
కష్టాలకు ఎదురీది.. బతుకు ‘బండి’ని నడిపిస్తూ..
పెళ్లై కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఆమెకు అడుగడుగునా కష్టాలే ఎదురయ్యాయి..
పెళ్లై కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఆమెకు అడుగడుగునా కష్టాలే ఎదురయ్యాయి.. సమస్యలే స్వాగతం పలికాయి.. తల్లిని కాబోతున్నానన్న ఆనందం కూడా ఎక్కువ రోజులు లేకుండా చేసింది.. విధి చిన్నచూపు చూసింది.. ఆరునెలల గర్భిణిగా ఉన్న సమయంలో జీవితాంతం తోడుగా ఉంటాడనుకున్నవాడిని దూరం చేసింది.. బాధను దిగమింగుతూనే పుట్టిన పిల్లాడిని కష్టపడి సాకింది.. బతుకుదెరువుకోసం చిన్నపాటి వ్యాపారం చేసినా కలిసిరాలేదు.. అయినా కుంగిపోలేదు.. రెండు చేతులతో స్టీరింగ్ తిప్పుతూ బతుకు ‘బండి’ని లాగిస్తోంది.. - బషీరాబాద్
బషీరాబాద్ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం నవాంద్గికి చెందిన సుజాత (23) వివాహం 2010లో శంకర్‌పల్లికి చెందిన సత్యనారాయణరెడ్డి జరిగింది. కొత్తగా పెళ్లై కోటి ఆశలతో మెట్టినింట్లో అడుగుపెట్టిన ఆమెకు కొన్ని నెలలకే కష్టాల పర్వం మొదలైంది. ఆరునెలల గర్భిణిగా ఉన్నప్పుడు వ్యక్తిగత కారణాలతో భర్త కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడి నుంచి సుజాత పుట్టినింటికి చేరింది. అక్కడ పండంటి మగబిడ్డను ప్రసవించింది. నందగోపాల్‌రెడ్డి అని పేరుపెట్టుకుంది. ఇంత కష్టంలోనూ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా తనకాళ్లమీద తాను నిలబడాలనుకుంది. నాలుగేళ్ల క్రితం బషీరాబాద్‌లో ఓ దుకాణం అద్దెకు తీసుకుని బ్యాంగిల్ షాపు ప్రారంభించింది. వ్యాపారం కలిసిరాక నష్టాలపాలైంది. తరువాత గ్రామంలోనే ఉపాధి కూలి పనులు చేస్తూ జీవనం సాగించింది. ఒకవైపు కూలి పనులు చేస్తూనే మరోవైపు గ్రామంలోని నవాంద్గి సంగమేశ్వర దేవాలయ ఉత్సవాల సమయంలో టెంకాయలు విక్రయించేది. ఇలా ఎంత కష్టపడినా అవసరాలకు సరిపడా డబ్బులు రాలేదు. అప్పులు పెరిగిపోయాయి. ఉన్న కాస్త బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టింది. భర్త మృతి చెందాడని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందిస్తామని మూడేళ్ల క్రితం కలెక్టరేట్ నుంచి ఉత్తరం వచ్చింది. అప్పటి నుంచి జిల్లా కార్యాలయాల చుట్టూ తిరిగినా లాభం లేకపోయింది.
ఆటుపోట్లను ఎదుర్కొని ఆటో స్టీరింగ్ పట్టుకుని..
కష్టాల నుంచి ఎలా గట్టేక్కాలా అని ఆలోచించింది. ఆటో నడపాలని నిర్ణయించుకుంది. ఒకవైపు కూలి పనులకు వెళ్తూనే ఖాళీ సమయంలో ఆటో డ్రైవింగ్ నేర్చుకుంది. రాజీవ్ యువకిరణాలు పథకం కింద రుణం అందిస్తారని ఎవరో చెబితే వెళ్లి అధికారులను కలిసింది. ఆటో నడిపేందుకు డ్రైవింగ్ లెసైన్స్ కావాలని చెప్పడంతో లెసైన్స్ తీసుకుంది. ఆ తర్వాత అడిగే మహిళకు ఆటోకు రుణం ఇవ్వడం కుదరదని చెప్పేశారు. దీంతో ఎలాగైనా ఆటో కొని నడిపించాలనుకుంది. తెలిసినవారి దగ్గర రూ.50 వేలు తీసుకుని ఫైనాన్స్‌లో ఆటో కొనుగోలు చేసింది. ప్రస్తుతం నెలవారి వాయిదాలు, ఇతర ఖర్చులన్నీ పోను రోజుకు రూ.300 నుంచి రూ.400 దాకా సంపాదిస్తోంది. ప్రస్తుతం కొడుకు అంగన్‌వాడీ స్కూల్‌లో చదువుతున్నాడని, వచ్చే సంవత్సరం పాఠశాలలో చేర్పిస్తానని చెబుతోంది. ఎన్ని కష్టాలు ఎదురైన కొడుకుని ఉన్నత చదువులు చదివించి ప్రయోజకుడిని చేస్తానని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. ఆటుపోట్లను తట్టుకుని బతుకుబండిని లాగిస్తూ పదిమందికి ఆదర్శంగా నిలిచింది.