మళ్లీ షరా మామూలే. కేంద్రంలో ప్రభుత్వాలు మారినా కరీంనగర్ జిల్లాపై వివక్ష కొనసాగుతూనే ఉంది.
రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు కంటితుడుపు కేటాయింపులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : మళ్లీ షరా మామూలే. కేంద్రంలో ప్రభుత్వాలు మారినా కరీంనగర్ జిల్లాపై వివక్ష కొనసాగుతూనే ఉంది. గతంలో మాదిరిగానే రైల్వే బడ్జెట్‌లో ఈసారి కూడా జిల్లాకు నిరాశే ఎదురైంది. పార్లమెంట్‌లో 53 పేజీల ప్రసంగ పాఠాన్ని చదివిన రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు జిల్లా పేరు కాదు కదా, కనీసం తెలంగాణ రాష్ట్రం ఊసే ఎత్తలేదు. ముఖ్యమంత్రి డ్రీమ్ ప్రాజెక్టు కొత్తపల్లి-మనోహరాబాద్ ప్రాజెక్టుకు కేంద్రం పెట్టిన అడ్డగోలు షరతులన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం తలూపినా... జిల్లా ఎంపీలిద్దరు కాలికి బలపం కట్టుకుని ఢిల్లీ చుట్టు చక్కర్లు కొట్టినా.. కంటి తుడుపు చర్యలతోనే సరిపెట్టారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా చీఫ్ ఇంజనీర్, డివిజనల్ ఇంజనీర్ కార్యాలయ ఏర్పాటుకు రూ.20 కోట్లు కేటాయించారే తప్ప ప్రాజెక్టు పనులను ప్రస్తావించలేదు. దశాబ్దాలుగా పెండింగ్‌లో రామగుండం-మణుగూరు ప్రాజెక్టుపై స్పందించని కేంద్రం.. రెండు దశాబ్దాల నాటి పెద్దపల్లి-నిజామాబాద్ రైలు ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రూ.140 కోట్లు కేటాయించింది. ఉప్పల్, బిజిగిరీషరీఫ్ రైల్వే ఓవర్ బ్రిడ్జిల(ఆర్‌వోబీ) నిర్మాణానికి రూ.110 కోట్లు కేటాయించిన రైల్వే శాఖ.. కరీంనగర్‌లోని మంచిర్యాల చౌరస్తావద్ద నిర్మించ తలపెట్టిన ఆర్‌వోబీకి మాత్రం మొండి చేయిచూపింది.
ఈసారి ఇంతే!
రూ.20 కోట్లతో ‘కల’ సాకారమయ్యేదెన్నడు?
కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే నిర్మాణం ముఖ్యమంత్రి కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్టు. కరీంనగర్ ఎంపీ హోదాలో ఉండగా ఈ ప్రాజెక్టును మంజూరు చేయించారు. 154.2 కిలోమీటర్ల పొడవైన ఈ రైలు మార్గానికి అంచనా వ్యయం రూ.952.95 కోట్లు. 2006-07 బడ్జెట్‌లో రూ.5కోట్లు, ఆ తరువాత రూ.2కోట్ల మాత్రమే కేటాయించి చే తులు దులుపుకున్నారు. గత ఐదేళ్లుగా పైసా కేటాయించలేదు. కేసీఆర్ సీఎం ప గ్గాలు చేపట్టాక దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రాజెక్టు వ్యయంలో మూడో వం తు (రూ.317.65 కోట్లు) నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు ఒప్పుకున్నారు. దీనికితోడు ప్రాజెక్టుకు అవసరమైన భూమిని మొత్తాన్ని సేకరించి ఇచ్చే బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అట్లాగే చరిత్రలో ఎన్న డూ లేనివిధంగా ఐదేళ్ల నష్టాన్ని కూడా భరించేందుకు సిద్ధమని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇన్ని షరతులకు ఒప్పుకున్న నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో ప్రాజెక్టు నిధులను మంజూరు చేయడం ఖాయమని అధికార పార్టీ నేతలంతా భావించారు. కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా కేంద్ర పెద్దలను కలిసి ఒత్తిడి తెచ్చారు. తీరా చూస్తే బడ్జెట్ రూ.20 కోట్ల కేటాయించడం అందరినీ విస్మయపరిచింది. ఆ డబ్బును కూడా రైల్వే శాఖ అధికారుల కార్యాలయాల ఏర్పాటుకు వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.
రామగుండం-మణుగూరులైన్‌సర్వేకే పరిమితం
రైల్వే పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించినప్పటికీ 33 ఏళ్ల క్రితం మంజూరైన రామగుండం-మణుగూరు ప్రాజెక్టు రైలు మార్గం ప్రస్తావన తీసుకురాలేదు. ఈ రైల్వే లైన్ సర్వే కోసం రూ.50 లక్షలు కేటాయించినట్లు పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ తెలిపారు. వాస్తవానికి ఆనాడు రూ.657 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 2013-14 ప్రణాళిక సంఘంలో చేర్చి ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడతామని ప్రకటించినప్పటికీ తాజా బడ్జెట్‌లో రూ.50 లక్షలతోనే సరిపెట్టడంతో ప్రాజెక్టు పనులు జరిగే అవకాశాల్లేకుండా పోయాయి. 22 ఏళ్లనాటి పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఈసారి బడ్జెట్‌లో రూ.140 కోట్లు కేటాయించినట్లు టీఆర్‌ఎస్ ఎంపీలు చెబుతున్నప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఎంపీ ఒత్తిడితో ఆర్‌వోబీలకే కేంద్రం గ్రీన్‌సిగ్నల్
కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ తొలిసారి ఎంపీగా ఎన్నికైన సమయంలో జమ్మికుంట రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌వోబీ) మంజూరైంది. మళ్లీ ఎంపీగా ఎన్నికయ్యాక ఉప్పల్ ఆర్‌వోబీతోపాటు బిజిగిరిషరీఫ్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులను మంజూరు చేయించడంలో సఫలీకృతులయ్యారు. తాజా బడ్జెట్‌లో ఉప్పల్ రైల్వేస్టేషన్ పరిధిలోని ఆర్‌ఓబీ నిర్మాణానికి రూ.53.64 కోట్లు, బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఆర్‌ఓబీ నిర్మాణానికి రూ.50.01 కోట్లు కేటాయించారు.
పెద్దపల్లి పరిధిలోనూ మూడు ఆర్‌ఓబీలకు అనుమతి
తాజా బడ్జెట్‌లో పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని పెద్దంపేట-రామగుండం, మంచిర్యాల-రవీంద్రఖని, బెల్లంపల్లి-రేచిన్‌రోడ్ స్టేషన్ల మధ్యన రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్రం అనుమతి లభించింది. అయితే ఎన్ని నిధులు కేటాయించారనే విషయంలో స్పష్టత లేదు. అట్లాగే రాఘవపూర్-మందమర్రి మధ్య మూడో లైన్ పనుల కోసం రూ.25 కోట్లు, పెద్దంపేట్-మంచిర్యాల మధ్య మూడోలైన్ కోసం రూ.58 కోట్లు కేటాయించారు.
వీటి ఊసేది?
కరీంనగర్-తిరుపతి రైలుకు కరీంనగర్ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయడంతోపాటు ప్రతిరోజూ నడపాలన్న ప్రతిపాదనను పట్టించుకోలేదు. కరీంనగర్ స్టేషన్ నుంచి గ్రానైట్ రవాణాను పెంచేందుకు అదనపు ర్యాక్‌లను ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తిని పక్కనపెట్టారు. జగిత్యాల-కాగజ్‌నగర్ వరకు నడిచే పుష్పుల్ రైలులో టాయిలెట్లు ఏర్పాటు చేయాలని చేసిన సూచనను విస్మరించారు. కరీంనగర్-సికింద్రాబాద్, కరీంనగర్-విజయవాడ, కరీంనగర్-బాలార్షా పుష్పుల్ రైళ్లను పెద్దపల్లి మీదుగా నడపాలనే ప్రతిపాదనను గాలికొదిలేశారు. సింగరేణి కార్మికుల కోసం హైదరాబాద్-కాగజ్‌నగర్‌కు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను రైలును ప్రవేశపెట్టాలనే డిమాండ్‌ను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు.
పెద్దపల్లిలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్, డిస్‌ప్లే బోర్డు, బాంబే, మంగళూరు, షిరిడీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కాజీపేట వరకు పొడిగింపు, రామగిరి, భాగ్యనగర్, తెలంగాణ, సింగరేణి రైళ్లకు అదనపు బోగీల ఏర్పాటు, భాగ్యనగర్, కాజీపేట-నాగపూర్ ప్యాసింజర్ రైళ్లలో కోచ్‌ల సంఖ్య పొడిగింపు ప్రతిపాదనలపైనా పెదవి విప్పలేదు. తాండూరు, పాతబెల్లంపల్లి రైల్వే గేట్లవద్ద ఆర్‌వోబీల నిర్మాణం, కమాన్‌పూర్ మండలం రాణాపూర్, కన్నాలవద్ద హైలెవల్ వంతెనలు నిర్మించాలనే ప్రతిపాదనలను రైల్వే మంత్రి పట్టించుకోలేదు. వీటిపై దక్షిణ మధ్య రైల్వే జీఎం స్పందిస్తారని అధికార పార్టీ ఎంపీలు చెప్పినప్పటికీ... గురువారం సాయంత్రం దక్షిణ మధ్య రైల్వే జీఎం విడుదల చేసిన ప్రకటనలో వాటి ఊసే లేకపోవడం గమనార్హం.