మూడో టీఎంసీ లెక్క కొలిక్కి! | Three Lifts are Set up for Mallanna Sagar | Sakshi
Sakshi News home page

మూడో టీఎంసీ లెక్క కొలిక్కి!

Apr 13 2019 4:50 AM | Updated on Apr 13 2019 4:50 AM

Three Lifts are Set up for Mallanna Sagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక అంకానికి ప్రాణం పోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే మేడిగడ్డ నుంచి రోజుకు 2 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేలా చర్యలు చేపడుతున్న ప్రభుత్వం.. కొత్తగా మూడో టీఎంసీ నీటిని తీసుకునేందుకు కార్యాచరణ రూపొందించి అనుమతులిచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో అదనపు మోటార్ల ఏర్పాటుకు అయ్యే వ్యయం, మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్‌ వరకు అయ్యే వ్యయ అంచనాలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అనుమతి కోసం నీటిపారుదల శాఖ పంపింది. దీనికి సీఎం ఆమోదం తెలిపిన వెంటనే ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేయనుంది. 
ఆమోదమే తరువాయి.. 
రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా మేడిగడ్డ పంప్‌హౌజ్‌ వద్ద 11, అన్నారం వద్ద 8, సుందిళ్ల వద్ద 9 మోటార్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మూడో టీఎంసీ నీటిని తీసుకునేందుకు వీటికి అదనంగా మూడు పంప్‌హౌజ్‌లలో కలిపి మరో 15 మోటార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పుడున్న వాటితో కలిపి అదనంగా మేడిగడ్డలో 6, అన్నారంలో 4, సుందిళ్లలో 5 మోటార్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ అదనపు మోటార్ల ఏర్పాటుతో పాటు, వాటి ఏర్పాటుకు అనుగుణంగా పలు నిర్మాణాలు చేయాల్సి ఉండటంతో వ్యయం పెరుగుతోంది.  

పెరిగిన అంచనా వ్యయం.. 
గత అంచనా ప్రకారం మూడు పంప్‌హౌజ్‌లకు కలిపి రూ.7,998 కోట్లు ఉండగా, ప్రస్తుతం అది రూ.12,392 కోట్లకు చేరనుంది. ఈ పంప్‌హౌజ్‌ల ద్వారా ఎల్లంపల్లికి వచ్చే నీటిని మిడ్‌మానేరు వరకు తరలించే ప్రక్రియ కోసం అప్రోచ్‌ చానల్, గ్రావిటీ కాల్వ, టన్నెళ్ల నిర్మాణాలకు రూ.10,500 కోట్లు అంచనా వేశారు. మిడ్‌మానేరు నుంచి ఒక టీఎంసీ నీటిని అనంతగిరి రిజర్వాయర్, అటునుంచి రంగనాయక్‌సాగర్‌ తిరిగి అటునుంచి కొమురవెల్లి మల్లన్నసాగర్‌ వరకు తరలించేలా కొత్త ప్రణాళిక సిద్ధం చేశారు. దీనికోసం అదనంగా 11,500 క్యూసెక్కుల సామర్థ్యంతో గ్రావిటీ కాల్వలు, అప్రోచ్‌ చానల్, టన్నెళ్లు, 3 పంప్‌హౌజ్‌ల నిర్మాణాలు అవసరం ఉంటాయని లెక్కగట్టారు. దీనికై మొత్తంగా రూ.12,594కోట్లు ఖర్చవుతుందని ప్రణాళిక వేశారు. మొత్తం రూ.27,488 కోట్ల మేర అదనపు వ్యయం అవుతుందని అంచనా వేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement