నయా మార్కెట్ | Sakshi
Sakshi News home page

నయా మార్కెట్

Published Tue, Mar 29 2016 1:26 AM

The neo-Market

కుమార్‌పల్లి మార్కెట్ ఆధునీకరణ పూర్తి
రేపు పునఃప్రారంభం

 

హన్మకొండ : వరంగల్ నగరంలో కూరగాయలు, మాంసం ఉత్పత్తులకు కుమార్‌పల్లి మార్కెట్ ప్రసిద్ధిగాంచింది. హన్మకొండ వాసులకు మొదటి కూరగాయల మార్కెట్ ఇదే. మారుతున్న అవసరాలకు తగినట్లుగా కుమార్‌పల్లి మార్కెట్ ఆధునీకరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా మార్కెట్ ఆధునీకరణపై ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ కుమార్‌పల్లి మార్కెట్ ఆధునీకరణ పనులను పూర్తి చేయించారు. రూ.45 లక్షలతో చేపట్టిన మార్కెట్ ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, మున్సిపల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ కలిసి కుమార్‌పల్లి మార్కెట్ నూతన ఆవరణను బుధవారం ప్రారంభించనున్నారు.

    
వ్యాపారులు, రైతులు కలిసి మొత్తం 110 మంది తమ ఉత్పత్తులను అమ్ముకునే మార్కెట్‌ను ఆధునీకరించారు. పెగడపల్లి, ముచ్చర్ల, నాగారం, గుంటూరుపల్లి, కంఠాత్మకూర్, బైరాన్‌పల్లి, ఆరెపల్లి, అన్నసాగరం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు మార్కెట్‌కు వచ్చేలా ఏర్పాటు చేశారు. దీని వల్ల కూరగాయలు నేరు గా మార్కెట్‌కు వచ్చి అందుబాటు ధరల్లో నగరవాసులకు లభ్యమవుతాయి.

    
వినియోగదారుల కాళ్లకు ఉండే దుమ్ము, బుదర వంటికి కూరగాయలకు అంటకుండా విక్రయ ప్లాట్‌ఫారంలు రెండున్నర అడుగుల ఎత్తుతో నిర్మించా రు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ తరహాలో నిర్మించారు.

    
మార్కెట్ ఆవరణలోనే తాజా పండ్లు విక్రయించనున్నారు. మటన్, చికెన్, చేపలు, ఇతర మాంసం ఉత్పత్తుల విక్రయాలు పూర్తిగా మార్కెట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆవరణలో అందుబాటులో ఉంటాయి. మార్కెట్ ఆవరణలో ఐదు హైమాస్ లైట్లను ఏర్పాటు చేశారు.

    
మార్కెట్ సమీపంలో నిరంతరం పరిశుభ్రంగా ఉండే మల మూత్ర విసర్జన వసతి(టాయిలెట్ నిర్మాణం) కల్పించారు. మహా నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన నల్లాతో ఉచిత మంచినీటి వసతి ఉంటోంది. త్వరలోనే మంచినీరు శుద్ధిచేసే యంత్రం, కూలర్‌లనూ అమర్చనున్నారు. మార్కెట్‌కు రెండు వైపులా మార్కెట్ ఆవరణలోనే ఉచిత పార్కింగ్ సదుపాయం ఉండనుంది.

    
వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త పద్ధతిని అనుసరిస్తున్నారు. మార్కెట్‌లోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఫిర్యాదు, సలహాల పెట్టెలను ఏర్పాటు చేశారు. సహకార సంఘ నిర్వాహకుల మొబైల్ నంబర్‌ను ప్రకటించనున్నారు.

Advertisement
Advertisement