రెగ్యులర్‌ టీచర్లు ఉండాల్సిందే

There should be regular teachers - Sakshi

2022 నాటికి పారా టీచర్ల విధానం రద్దు చేయాల్సిందే 

న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీ ముసాయిదాలో స్పష్టం చేసిన కమిటీ 

రాష్ట్రంలో పారా టీచర్ల స్థానంలో వచ్చిన విద్యా వలంటీర్ల వ్యవస్థ 

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా పారా టీచర్‌ సహా ఏ రకమైన పేరుతో తాత్కాలిక టీచర్లు ఉన్నా ఆ వ్యవస్థను తొలగించాల్సిందేనని నూతన విద్యా విధానం ముసాయిదా రూపొందించిన కమిటీ సిఫారసు చేసింది. ‘సమాజంలో సుదీర్ఘకాలం ఉండే బలమైన బంధాన్ని కల్పించేది విద్యా వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో టీచర్లే కీలకం. పారా టీచర్, శిక్షా కర్మి, శిక్షా మిత్ర తదితర పేర్లతో ఉండే తాత్కాలిక టీచర్లు ఆ పనిని పక్కాగా చేపట్టలేరు. అందుకే 2022 నాటికి తాత్కాలిక టీచర్ల వ్యవస్థను రద్దు చేయాల్సిందే’అని స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల్లో గతంలో పారా టీచర్ల వ్యవస్థ ఉన్నా, సర్వ శిక్షా అభియాన్‌ వచ్చాక తెలుగు రాష్ట్రాల్లో విద్యా వలంటీర్ల పేరుతో ఉపాధ్యాయ ఖాళీల్లో తాత్కాలిక టీచర్ల నియామకాలను ప్రభుత్వం చేపడుతోంది. రెగ్యులర్‌ టీచర్ల నియామకాలు ఆలస్యమైనప్పుడు, నియామకాలు సకాలంలో చేపట్టలేకపోయినప్పుడు, పాఠశాలల్లో టీచర్ల అవసరం ఏర్పడినప్పుడు విద్యా వలంటీర్లను నియమించి ప్రభుత్వం విద్యా బోధనను కొనసాగిస్తోంది. ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరిస్తోంది. అయితే విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందాలన్నా, సమాజ నిర్మాణం సరిగ్గా ఉండాలన్నా రెగ్యులర్‌ టీచర్లతోనే సాధ్యం అవుతుందని కమిటీ స్పష్టం చేసింది. 

ఐదేళ్లుగా లేని నియామకాలు.. 
రాష్ట్రంలో 2012 డీఎస్సీ నియామకాల తరువాత కొత్త టీచర్లు బడులకు రాలేదు. 2017లో నోటిఫికేషన్‌ జారీ చేసి 8,792 పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టినా నియామకాలు పూర్తి కాలేదు. న్యాయ వివాదాలు, ఎలక్షన్‌ కోడ్‌ పేరుతో కొన్నాళ్లు, విద్యా శాఖ అధికారులు పట్టించుకోక మరికొన్నాళ్లు ఆలస్యమైంది. మళ్లీ ఇప్పుడు సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ వంటి కొన్ని పోస్టుల భర్తీ వ్యవహారం కూడా న్యాయ వివాదాల్లో చిక్కుకుంది. దీంతో పోస్టుల భర్తీ ఆలస్యం అవుతూనే ఉంది. వివాదాలు లేని పోస్టుల భర్తీ విషయంలోనూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో బడులకు కొత్త టీచర్లు రాలేని పరిస్థితి నెలకొంది. 

ఏళ్ల తరబడి వేలల్లో విద్యా వలంటీర్లు.. 
రాష్ట్రంలో గత ఏడేళ్లుగా రెగ్యులర్‌ టీచర్లు లేకపోవడంతో విద్యా వలంటీర్లతోనే పాఠశాలలను కొనసాగించాల్సి వస్తోంది. ఏటా కనీసం పది వేల మందికి తగ్గకుండా విద్యా వలంటీర్లను నియమిస్తూ పాఠశాలల్లో విద్యా బోధనను విద్యాశాఖ కొనసాగిస్తోంది. ఉపాధ్యాయ ఖాళీలు, అదనపు అవసరం ఉన్న స్కూళ్లలో మొత్తంగా గతేడాది 15,661 మంది విద్యా వలంటీర్లను నియమించి విద్యా బోధనను కొనసాగించిన విద్యాశాఖ.. ఈ విద్యా సంవత్సరంలోనూ అదే చర్యలు చేపట్టింది. చివరకు విద్యా వలంటీర్ల నియామకం విషయంలోనూ కోర్టు ఆదేశాలు ఇస్తే తప్ప ముందుగా నియమించలేని పరిస్థితికి చేరుకుంది. హైకోర్టు ఆదేశాలతో ఇటీవల ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అది కూడా గతేడాది నియమించిన విద్యా వలంటీర్ల సంఖ్యకు మించకుండా నియమించుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో విద్యా వలంటీర్ల రెన్యువల్‌కు చర్యలు చేపట్టింది. 

సిఫారసుల మేరకైనా వేగవంతం చేయాలి.. 
రాష్ట్రంలోని పాఠశాలల్లో రెగ్యులర్‌ టీచర్ల నియామకం విషయంలో గత ఏడేళ్లుగా తంటాలు తప్పడం లేదు. చివరకు హైకోర్టు జోక్యం చేసుకున్నా నియామకాల వ్యవహారం ముందుకు సాగడం లేదు. మహబూబ్‌నగర్‌లో టీచర్లు లేరంటూ హైకోర్టులో పిల్‌ దాఖలు అవ్వడంతో ప్రభుత్వం స్పందించి తాత్కాలికంగా విద్యా వలంటీర్లను నియమించి బోధన కొనసాగిస్తోంది. ప్రస్తుతం నూతన విద్యా విధానం ముసాయిదాలో 2022 నాటికి ఎలాంటి పేరుతోనూ తాత్కాలిక టీచర్లు ఉండొద్దని, ఆ వ్యవస్థను రద్దు చేయాల్సిందేనని, రెగ్యులర్‌ టీచర్లు ఉండాల్సిందేనని పేర్కొంది. అయితే న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీ అమల్లోకి వచ్చిన తరువాత అయినా రాష్ట్రంలో రెగ్యులర్‌ టీచర్ల నియామకాలు వేగవంతం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top