ఆర్టీసీ సమ్మెకు టీఎన్జీవో మద్దతు

TNGOs Extends Their Support To TSRTC Strike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కార్మికుల సమ్మెకు టీఎన్జీవో మద్దతు ప్రకటించింది. ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టు తెలిపింది. ఆర్టీసీ సమ్మెలో తాము కూడా భాగస్వాములం కానున్నట్టు వెల్లడించింది. కాగా, తాము చేపట్టిన సమ్మెకు మద్దతు తెలుపాలని కొద్ది రోజులుగా ఆర్టీసీ జేఏసీ నాయకులు ఉద్యోగ సంఘాలను కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ జేఏసీ నాయకులు మంగళవారం టీఎన్జీవో నేతలతో బేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమకు మద్దతుగా నిలవాలని జేఏసీ నాయకులు.. టీఎన్జీవో నేతలను కోరారు. 

భేటీ అనంతరం టీఎన్జీవో అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు బాధకరమన్నారు. ఆర్టీసీ సమ్మెలో తాము కూడా భాగస్వాములమవుతామని తెలిపారు. బుధవారం ఉద్యోగ సంఘాల సమావేశం జరగనుందని.. సీఎస్‌ను కలిసి సమస్యలను వివరిస్తామని చెప్పారు. సమస్యలు పరిష్కారం కాకుంటే మరో సకల జనుల సమ్మెకు సిద్ధం కావాల్సి వస్తోందని హెచ్చరించారు. రేపు తమ కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. 

ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవోలు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. టీఎన్జీవోలు ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలుపడం సంతోషంగా ఉందన్నారు. 
 తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టీసీ తిరోగమనంలో పడిందన్నారు. ఆర్టీసీలో కొత్త నియామకాలు లేవని.. రూ. 1400 కోట్ల కార్మికుల పీఎఫ్‌ సొమ్మును యాజమాన్యం వాడుకుందని ఆరోపించారు. తప్పని పరిస్థితుల్లోనే తాము సమ్మె నోటీసు ఇచ్చినట్టు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో లేనివాళ్లు తమను విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని.. ప్రస్తుతానికి సమ్మె యథావిథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top