పాత పద్ధతిలోనే తెలుగు వర్సిటీ ప్రవేశాలు | Telugu varsity admissions to be formed in old process | Sakshi
Sakshi News home page

పాత పద్ధతిలోనే తెలుగు వర్సిటీ ప్రవేశాలు

May 27 2015 1:33 AM | Updated on Aug 11 2018 4:59 PM

తెలుగు యూనివర్సిటీ ప్రవేశాలపై సందిగ్ధత వీడింది. పాత పద్ధతిలోనే ప్రవేశాలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం స్పష్టత నిచ్చింది.

సాక్షి,హైదరాబాద్: తెలుగు యూనివర్సిటీ ప్రవేశాలపై సందిగ్ధత వీడింది. పాత పద్ధతిలోనే ప్రవేశాలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం స్పష్టత నిచ్చింది. అంతేగాక 2015-16 విద్యా సంవత్సరానికి అవసరమయ్యే బడ్జెట్ ను కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలుగు వర్సిటీని 10వ షెడ్యూల్‌లో చేర్చిన విషయం తెలిసిందే. ఫలితంగా ఏడాది పాటు రెండు రాష్ట్రాలకు ఈ వర్సిటీ సేవలందించాల్సి ఉండగా... ఈ పనిని విజయవంతంగా నిర్వహించింది.
 
 వర్సిటీ ఉమ్మడి పాలన గడువు ఈ ఏడాది జూన్ 2వ తేదీతో ముగియనుంది. ఈ క్రమంలో వర్సిటీని ఉమ్మడిగానే కొనసాగిస్తారా? లేక విభజిస్తారా? అన్న అంశం తేలలేదు. దీంతో ప్రవేశాలు ఏ ప్రాతిపదికన  కల్పించాలో తెలియక వర్సిటీ అధికారులు ఆందోళనలో పడ్డారు. ఈ విషయమై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ దృష్టికి వర్సిటీ వర్గాలు తీసుకెళ్లాయి. ప్రభుత్వం స్పందించడంతో పీటముడి వీడింది.
 త్వరలో నోటిఫికేషన్: ప్రవేశాల విషయంలో స్పష్టత రావడంతో ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలపై వర్సిటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మే నెలలో నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ప్రవేశాలపై సందిగ్ధత కారణంగా కొంత ఆలస్యమైంది. తాజాగా ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని వర్సిటీ ఇన్‌ఛార్జి వీసీ ఎల్లూరి శివారెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement