ఈ–కుబేర్‌ కాదు.. ఈ–కుదేల్‌ 

Ten percent of the wages are unpaid - Sakshi

  సాఫ్ట్‌వేర్‌తో సమస్యలు

  వేతనాలు అందక ఉద్యోగుల ఇబ్బందులు 

  పది శాతం మందికి అందని వేతనాలు

    ట్రెజరీ చుట్టూ ఉద్యోగుల ప్రదక్షిణలు  

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ఓ భరోసా. ఎలాంటి పరిస్థితులలో అయినా ప్రతినెలా మొదటి రోజు వేతనాలు వస్తాయనే నమ్మకం. అయితే, ఉద్యోగుల వేతనాల చెల్లింపుల ప్రక్రియను మరింత వేగవంతం, సరళతరం చేసేందుకు అమలులోకి తెచ్చిన ఈ–కుబేర్‌ వ్యవస్థలోని సాంకేతిక సమస్యలు కొందరు ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారాయి. ఆగస్టు నెల ముగింపునకు వచ్చినా ఇంకా వేతనాలు అందలేదు. దీంతో వేతనాలు అందని వారంతా ట్రెజరీ విభాగాల చుట్టూ తిరుగుతున్నారు. ట్రెజరీ అధికారులు ఒక్కో ఉద్యోగికి సంబంధించిన వివరాలను సరి చూస్తూ పరిష్కరిస్తున్నారు. సాంకేతిక సమస్యలను ముగించే ప్రక్రియ ఆలస్యమవు తుండటంతో నెల ముగిసే సమయానికి కూడా అందరికీ వేతనాలు అందే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఈలోపు ఆగస్టు నెల వేతనాలను చెల్లించే ప్రక్రియ మొదలైంది. సాంకేతిక సమస్యలతో ఆగస్టులో వేతనాలు అందని వారికి, సెప్టెంబర్‌లోనూ ఇదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. ఈ–కుబేర్‌ కొత్త విధానంలో సాఫ్ట్‌వేర్‌తో ఉత్పన్నమయ్యే సమస్యలు పరిష్కరించేందుకు సరిపడా సాంకేతిక సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. 

ఆగస్టు నుంచే... 
ఉద్యోగుల వేతన చెల్లింపు ప్రక్రియలో ఆగస్టు 1 నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ‘డిజిటల్‌ ఇండియా’కార్యక్రమంలో భాగంగా ఆర్‌బీఐ కొత్తగా అమలులోకి తెచ్చిన ఈ–కుబేర్‌ విధానాన్ని దీనికి వర్తింపజేశారు. కొత్త విధానం ప్రకారం ఉద్యోగుల వేతనాల బిల్లులను ట్రెజరీ అధికారులు ‘ఈ–కుబేర్‌’సాఫ్ట్‌వేర్‌తో ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఈ వివరాలు ఆర్‌బీఐకి చేరుతాయి. నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ (నెఫ్ట్‌) పద్ధతిలో ఆర్‌బీఐ నేరుగా ఉద్యోగుల ఖాతాల్లోకి వేతనాలను జమ చేస్తుంది. ఒకటో తేదీ ఆదివారం అయినా ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ అవుతాయి. 

సాంకేతిక సమస్యలు 
మొదట 2.56 లక్షల మంది పెన్షనర్లకు అమలుచేసిన ఈ–కుబేర్‌ విధానాన్ని ఆగస్టు ఆరంభం నుంచి ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తున్నారు. మొదట అందరు ఉద్యోగుల ఖాతాల్లో ఒక్కో రూపాయి చొప్పున డిపాజిట్‌ చేసి పరిశీలించారు. కొంతమంది ఉద్యోగుల బ్యాంకు ఖాతా, ఐఎఫ్‌ఎస్‌సీ నంబర్లు తప్పుగా ఉండడంతో వారికి ఈ మొత్తం జమ కాలేదు. ఇలాంటి వాటిని సరిచేసి ఆగస్టు 1న వేతనాలు జమ చేశారు. అయితే ఒక రూపాయి జమ చేసిన సందర్భంలో వచ్చిన సమస్యలను పరిష్కరించినా, పూర్తి వేతనాలు ఇచ్చినప్పుడూ ఇదే జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా పది శాతం మంది ఉద్యోగులకు వేతనాలు జమ కాలేదు. ఉద్యోగుల వేతన బిల్లులను డ్రాయింగ్, డిస్బర్సింగ్‌ ఆఫీసర్‌ (డీడీవో) దశలవారీగా ఆన్‌లైన్‌ ద్వారా ఈ–కుబేర్‌కు పంపారు. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అవి తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆయా ఉద్యోగులకు ఈ నెలలో వేతనాలు జమ కాలేదని అధికారులు చెబుతున్నారు. ఇలా రిజెక్టయిన వారు ఒక్కొక్కరుగా వెళ్లి ట్రెజరీ అధికారులకు విజ్ఞప్తులు చేయడంతో సాంకేతిక సమస్యలను పరిష్కరించి వేతనాలు ఖాతాకు జమచేస్తున్నారు. ఎక్కువ మంది ఉద్యోగులకు ఇదే సమస్య రావడంతో పరిష్కారంకోసం ఎక్కువ రోజులు పడుతోంది.

- ఈ–కుబేర్‌ విధానంలో ఒకవ్యక్తికి సంబం ధించిన డబ్బులు ఒకే ఖాతాలో జమ అవుతా యి. ఒక ఉద్యోగికి ఒకటికంటే ఎక్కువ బ్యాం కు ఖాతాలు ఉంటే సమస్యలు వస్తాయి. కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొంది న వ్యక్తికి వేతనం ఒక బ్యాంకు ఖాతాలో, పెన్షన్‌ మరో ఖాతాలో జమవుతుంది. 
పోలీసు శాఖలో విధి నిర్వహణలో చనిపోయిన సిబ్బందికి వారి రిటైర్మెంట్‌ వయస్సు వరకు పూర్తి వేతనం అదే ఖాతాలో జమ అవుతుంది. కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుడు ఉద్యోగం పొందితే ఆ వేతనం వేరే ఖాతాలో జమ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ–కుబేర్‌ సాఫ్ట్‌వేర్‌లో ఇబ్బందులు వస్తున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top