భారతమాతకు మహా హారతి

Tamilisai Soundararajan Attended For Republic Day Celebrations At Khairatabad - Sakshi

3వేల మంది విద్యార్థినులు భారతమాత వేషధారణలో హారతి

మన సంస్కృతిని కాపాడుకోవాలి: గవర్నర్‌  

ఖైరతాబాద్‌: భారత్‌ మాతాకీ జై.. వందేమాతరం.. మా తుజే సలాం అంటూ నినాదాలతో భారతమాతకు మహా హారతి కార్యక్రమం మారుమోగింది. ఒకే వేదికపై మూడు వేల మంది విద్యార్థినులు భారతమాత వేషధారణతో త్రివర్ణ పతాకాలు చేతపట్టుకుని భారతమాతకు కర్పూర హారతి సమర్పించిన కార్యక్రమం ఆద్యంతం దేశభక్తిని చాటింది. ఆదివారం సాయంత్రం ఐమాక్స్‌ పక్కన ఉన్న హెచ్‌ఎండీఏ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని గవర్నర్‌ తమిళిసై ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

మన సంస్కృతిని తెలియజేసేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని గవర్నర్‌ అన్నారు. దేశం కోసం, దేశాభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న కార్యక్రమాలు భారతీయుడిని తల ఎత్తుకునేలా చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. తన మెడపై కత్తి పెట్టినా భారతమాతకు జై అనను అన్న వారితో కూడా భారత్‌మాతాకీ జై అనేలా చేయాలనే ఆలోచనతో రెండేళ్ల కిందట ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని ఈ ఫౌండేషన్‌ చైర్మన్‌ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మన దేహం మీద ఉన్న అభిమానాన్ని దేశం మీద అభిమానంగా మార్చాలనే సంకల్పంతోనే కిషన్‌రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని సహస్ర అవధాని గరికపాటి నర్సింహారావు పేర్కొన్నారు.

కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన జనసేన పార్టీ అధ్యక్షుడు, నటుడు పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ రాజకీయాల్లోకి పదవులు ఆశించి రాలేదని భారతమాత తల్లి పిలుపు మేరకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్, జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యుడు రాములు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి తనయుడు హర్ష తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మా తుజే సలాం.. వందేమాతం అంటూ చేసిన నృత్యాలు, మరాఠా వారియర్‌ డ్యాన్స్‌ వంటి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top