గ్రూప్‌–1కు గ్రీన్‌ సిగ్నల్‌!

Is There Group 1 Notification In Telangana - Sakshi

జోనల్‌ ఉత్తర్వులతో ఊహాగానాలు

కొత్త జోన్ల ప్రకారం పోస్టుల పునర్విభజన

135 పోస్టులతో త్వరలో గ్రూప్‌–1 నోటిఫికేషన్‌?

మరో 500 వరకు గ్రూప్‌ పోస్టులు, తదితర పోస్టులు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కొత్త జోనల్‌ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో గ్రూప్‌–1, గ్రూప్‌–2 వంటి రాష్ట్ర స్థాయి, మల్టీ జోన్, జోనల్‌ స్థాయి పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ లభించినట్లేనని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో 135 వరకు గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు మార్గం సుగమమైం దని పేర్కొంటున్నాయి. ప్రస్తుతం శాఖల వారీగా భర్తీకి ఆమోదం తెలుపుతూ ఇచ్చిన పోస్టులను కొత్త జోన్లు, మల్టీ జోన్లు, స్టేట్‌ కేడర్‌ వారీగా పునర్విభజన చేసి భర్తీ చేయాల్సి ఉంటుందని టీఎస్‌పీఎస్సీ వర్గా లు పేర్కొంటున్నాయి. కాకపోతే ఇందుకు కాస్త సమయం పడుతుందని చెబుతున్నాయి. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో పోస్టుల భర్తీ విధానంపై త్వరలోనే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని నిరుద్యోగులు ఆశిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తే ప్రభుత్వరద్దు కంటే ముందుగానే నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశం ఉంది. లేదంటే ఆ తర్వాతే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ కూడా!
జోనల్‌ స్థాయి పోస్టులు కలిగిన గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ కూడా జారీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి 200కు పైగా డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టులు సహా ఏసీటీవో తదితర కేటగిరీల్లో దాదాపు 500 వరకు పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ పోస్టుల భర్తీకి ఇదివరకే జారీ చేసిన నోటిఫికేషన్‌.. న్యాయ వివాదాలతో పెండింగ్‌లో పడిన విషయం తెలిసిందే. అలాగే శాఖల నుంచి రోస్టర్‌ కమ్‌ రిజర్వేషన్‌ వివరాలతో కూడిన ఇండెంట్లు కూడా రావాల్సి ఉంది. దీంతో వాటి భర్తీకి నోటిఫికేషన్లు జారీ కాలేదు. ప్రస్తుతం ఎన్నికల వేడిమీదే వీలైనన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

దాదాపు 13 శాఖల్లో 20 వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ల జారీకి కసరత్తు చేస్తోంది. గ్రూప్‌–1లో ఇదివరకే 127 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని భావించినా, అందులో రాష్ట్ర స్థాయి, మల్టీ జోన్, జోనల్‌ పోస్టులు ఉన్నందున నోటిఫికేషన్లు జారీ చేయలేదు. అవి న్యాయ వివాదాలుగా మారొద్దన్న జోనల్‌ వ్యవస్థపై స్పష్టత వచ్చాకే వాటిని భర్తీ చేయాలని నోటిఫికేషన్ల జారీని నిలుపుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం లభించడంతో, ఇటీవల ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన మరో 8 పోస్టులు కలుపుకుని మొత్తం 135 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశం ఉంది. అందులో ఇప్పటికే అన్ని రకాల క్లియరెన్స్‌లు ఉన్న పోస్టులు 76 ఉండగా, 42 డీఎస్పీ పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ గతంలోనే ఆమోదం తెలిపింది. గతంలో మిగిలిపోయిన గ్రూప్‌–1 పోస్టులు 7 ఉన్నాయి. వీటితోపాటు మరిన్ని కేటగిరీల్లో పోస్టులను కలుపుకొని మొత్తంగా 135 పోస్టులను భర్తీ చేసే అవకాశముంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top