అత్యుత్తమ గ్రామీణ రహదారి సౌకర్యాలు కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కె.తారకరామారావు చెప్పారు.
సాక్షి, హైదరాబాద్: అత్యుత్తమ గ్రామీణ రహదారి సౌకర్యాలు కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కె.తారకరామారావు చెప్పారు. గురువారంనాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామ రహదారులను పటిష్టం చేసే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. చక్కని ప్రమాణాలతో రహదారులను తీర్చిదిద్దడంతో తెలంగాణలో పల్లెలకు, పట్టణాలకు మధ్య రవాణాసదుపాయాలు ఏర్పడతాయని ఆయన చెప్పారు.
దశలవారీగా రోడ్ల అభివృద్ధి: గ్రామాల రహదారుల్లో మొదటి దశలో, ఐదేళ్ల కిత్రం వేసిన 12వేల కిలోమీటర్ల తారురోడ్లను రూ.1,767 కోట్లతో పునరుద్ధరిస్తామన్నారు. ప్రతి కిలోమీటర్‌కు రూ.3లక్షల చొప్పున, సుమారు రూ.600 కోట్లతో 20వేల కిలోమీటర్ల మట్టిరోడ్లను మెరుగుపరుస్తామన్నారు. 250 కోట్లతో వంతెనల, కల్వర్టుల నిర్మాణం చేపడతామన్నారు.
వివరాలన్నీ వెబ్‌సైట్లో..: రహదారుల అభివృద్ధికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నామని మంత్రి తెలిపారు. రహదారులను సర్వే చే యించి, డేటాబేస్ సిద్ధం చేశామన్నారు. జాతీ య రహదారుల మాదిరిగా గ్రామీణ దారులకూ కోడ్‌నంబర్లను ఇస్తామన్నారు. ఈ వివరాలను వెబ్‌సైట్లో ఉంచడం ద్వారా పాతరోడ్లకు బిల్లులు తీసుకునే అక్రమాలకు తావుండదన్నారు. జాతీ య ప్రమాణాలకు అనుగుణంగా రహదారుల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించామన్నారు. కాగా పంచాయతీరాజ్ విభాగంలో ఖాళీగా ఉన్న 198 ఇంజనీర్ పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తామన్నారు.