వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం రైతుల చెంతకు తీసుకువెళ్లేందుకు వ్యవసాయ శాఖ నడుం బిగించింది.
* 14 పరిశోధనా సంస్థలకు గ్రామాల దత్తత
* రైతులతో కలసి సాగు చేయనున్న శాస్త్రవేత్తలు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం రైతుల చెంతకు తీసుకువెళ్లేందుకు వ్యవసాయశాఖ నడుం బిగించింది. ఇందుకోసం వ్యవసాయ పరిశోధనా సంస్థల్లో పనిచేస్తున్న సీనియర్ శాస్త్రవేత్తలకు కొన్ని గ్రామాలను దత్తత ఇవ్వాలని నిర్ణయించింది. తొలి విడతగా తెలంగాణలో 14 గ్రామాలను పెలైట్ ప్రాజెక్టుగా శాస్త్రవేత్తల బృందానికి దత్తత ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టును నేషనల్ బ్యూరో ఆఫ్ ప్ల్లాంట్ జెనిటిక్ రీసోర్సెస్ (ఎన్‌బీపీజీఆర్), తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ, సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ (క్రీడా), డెరైక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ (డీఓఆర్), డెరైక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ (డీఆర్‌ఆర్), డెరైక్టరేట్ ఆఫ్ సొరగమ్ రీసెర్చ్ (డీఎస్‌ఆర్), నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (నార్మ్) తదితర 14 సంస్థల శాస్త్రవేత్తల బృందం అమలు చేస్తుంది.
ఆయా పరిశోధనా సంస్థల్లోని సీనియర్ శాస్త్రవేత్తలు గ్రామాలకు వెళ్లి రైతులతో కలసి పనిచేస్తారు. తాము కనుగొన్న పరిజ్ఞానాన్ని రైతులకు వివరిస్తూ దానిని అమలుచేస్తారు. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య 23 మంది ప్రసిద్ధ సీనియర్ శాస్త్రవేత్తలతో నిర్వహించిన సమావేశంలో ‘వ్యవసాయ పర్యాటకం’ అభివృద్ధిపై నిర్ణయం తీసుకున్నారు.
వనరులు లేని గ్రామాలే ఎంపిక..
పూర్తిస్థాయిలో సాగునీటి వనరులు ఉండి, వ్యవసాయంపై చైతన్యం కలిగిన గ్రామాలను దత్తత తీసుకోకూడదని ఇందులో ప్రధానంగా షరతుగా విధించుకున్నారు. వర్షాభావ పరిస్థితులు, కరువు పరిస్థితులు నెలకొనే గ్రామాలను ఎంపిక చేసుకోవాలి. వ్యవసాయ పరిశోధన సంస్థలు తాము ఏ పంటపై పరిశోధన చేస్తున్నాయో ఆ పంట ఎక్కువగా పండే గ్రామాన్నే ఎంపిక చేసుకోవాలి.