ఆర్మీ జవాన్‌కు కన్నీటి వీడ్కోలు

Tearful Farewell To Army Jawan Adilabad - Sakshi

అధికారిక లాంఛనాలతో జవాన్‌ ప్రకాష్‌ అంత్యక్రియలు

నివాళులర్పించిన పోలీస్‌ అధికారులు

శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

మందమర్రిరూరల్‌(చెన్నూర్‌): అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతి చెందిన ఆర్మీ జవాన్‌ కొత్తపల్లి ప్రకాష్‌ అంత్యక్రియలు బుధవారం అధికారిక లాంఛనాలతో ముగిశాయి. బుధవారం తెల్లవారుజామున ప్రకాష్‌ భౌతికకాయం మందమర్రిలోని గాంధీనగర్‌లో గల స్వగృహానికి చేరుకుంది. ప్రకాష్‌ భౌతికకాయాన్ని చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. భార్య శ్వేత, తల్లి సరోజ రోధించిన తీరు అందరినీ కలచివేసింది. ఒక్కగానొక్క కొడుకు తనువు చాలించడంతో తండ్రి శంకరయ్య గుండెలు పగిలేలా ఏడ్చాడు. ప్రకాష్‌ 20 నెలల కొడుకును చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు. ప్రకాష్‌ ఇక లేడని అతని మిత్రులు జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ దుఃఖసాగరంలో మునిగిపోయారు. బంధువులు, ఇరుగుపొరుగు వారు ప్రకాష్‌ కలివిడితనం గురించి బాధపడిన తీరు కలచివేసింది.

కన్నీటి వీడ్కోలు..
ప్రకాష్‌ అంతిమ యాత్ర ఉదయం 11:30 గంటలకు మొదలై నాలుగు గంటల వరుకు సాగింది. గాంధీనగర్, సీఈఆర్‌ క్లబ్‌ నుంచి మార్కెట్‌ మీదుగా ప్రజలు, బంధు మిత్రుల అశ్రునయనాల మధ్య సాగిన అంతిమ యాత్ర శ్రీవేంకటేశ్వర ఆలయం వెనుక గల శ్మశాన వాటిక వరకు సాగింది. అక్కడే భౌతికకాయాన్ని ఖననం చేశారు.

పోలీస్‌ అధికారుల నివాళులు..
ప్రకాష్‌ భౌతికకాయం వెంట ఆర్మీ నుంచి 32 ఎన్‌సీసీ బెటాలియన్‌ కమాండెంట్, లెఫ్టినెంట్‌ కల్నన్‌ సమల్‌కుమార్, ఆదిలాబాద్‌ లెఫ్టినెంట్‌ ఐలయ్య ఉన్నారు. వీరితో పాటు జేసీవో శ్రీనివాస్, జమేదార్‌ శోబారామ్, రాజనంద భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి సెల్యూట్‌ చేశారు. బెల్లంపల్లి ఏసీపీ బాలుజాదవ్, మందమర్రి సీఐ రాంచందర్‌రావ్, ఎస్సై శివకుమార్‌ నివాళులర్పించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top