క్షయ పంజా

TB Cases Rise In Telangana State - Sakshi

గతేడాది 2,000 మంది మృతి

2018లో 52 వేలు

2019లో 70 వేల కేసులు

ముందస్తుగా గుర్తించకపోవడమే ప్రధాన కారణం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంపై క్షయ వ్యాధి పంజా విసురుతోంది. గతేడాది తెలంగాణలో ఏకంగా 2 వేల మంది చనిపోయారని రాష్ట్ర టీబీ నియంత్రణ విభాగం తాజాగా సర్కారుకు పంపిన క్షయ వార్షిక నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో ఏటికేటికీ క్షయ విస్తరిస్తున్నట్లు నివేదికలో పేర్కొంది. 2018లో 1,800 మంది చనిపోయారని తెలిపింది. కాగా, రాష్ట్రంలో 2017లో 44,644 టీబీ కేసులు గుర్తిస్తే, 2018లో 52,269 మందికి వ్యాధి సోకింది. 2019లో 70,202 మందికి వ్యాపించింది. అంటే ఏడాదిలోనే ఏకంగా 17,933 కేసులు అదనంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో కొంత మేర తగ్గిందనుకున్న ఈ వ్యాధి మళ్లీ పంజా విసురు తోంది. రాష్ట్రంలో ఇది ప్రబలంగా పెరుగుతుండ టంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మందు లకు బ్యాక్టీరియా లొంగకపోవడం, దీనిపై అధికార యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడం తదితర కారణాలతో ఈ వ్యాధి మరింత విస్తరిస్తోందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

హైదరాబాద్‌లో అత్యధికం..
రాష్ట్రంలో టీబీ కేసులు ఎక్కువగా హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి. గతేడాది హైదరాబాద్‌లో అత్యధికంగా 12,658 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 4,439 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌ జిల్లాలో 4,025 కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో 3,668 కేసులు నమోదయ్యాయి. అత్యంత తక్కువగా ములుగు జిల్లాలో 403 మందికి మాత్రమే టీబీ సోకినట్లు నివేదిక తెలిపింది. కాగా, గతేడాది టీబీ, ఎయిడ్స్‌ రెండూ సోకినవారు రాష్ట్రంలో 2,196 మంది ఉన్నారని నివేదిక వెల్లడించింది. 25 శాతం హెచ్‌ఐవీ బాధితుల మరణాలు టీబీ వల్లేనని తెలిపింది.

క్షయ రోగులకు అందని కేంద్ర సాయం..
నేరుగా నగదు బదిలీ (డీబీటీ) పద్ధతిలో క్షయ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.500 కేంద్రం ఇస్తుంది. అయితే రాష్ట్రంలో అనేక మంది క్షయ రోగులకు ఆ ఆర్థిక సహాయం అందట్లేదు. వారికి బలమైన పోషకాహారాన్ని అందించేందుకు ఇస్తున్న ఈ సొమ్ము రాకపోవడంతో అనేకమంది రోగులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుంచి స్పందన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 2017 నవంబర్‌ నుంచి ఈ ఏడాది 2019 డిసెంబర్‌ వరకు 1,22,784 మంది క్షయ వ్యాధిగ్రస్తులు కేంద్ర ఆర్థిక సాయానికి అర్హులుగా తేలారు.

అందులో 72,216 మందికి (59%) మాత్రమే సొమ్ము అందినట్లు నివేదిక తెలిపింది. ఇంకా 41 శాతం మంది క్షయ రోగులు నగదు కోసం ఎదురుచూస్తున్నారు. అత్యంత తక్కువగా నల్లగొండ జిల్లాలో 38 శాతం మందికి, జనగాం జిల్లాలో 46 శాతం మందికి నగదు అందింది. ఈ విషయంపై కేంద్రానికి విన్నవించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అత్యధికంగా భద్రాద్రి–కొత్తగూడెం జిల్లాలో 89 శాతం మందికి ఆర్థిక సహకారం అందిందని నివేదిక తెలిపింది. ఆ తర్వాత మెదక్‌ జిల్లాలో 84 శాతం మందికి నగదు అందింది. 2018లో రాష్ట్రంలో టీబీ వ్యాధిగ్రస్తులకు చేసిన వైద్య చికిత్సలో 98 శాతం సక్సెస్‌ రేటు ఉందని ఇటీవల కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top