
‘టెండర్ల'పై ఇంటెలిజెన్స్ ఆరా!
టవర్‌సర్కిల్ : కరీంనగర్ కార్పొరేషన్‌లో టెండర్ల రద్దు అంశంపై ఇంటెలిజెన్స్ ఆరా తీస్తోంది. టెండర్లు రద్దు చేసి, సమస్య ముగిసి పోయిందనుకున్న అధికారులకు చుక్కెదురైంది.
టవర్‌సర్కిల్ :
కరీంనగర్ కార్పొరేషన్‌లో టెండర్ల రద్దు అంశంపై ఇంటెలిజెన్స్ ఆరా తీస్తోంది. టెండర్లు రద్దు చేసి, సమస్య ముగిసి పోయిందనుకున్న అధికారులకు చుక్కెదురైంది. అవకతవకల్లో బాధ్యుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. అర్హత లేని కంపెనీకి రూ.10 కోట్ల విలువైన పారిశుధ్య నిర్వహణ టెండర్లు కట్టబెట్టే యత్నాలు జరగడం... అక్రమాలపై ఁసాక్షి* వరుస కథనాలు ప్రచురించడంతో టెండర్లు రద్దు చేస్తూ కమిషనర్ శ్రీకేశ్ లట్కర్ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే.
టెండర్లలో అవకతవకలపై ఇంటెలి జెన్స్ అధికారులు దృష్టి సారించారు. శనివారం నగరపాలక సంస్థకు చేరుకుని ఆరా తీశారు. కమిషనర్ సెలవులో ఉండడంతో ఎస్‌ఈ, ఈఈని ప్రశ్నించినట్లు తెలిసింది. గంటపాటు అధికారులతో మాట్లాడిన ఇంటెలిజెన్స్ విభా గం అధికారులు టెండర్ల ఫైళ్లు పరిశీలించి, పలు ప్రశ్నలు సంధించి, ఇంజినీరింగ్ అధికారుల నుంచి సమాచారం సేకరించినట్లు తెలిసింది. అనంతరం కొంత మంది కాంట్రాక్టర్లు, నాయకులతో మాట్లాడి టెండర్లకు సంబంధించి రాజ కీయ పాత్ర, పూర్వాపరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.
అధికారులు నిబంధనలు తుంగ లో తొక్కడం, ఆ తర్వాత దిద్దుకునే ప్రయత్నం చేయడం, అది కుదరకపోవడంతోనే టెండర్ల రద్దు జరిగిందా...! లేక టెండర్ల రద్దు వెనక ఎమైనా ఉద్దేశం దాగి ఉందా? అనే అంశంపై దృష్టి సారించిన ఇంటెలిజెన్స్ అధికారులు ఆ కోణంలోనే ప్రశ్నించినట్లు సమాచారం. టెండర్లలో రెండు నెలల జాప్యం.. టెక్నికల్ బిట్ తెరిచి అర్హత లేని ఏజెన్సీలకు కూడా ఫైనాన్స్ బిట్ తెరవడం వంటి అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించినట్లు విశ్వసనీయ సమాచారం.
సీఎం ఆదేశాలతోనే?
పనులు దక్కుతాయని ఆశపడిన కాంట్రాక్టర్లకు నిబంధనలు అడ్డు వచ్చాయి. ఐఏఎస్ కమిషనర్‌గా ఉన్నప్పటికీ అధికారులు చేసిన తప్పిదంతోనే తమకు పనులు దక్కలేదని ఈ విషయాన్ని రాష్ట్ర రాజధాని వరకు కాంట్రాక్టర్లు తీసుకెళ్లారు. కరీంనగర్ నగరపాలక సంస్థ శానిటేషన్ టెండర్ల బాగోతం రాజధానికి చేరడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని, విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. సీఎం ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ విభాగంలో సీఐ స్థాయి అధికారి మరో ఇద్దరు అధికారులు రంగంలోకి దిగారు. ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం ఎటువైపు వెళ్తుందోననే అధికారుల్లో గుబులు మొదలైంది. అక్రమార్కుల మెడకు ఉచ్చు బిగుసుకుంటోందనే చర్చలు మొదలయ్యాయి.