రోడ్‌ టెర్రర్‌.. అయినా బేఖాతర్‌

Telangana Top In Road Accidents - Sakshi

రహదారి ప్రమాదాల్లో టాప్‌లో తెలంగాణ

ఉత్తమ డ్రైవర్లను తీర్చిదిద్దే టాప్‌ సెంటర్‌ ఇక్కడే...  అయినా దాన్ని వాడుకోలేని దుస్థితి

మౌలిక వసతులతో జాతీయ స్థాయి కేంద్రంగా ఆర్టీసీ ట్రైనింగ్‌ కాలేజీ

ఆదాయం కోసం ప్రైవేటు వ్యక్తులకు శిక్షణ ఇచ్చేందుకు ఆర్టీసీ ప్లాన్‌

సాక్షి, హైదరాబాద్‌ ఓ తీవ్రమైన సమస్య ఉన్నప్పుడు, కొంతలో కొంత సమస్యకు చెక్‌ పెట్టే వనరులు సిద్ధంగా ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? ఆ వనరులని సమర్థంగా వినియోగించుకుని పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు. కానీ రోడ్డు ప్రమాదాల విషయంలో మన రాష్ట్రంలో దానికి విరుద్ధంగా జరుగుతోంది. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరసలో ఉంది. డ్రైవర్లలో నైపుణ్యం లేకపోవడం దీనికి ప్రధాన కారణం అన్నది కాదనలేని వాస్తవం. వాహన చోదకులను సుశిక్షితులుగా తీర్చిదిద్దగలిగే ఉత్తమ శిక్షణ కేంద్రానికి హైదరాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌. దేశంలోనే మంచి మౌలిక వసతులున్న టాప్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో ఇదీ ఒకటి. 29 ఎకరాల సువిశాల విస్తీర్ణం, 450 గదులు, మంచి శిక్షకులు, సొంతంగా రూపొందించిన నాణ్యమైన మాడ్యూల్స్, హాస్టల్‌ వసతులతో కూడిన ఈ కేంద్రం దాదాపు ఐదేళ్లుగా నిరుపయోగంగా ఉండిపోయింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ కేంద్రంలో డ్రైవర్లకు శిక్షణ ఇచ్చి ప్రమాదాలను నియంత్రించేందుకు వీలున్నా ఆ దిశగా ఆలోచన చేయకపోవటం విడ్డూరం.  

సమైక్య రాష్ట్రంలో కర్ణాటక తర్వాత దేశంలోనే ఉత్తమ రవాణా సంస్థగా మన ఆర్టీసీ గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ ప్రమాదాలు, ఇంధన పొదుపు.. ఇలా పలు కేటగిరీల్లో మన ఆర్టీసీ వరసగా పురస్కారాలు సొంతం చేసుకుంది. దాదాపు 20 వేల బస్సులతో కళకళలాడిన ఆర్టీసీకి సొంతంగా డ్రైవర్లకు శిక్షణ కేంద్రం ఉండాలన్న ఉద్దేశంతో హకీంపేటలో ప్రత్యేకంగా ట్రైనింగ్‌ కాలేజీని ఏర్పాటు చేశారు. ఆర్టీసీ డ్రైవర్లను ఇందులోనే సుశిక్షితులుగా తీర్చిదిద్దుతున్నారు. ఒకేసారి 420 మంది అక్కడే ఉండి శిక్షణ తీసుకునేలా హాస్టల్‌ వసతితో ఉన్న ఈ కేంద్రం ఇప్పుడు బోసిపోయింది. రాష్ట్ర విభజనతో తెలంగాణకు తక్కువ బస్సులు ఉండటం, కొత్తగా ఆరేళ్లుగా డ్రైవర్ల రిక్రూట్‌మెంట్‌ లేకపోవటంతో ఈ కేంద్రం వెలవెలబోయింది. అడపాదడపా కొద్దిమందికి తప్ప ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు ఉండటం లేదు. ఫలితంగా దేశంలోనే మంచి మౌలిక వసతులున్న శిక్షణా కేంద్రం పెద్దగా ఉపయోగంలో లేకుండా పోయింది. ప్రమాదాలు తీవ్రమవుతున్న సమయంలోనూ దానిని వినియోగించుకోవాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఇప్పటివరకు రాకపోవటం విడ్డూరం.  

డ్రైవింగ్‌ పరిచయం లేనివారికి సమగ్ర శిక్షణకు ఎనిమిది వారాల ప్రత్యేక మాడ్యూల్‌ రూపొందించారు. శిక్షణార్థులు క్యాంపస్‌లోని హాస్టల్‌లో ఉంటూ శిక్షణ తీసుకోవచ్చు. ఇప్పటికే డ్రైవింగ్‌ వచ్చి నైపుణ్యం పెంచుకోవాలనుకునేవారికి వారం రోజుల మాడ్యూల్, రెండు రోజుల మాడ్యూల్‌ రూపొందించారు. ఎక్కువ రోజులు సమయాన్ని కేటాయించలేని పక్షంలో తక్కువ సమయంలోనే శిక్షణ ఇచ్చేలా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా రుసుములు నిర్ధారిస్తున్నారు. గతంలో నిరుద్యోగులకు శిక్షణ ఇప్పించే క్రమంలో ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్, సింగరేణి సంస్థలు స్పాన్సర్‌ చేసి కొంతమంది యువకులకు శిక్షణ ఇప్పించటం తప్ప ప్రైవేటు డ్రైవర్లకు ఇప్పటివరకు ఈ కేంద్రంలో శిక్షణ ఇవ్వలేదు. తొలిసారి ఆర్టీసీ ఆ ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ శిక్షణ తీసుకున్నవారికి క్యాంపస్‌ ఇంటర్వ్యూలు పెట్టి ప్లేస్‌మెంట్‌ అవకాశం కల్పిస్తే ఎక్కువ మంది శిక్షణకు వచ్చే అవకాశం ఉంది.  

2018... రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణ రికార్డు సృష్టించింది. సగటున ప్రతి లక్ష జనాభాలో 18.90 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశంలోనే రెండో స్థానం. ప్రమాదాలతో వణికిపోయిన ఉత్తరప్రదేశ్‌ తర్వాతి స్థానం మనదే. ఏడాదికాలంలో 6,599 మంది చనిపోయారు. ఇది అంతకుముందు సంవత్సరంకంటే ఎక్కువ. రోడ్డు ప్రమాదాలనగానే దక్షిణ భారతదేశంలో వెంటనే గుర్తొచ్చే రాష్ట్రం తమిళనాడు. కానీ... 2017 కంటే 2018లో ఆ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల రేటు ఏకంగా 24 శాతం తగ్గింది. విచ్చలవిడిగా జరుగుతున్న ప్రమాదాలను నియంత్రించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలే దీనికి కారణమని అధ్యయనాలు తేల్చాయి.  సాధారణంగా రోడ్డు ప్రమాదాలకు డ్రైవింగ్‌ నైపుణ్యం లేకపోవటమే ప్రధాన కారణమనేది నిపుణుల మాట. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రమాదాల నుంచి బయటపడాలంటే కచ్చితంగా డ్రైవింగ్‌లో నైపుణ్యం ఉండాలి.

మరి రోడ్డెక్కే భారీ వాహనాల డ్రైవర్లకు నైపుణ్యం ఉందా అంటే..లేదన్న సమాధానమే రవాణా శాఖ నుంచి ఠక్కున వస్తుంది. మన రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న విద్యా సంస్థలు చాలావరకు సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. విద్యార్థులను ఆకట్టుకునేందుకు అనుసరించే పద్ధతుల్లో ఇదీ ఒకటి. కానీ, భారీ వాహనాలు నడపడంలో నైపుణ్యం లేనివారినే తక్కువ జీతాలకు డ్రైవర్లుగా నియమించుకుంటున్నారు. 2015లో నగర శివారులోని మాసాయిపేటలో కాపలాలేని లెవల్‌ క్రాసింగ్‌ దాటే క్రమంలో పాఠశాల బస్సును రైలు ఢీకొనడానికి ఇదే కారణం.ప్రైవేటు సంస్థల్లో బస్సు డ్రైవర్లుగా పనిచేస్తున్న వారు గతంలో లారీ క్లీనర్లుగా, ఆటో డ్రైవర్లుగా పనిచేసినవారే ఉన్నారని ఇటీవల తేలింది. సరైన నైపుణ్యం లేనప్పటికీ వీరు బస్సులు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు.  

ఆర్టీసీ శిక్షణ కేంద్రంలో ఉన్న వసతులేంటి...?

  • 29 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కళాశాలలో అన్ని వసతులున్నాయి. భారీ వృక్షాలతో మంచి ఆహ్లాదకర వాతావరణం ఉంది.
  • శిక్షణ కోసం కండిషన్‌లో ఉన్న నాలుగు బస్సులు, ఆరు కార్లు, జీపులు ఉన్నాయి. ఆరుగురు శిక్షకులు ఉన్నారు.  
  • వాహనాల విడిభాగాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. వాటి పనితీరుపై చక్కటి అవగాహన కల్పిస్తారు.  
  • వాహనాలు నడపడంలో శిక్షణ మాత్రమే కాకుండా ఇంధన పొదుపులో కూడా మెళకువలు నేర్పుతారు.
  • హైదరాబాద్‌లాంటి చోట్ల ప్రమాదాలకు డ్రైవర్ల అసహనం కూడా కారణమవుతోంది. అందుకోసం ఇక్కడ ప్రత్యేకంగా మైండ్‌ మేనేజ్‌మెంట్‌ నిపుణులు, సైకాలజిస్టులు కూడా తరగతులు నిర్వహిస్తారు.  
  • రామ్‌దేవ్‌ బాబా వద్ద శిక్షణ తీసుకున్న యోగా గురువు కూడా ఉన్నారు. నిత్యం గంటసేపు యోగా తరగతులు నిర్వహిస్తారు.  
  • శిక్షణార్థులు అక్కడే ఉండి శిక్షణ తీసుకునేందుకు వీలుగా 420 గదులతో కూడిన హాస్టల్‌ భవనం ఉంది. ఒకేసారి 500 మంది భోజనం చేసేందుకు వీలుగా విశాలమైన డైనింగ్‌ హాలు ఉంది. టీ, అల్పాహారం, భోజన వసతి కళాశాలనే కల్పిస్తుంది.

ఆదాయంకోసం కొత్త అడుగులు
ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కునారిల్లుతున్న టీఎస్‌ఆర్టీసీ పైసాపైసా కోసం ఆరాటపడుతోంది. ఆదాయం పెరగకపోవటం, ఖర్చులో నియంత్రణ లేకపోవటంతో నష్టాలు కొండలా పెరిగిపోతున్నాయి. ప్రైవేటు సంస్థలలోని డ్రైవర్లకు ఇక్కడ శిక్షణ ఇవ్వటం ద్వారా రుసుము రూపంలో ఆదాయాన్ని పెంచుకోవాలని ఇప్పుడు ఆర్టీసీ శిక్షణ కేంద్రం కొత్త అధికారి ప్రణాళిక రూపొందించారు. ఐటీ కేంద్రాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, పరిశ్రమలు, క్యాబ్‌ సర్వీసులు, ఇతర ప్రైవేటు సంస్థలకు చెందిన డ్రైవర్లకు ఇక్కడ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. కేవలం బస్సులే కాకుండా కార్లు, జీపు డ్రైవింగ్‌లో కూడా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top