కొత్త గవర్నర్‌ తమిళిసై | Tamilisai Soundararajan Appointed As Telangana Governor | Sakshi
Sakshi News home page

కొత్త గవర్నర్‌ తమిళిసై

Sep 2 2019 1:15 AM | Updated on Sep 2 2019 4:35 AM

Tamilisai Soundararajan Appointed As Telangana Governor - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/చెన్నై: బీజేపీలో ‘సుష్మాజీ ఆఫ్‌ తమిళనాడు’గా పేరు సంపాదించుకున్న డాక్టర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులయ్యా రు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న ఆమెను కేంద్రం రాష్ట్ర గవర్నర్‌గా నియమించింది. ఆమె రాష్ట్రానికి నియమితులైన తొలి మహిళా గవర్నర్‌ కావడం విశేషం. వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తమిళిసై.. అనతి కాలంలోనే అగ్రశ్రేణి మహిళా నేతగా ఎదిగారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌ కోయిల్‌లో 1961 జూన్‌ 2వ తేదీన జన్మించారు. 

కుటుంబ నేపథ్యం 
తమిళనాడులో ప్రముఖ కాంగ్రెస్‌ నాయకుడు కుమరి ఆనందన్, కృష్ణకుమారి దంపతులకు తమిళిసై సౌందర్‌రాజన్‌ జన్మించారు. తండ్రి ఆనందన్‌ ఆరుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా, తమిళనాడు పీసీసీ చీఫ్‌గా పని చేశారు. తమిళిసై భర్త డాక్టర్‌ పి.సౌందర్‌రాజన్‌ తమిళనాడులో ప్రముఖ వైద్యుడు. రామచంద్ర మెడికల్‌ కాలేజీలో నెఫ్రాలజీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ విభాగం డిపార్ట్‌మెంట్‌ హెడ్‌గా ఉన్నారు. సౌందరరాజన్‌ మద్రాస్‌ మెడికల్‌ కాలేజీ నుంచి ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. ఎంజీఆర్‌ మెడికల్‌ యూనివర్సిటీలో గైనకాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఆమె కెనడాలో సానోలజీ, ఫీటల్‌ థెరపీలో ప్రత్యేక శిక్షణ పొందారు. రామచంద్ర మెడికల్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఐదేళ్లు పనిచేశారు. 

చిన్నతనం నుంచే రాజకీయాలపై ఆసక్తి 
ఆమె తండ్రి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కావడంతో చిన్నతనం నుంచే తమిళిసై రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. అయితే తన తండ్రి బాటలో కాంగ్రెస్‌ వైపు కాకుండా ఆరెస్సెస్, బీజేపీ సిద్ధాంతాలపై ఆసక్తి పెంచుకున్నారు. మద్రాస్‌ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చేస్తున్న సమయంలోనే విద్యార్థి సంఘం నాయకురాలిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత బీజేపీలో పూర్తిస్థాయి కార్యకర్తగా చేరి ఆనేక హోదాల్లో పార్టీకి సేవలందించారు. 
 
సౌందరరాజన్‌ రాజకీయ ప్రస్థానం 

  • ఆరెస్సెస్, బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులరాలైన ఆమె సౌత్‌ చెన్నై డిస్ట్రిక్ట్‌ మెడికల్‌ వింగ్‌ సెక్రటరీగా 19990–2001 మధ్య పని చేశారు. 
  • 2001–2004 వరకు స్టేట్‌ మెడికల్‌ వింగ్‌ జనరల్‌ సెక్రటరీ. 
  • 2004–2005 వరకు మూడు జిల్లాల జోనల్‌ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. 
  • 2005–2007 వరకు సదరన్‌ స్టేట్స్‌ మెడికల్‌ వింగ్‌ ఆల్‌ ఇండియా కో–కన్వీనర్‌. 
  • 2007–2010 వరకు తమిళనాడు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి. 
  • 2010–2013 వరకు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు. 
  • 2013నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు. 
  • 2014 ఆగస్టు 16 నుంచి తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు. 

‘సుష్మాజీ ఆఫ్‌ తమిళనాడు’ 
స్వతహాగా మంచి వక్తయిన తమిళిసై అనతికాలంలో ‘సుష్మాజీ ఆఫ్‌ తమిళనాడు’గా పేరు సంపాదించారు. 15 ఏళ్లుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న ఆమె అనేక పొలిటికల్‌ డిబేట్‌లలో పాల్గొన్నారు. తన వాక్చాతుర్యంతో ఎదుటివారిని కట్టిపడేసే ఆమెకు మోరల్‌ పోలీసింగ్‌పై ఔట్‌లుక్‌ మ్యాగజైన్‌ నిర్వహించిన డిబేట్‌ దేశవ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టింది. విద్యార్థులు, పిల్లల్లో వక్తృత్వ నైపుణ్యాలు పెంపొందించేందుకు రాజ్‌ టీవీలో ఆమె నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమాన్ని పదేళ్ల పాటు నిర్వహించారు. జాతీయ, అంతర్జాతీయ చానెళ్లలో పొలిటికల్‌ డిబేట్‌లలో పార్టీ గొంతుకను సమర్థవంతంగా వినిపించారు. పదేళ్ల పాటు పార్టీ అధికార ప్రతినిధిగా కూడా పని చేశారు. అనేక పొలిటికల్, మెడికల్‌ అంశాలు, కథనాలను ఇంగ్లీష్‌ నుంచి తమిళంలోకి అనువదించారు. ‘పెన్‌శక్తి ఇయక్కమ్‌’అనే స్వచ్చంద సేవా సంస్థకు అధ్యక్షురాలిగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 
 
సుధీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నా 
సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నా ఒక్కసారి కూడా ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాలేకపోయారు. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసినా పరాజయం చవి చూశారు. 2009, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. మొన్నటి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ తరఫున ఆమె రాష్ట్రవ్యాప్తంగా విస్త్రృత ప్రచారం చేశారు. తూత్తుకుడి లోక్‌సభ స్థానం నుంచి ఆమె డీఎంకే నేత కనిమొళిపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 
 
తెలంగాణాకు వెళ్లినా తమిళులకు సోదరినే! 
తెలంగాణ గవర్నర్‌గా వెళ్లినా తమిళనాడు ప్రజల సోదరి అనేది మరువబోనని తమిళిసై స్పష్టం చేశారు. బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి అధిష్టానం ఆమెను తప్పించనుందని కొన్నినెలలుగా ప్రచారం జరుగుతున్న తరుణంలో అందరినీ ఆశ్చర్యపరిచేలా ఆమెను గవర్నర్‌ పదవి వరించింది. ఈ సందర్భంగా చెన్నైలో ఆమె మీడియాతో మాట్లాడుతూ అంకితభావంతో పార్టీకోసం పనిచేసేవారికి తగిన గుర్తింపు ఖాయమని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మరోసారి చాటారని చెప్పారు. తెలంగాణకు తనపరిధిలో శాయశక్తులా సేవలందిస్తానని తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement