కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఉ ద్యోగులు మధ్యాహ్నం భోజన సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించిన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రగతి భవన్ వద్ద తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, ఇటీవల మరణించిన ఉద్యోగులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గైని గంగారాం మాట్లాడారు.
తెలంగాణ ఆదివాసీలకు మరణశాసనం రాస్తూ ఇలా ఆర్డినెన్స్ తీసుకురావడానికి కారకులు చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడులే అని మండిపడ్డారు. 2019లో తెలంగాణలో టీడీపీ పాగా వేస్తుందని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో కనీసం రెండు శాతం ఓట్లు కూడా రాని నీవు, నీ పార్టీ తెలంగాణలో ఏవిధంగా ఉనికి చాటుతుందో చూస్తామన్నారు. ఉచిత హామీల తో ఆంధ్రాలో అధికారం సాధించుకున్న బాబు, ముందు సీమాంధ్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవే ర్చాలన్నారు. ఇక ఆంధ్రా బాబులు తెలంగాణ ప్రాంతాన్ని,ప్రజలను మరిచి పోవాలన్నారు.
వారికి తెలంగాణ ప్రజల మనసులో స్థానం లేదని తేలిపోయిందన్నారు. తెలంగాణ ప్రాంతంపై ఆంధ్రాప్రాంత నాయకులు ఇంకా తమ ఆధిపత్యం కొనసాగించాలని చూస్తున్నారన్నారు. వారి ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గిందన్నారు. పోలవరంపై కేంద్రం పునరాలోచించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘పోలవరం’ డిజైన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మార్చాలన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోకుంటే మరో తెలంగాణ పోరు తప్పదన్నారు. గురువారం నుంచి భద్రాచలం ఎమ్యెల్యే సున్నం రాజయ్య చేపట్టబోయే ఆమరణ నిరాహార దీక్షకు ఉద్యోగులు,జిల్లా ప్రజలు పూర్తి మద్దతు తెలుపుతున్నారన్నారు.
ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక టో తేదీన అర్ధరాత్రి 12.05 గంటలకు స్థానిక టీఎన్జీవోస్ కార్యాలయం ఎదుట జాతీయ జెండా ఆవిష్కరిస్తామని తెలిపారు. రెండో తేదీన ఉదయం 10 గంటలకు స్థానిక ప్రగతి భవన్ ముందు తెలంగాణ రాష్ట్ర సంబురాలు ప్రారంభమవుతాయన్నారు. ముందుగా అమరవీరులకు నివాళులు అర్పించి అనంతరం ఉద్యోగులతో నగరంలోని తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం వద్దకు ర్యాలీగా బయలు దేరుతామన్నారు.
అక్కడ నివాళులు అర్పించి, ప్రగతిభవన ముందు ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలంగాణ ధూంధాం, ఆటపాట, తెలంగాణ కవులు,కళాకారులతో పండుగ జరుపుకుంటామన్నారు. అనంతరం టీజీఓ అధ్యక్షుడు బాబురావు,టీఎన్జీవోస్ కార్యదర్శి కిషన్‌లు మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను సీమాంధ్ర ప్రాంతాల్లో కలుపడం తెలంగాణ ప్రాంతాన్ని ఇంకా దోచుకోవడమే అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును పెంచడం వల్ల 500కు పైగా గ్రామాలు జలసమాధి అయ్యే ప్రమాదం ఉందన్నారు.
తెలంగాణ ప్రాంతంలో ఒక్క అంగుళం భూమిని కూడా ఆంధ్రా ప్రాంతానికి వదిలేది లేదన్నారు. కార్యాక్రమంలో టీఎన్జీవోస్ సెంట్రల్‌యూనియన్ నాయకులు సుధాకర్, నరేం దర్, అమృత్‌కుమార్,దయానంద్‌తో పాటు రెవె న్యూ అసోసియేషన్ నాయకులు డేవిడ్, సత్యనారాయణ, రమణారెడ్డి, విజయ్‌కాంత్‌రావు, శ్రీనివాస్, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కమలాకర్‌రావు,బీసీ ఉపాధ్యాయ సంఘం నాయకులు మాడవేడి వినోద్‌కుమార్, రేవంత్, రమేష్, సహదేవ్, ఆయా శాఖలకు చెందిన ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.