కాలుష్యానికి కేరాఫ్‌ ఊరు.. తాండూరు!

Thandur as the care of Pollution - Sakshi

ఢిల్లీని మించిన కాలుష్యం.. 

పీసీబీ పరీక్షల్లో వెల్లడైన వాస్తవం.. నిర్ధారించి ఏడాదవుతున్నా.. పట్టని అధికారులు 

సిమెంట్, నాపరాతి పరిశ్రమలతో వాయు, నీటి కాలుష్యం  

గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన తాండూరు వాసి

సాక్షి, వికారాబాద్‌/తాండూరు: కాలుష్యం.. ఢిల్లీలో పరిస్థితిని అందరూ చూశాం.. క్రికెట్‌ మ్యాచ్‌ల్లో సైతం మాస్కులేసుకోవాల్సిన పరిస్థితి.. అంతకు మించిన దుస్థితి వికారాబాద్‌ జిల్లా తాండూరులో నెలకొని ఉంది. గతేడాది కాలుష్య నియంత్రణ బోర్డు(పీసీబీ) జరిపిన పరీక్షల్లో కాలుష్యం విషయంలో తాండూరు దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు గుర్తించారు. గాలిలో పీఎం 10 సూక్ష్మధూళి కణాలు క్యూబిక్‌ మీటర్‌కు 60 మైక్రోగ్రాములు ఉండాల్సి ఉండగా.. తాండూరులో 622 (ప్రస్తుతం 520) ఉన్నట్లు తేలింది. ఈ విషయం నిర్ధారించి ఏడాదవుతున్నా.. కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దీంతో తాండూరు, పరిసర ప్రాంతాలలో వాయు కాలుష్యం పెరిగి ప్రజలు అవస్థలు పడుతున్నారు. గాలిలో అతి సూక్ష్మ ధూళికణాలు పీఎం 2.5, సూక్ష్మ ధూళి కణాలు పీఎం10 పరిమితికి మించి ఉండటం అత్యంత ప్రమాదకరమైనవని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.  

సిమెంట్, నాపరాతి పరిశ్రమల వల్లనే.. 
జిల్లాలో తాండూరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఓ వైపు సిమెంట్‌ కర్మాగారాలు, మరో వైపు నాపరాతి పరిశ్రమలతో దేశంలోనే గుర్తింపు పొందింది. తాండూరు ప్రాంతంలో ఐదు భారీ సిమెంట్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అంతేకాకుండా వందలాది నాపరాతి పరిశ్రమలు, పాలిషింగ్‌ యూనిట్లు ఉన్నాయి. వీటితో పాటుగా సిమెంట్, నాపరాతి రవాణాకు నిత్యం వందలాది భారీ లోడ్‌ వాహనాలు తిరుగుతుంటాయి. వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడం, ఇందుకు అనుగుణంగా రహదారులను విస్తరించకపోవడం, పరిశ్రమల నుంచి కాలుష్య ఉద్గారాల విడుదల ఇవన్నీ వాయి, నీటి కాలుష్యానికి కారణాలుగా నిలుస్తున్నాయి. నాపరాతి పాలిషింగ్‌ యూనిట్లు, సుద్ద కంపెనీల నుంచి దుమ్ము ధూళితోపాటు విష రసాయనాలు గాలిలో కలుస్తున్నాయి. పాలిషింగ్‌ యూనిట్ల నుంచి వచ్చిన వ్యర్థాలను రోడ్డు పక్కన డంప్‌ చేస్తున్నారు. నాపరాతి నిక్షేపాలు, ఎర్రమట్టి, సుద్ద ఖనిజాలుండటంతో ప్రతిరోజూ 5 వేలకు పైగా లారీలు, ట్రక్కులు తాండూరు నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. అటు సిమెంట్‌ కర్మాగారాల నుంచి వస్తున్న కాలుష్యాన్ని అరికట్టే విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దేశంలోనే  ఢిల్లీ కాలుష్య నగరంగా రికార్డుకెక్కింది. ప్రస్తుతం ఇక్కడ సూక్ష్మధూళి కణాలు క్యూబిక్‌ మీటర్‌కు 359గా ఉంది. అదే తాండూరులో 520గా ఉండటం గమనార్హం.

గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు..  
తాండూరు కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడమే కాకుండా ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ గతేడాది జూలైలో తాండూరుకు చెందిన రాజ్‌గోపాల్‌ సార్డా అనే వ్యక్తి  స్థానిక అధికారులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో చెన్నైలోని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు. దీనిపై త్వరలోనే తీర్పు వెలువడనుందని రాజ్‌గోపాల్‌ సార్డా తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top