ఒక్క బోగీ కలిపితే ఏమైంది?

Telangana High Court Fires On State Government Over Migrant Workers Transportation - Sakshi

వలస కార్మికులను తరలించేందుకు ఉన్న అడ్డంకులేంటి?

సాధారణ ప్రయాణికుల రైలుకు 24 బోగీలకు మించి ఉండొద్దా..?

అలా ఉండొద్దని ఏ చట్టంలో ఉందంటూ హైకోర్టు ప్రశ్న

దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం విచారణకు హాజరుకావాలని ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: వలస కార్మికులను తరలించేందుకు సాధారణ రైలుకు ఒక బోగీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ఎందుకు వీలుకాదని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటుక బట్టీల్లో పనిచేసే వలస కార్మికులను వారి రాష్ట్రాలకు పంపేలా ఉత్తర్వులు ఇవ్వాలని, లాక్‌డౌన్‌ వల్ల వారంతా ఇబ్బందులు పడుతున్నారని దాఖలైన మూడు పిల్స్‌ను సోమవారం మరోసారి విచారించింది. గూడ్స్‌ రైలుకు 70 బోగీలు ఉంటాయని, సాధారణ రైలుకు 24కి మించి బోగీలు ఉండకూడదని ఏ చట్టంలో ఉందో చెప్పాలని ప్రశ్నించింది.

వలస కార్మికుల విషయంలో రైల్వే శాఖ ఎందుకు ఉదాసీనంగా ఉంటోందో.. వలస కార్మికుల కోసం ఒక అదనపు బోగీ ఏర్పాటు చేసేందుకు ఉన్న అడ్డంకులు ఏంటో తమకు అర్థం కావట్లేదని వ్యాఖ్యానించింది. వలస కార్మికుల కష్టాలను చూస్తే డీఆర్‌ఎం స్పందించే వారని పేర్కొంది. పర్యాటకుల కోసం ఒకట్రెండు రోజులు ఖాళీగానే ఉంచుతారని, అలాంటిది వలస కార్మికుల కోసం ఎందుకు అలా చేయలేదని ప్రశ్నించింది. బిహార్‌కు చెందిన 45 మంది వలస కార్మికుల కోసం శ్రామిక్‌ రైలును రూ.10 లక్షలు ఖర్చు చేసి ప్రభుత్వం కూడా ఎలా నడపగలదని అడిగింది. అదే రైల్వే శాఖ ముందుకు వచ్చి సాధారణ ప్రయాణికుల రైలుకు ఒక్క బోగీ తగిలిస్తే సమస్య పరిష్కారం అయ్యేదనే ఆలోచన కూడా చేయట్లేదని ఆక్షేపించింది.

మాకే తప్పుడు సమాచారం ఇస్తారా? 
సికింద్రాబాద్‌ సమీపంలోని మనోరంజన్‌ కాంప్లెక్స్‌ ఖాళీగా ఉన్నా కూడా.. ఖాళీగా లేదని జిల్లా కలెక్టర్‌ హైకోర్టుకు నివేదించడంపై ధర్మాసనం మండిపడింది. ఆ కాంప్లెక్స్‌లో వలస కార్మికులను ఉంచేందుకు వీలవుతుందేమో తెలపాలని కోరితే తమకే తప్పుడు వివరాలిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కాంప్లెక్స్‌ను రిజిస్ట్రార్లు స్వయంగా పరిశీలించారని, మొత్తం కాంప్లెక్స్‌ ఖాళీగా ఉందని చెప్పింది. హౌసింగ్‌ బోర్డు అధీనంలోని 3 అంతస్తుల ఆ కాంప్లెక్‌ ఇప్పటికీ ఖాళీగానే ఉందని పేర్కొంది. అయినా కూడా ఖాళీగా లేదని కలెక్టర్‌ ఎలా చెబుతారని దుయ్యబట్టింది. దీనిపై అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. సదరు కాంప్లెక్స్‌లో మరుగుదొడ్లు లేవని చెప్పారు.

దీంతో వెంటనే ధర్మాసనం జోక్యం చేసుకుని, అది వాస్తవం కాదని, అన్ని వసతులు ఉన్నాయని తేల్చి చెప్పింది. హౌసింగ్‌ బోర్డు నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయలేదని, కోర్టులను తేలిగ్గా తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కలెక్టర్‌ను ఉద్దేశించి హెచ్చరించింది. దీనిపై పిటిషనర్‌ న్యాయవాది వసుధా నాగరాజ్‌ కల్పించుకుని.. మిగిలిన 45 మంది వలస కార్మికులను పంపితే సమస్య కొలిక్కి వస్తుందని, వసతి సమస్య ఉండదని చెప్పారు. బిహార్‌కు చెందిన 170 మంది వలస కార్మికులు మిగిలితే పలు సేవా సంస్థలు వారిని గమ్యస్థానాలకు పంపాయని, మిగిలిన 45 మందిలో 30 మందికే టికెట్లు లభించాయని చెప్పారు. రైల్వే శాఖ స్టాండింగ్‌ కౌన్సిల్‌ పుష్పేందర్‌ కౌర్‌ వాదనలు వినిపిస్తూ.. అత్యవసర కోటాలో రోజుకు 30 టికెట్లే లభ్యం అవుతాయని తెలిపారు. విచారణ నేటికి వాయిదా పడింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top