పాస్‌బుక్, ఆధార్‌ ఉంటేనే.. పెట్టుబడి చెక్కు

State Government Says Passbook, Aadhar must to Investment Check - Sakshi

పాస్‌బుక్, ఆధార్‌ ఉంటేనే.. పెట్టుబడి చెక్కు

‘రైతు బంధు’ అమలు మార్గదర్శకాలు జారీ

గ్రామసభల్లో నేరుగా రైతులకే చెక్కులు 

అనారోగ్యంగా ఉంటే ఇంటికొచ్చి అందజేత 

చెక్కుల పంపిణీ పూర్తి బాధ్యత కలెక్టర్లకే 

రూ.50 వేలు దాటితే రెండు చెక్కులు 

ఈ నెల 20 నుంచే పంపిణీ

సాక్షి, హైదరాబాద్‌: పెట్టుబడి సాయం కింద చెక్కులు అందుకోవాలంటే రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకం, ఆధార్‌ కార్డు ఉండాల్సిందే! గ్రామసభలకు వాటిని తీసుకొచ్చే రైతులకే చెక్కులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పాస్‌ పుస్తకం రాని రైతులకు.. రెవెన్యూశాఖ వద్ద ఉన్న భూరికార్డుల సమాచారం మేరకు పాస్‌ పుస్తకం మొదటి పేజీని ప్రింట్‌ తీసి కలెక్టర్‌ లేదా తహసీల్దార్‌ సంతకంతో అధికారులే అందిస్తారు. దాన్ని రైతులు గ్రామసభల్లో ఇస్తే సరిపోతుంది. ప్రతీ చెక్కును పట్టాదారుడికే అందజేయనున్నారు. వారి తరఫున ఇతరులు వచ్చి చెక్కు తీసుకోవడానికి వీల్లేదు. రైతు అనారోగ్యం పాలైనా, అంగ వైకల్యం కలిగి ఉన్నా అధికారులే వారి ఇళ్లకు వెళ్లి చెక్కులు అందజేస్తారు. 

రైతుబంధు పథకం అమలు మార్గదర్శకాల్లో ఈ మేరకు పేర్కొన్నారు. బుధవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి విడుదల చేశారు. ఈ పథకం కింద ప్రభుత్వం రానున్న ఖరీఫ్‌ నుంచి ఎకరాకు రూ.4 వేలు ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 20 నుంచే రైతులకు చెక్కులను పంపిణీ చేస్తారు. చెక్కుల పంపిణీ సమయంలోనే రైతు పట్టాదారు పాస్‌ పుస్తకం, ఆధార్‌ కార్డులను తనిఖీ చేస్తారు. గ్రామసభల్లో ఏఈవో, వీఆర్వోలు రైతులను గుర్తించాల్సి ఉంటుంది. చెక్కులను సమగ్రంగా పరిశీలించిన అనంతరం బ్యాంకులు రైతులకు నగదు అందజేస్తాయి. 

గ్రామసభల్లో పంపిణీ కాకుండా మిగిలిపోయిన చెక్కులు, సంబంధిత రైతుల జాబితాను ప్రత్యేకంగా రూపొందిస్తారు. మండల వ్యవసాయాధికారి, తహసీల్దార్‌ సంయుక్త ఆమోదంతో వాటిని నెల రోజుల్లోగా మళ్లీ రైతులకు అందజేయాల్సి ఉంటుంది. అయినా పంపిణీ కాని చెక్కులుంటే వెనక్కు పంపిస్తారు. రైతులు మూడు నెలల్లో చెక్కుల నుంచి నగదు తీసుకోవాలి. ఒకవేళ వాటి కాలపరిమితి ముగిసిపోతే గడువును పెంచే బాధ్యత రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌కు కల్పించారు. చెక్కుల పంపిణీ సందర్భంగా అధికారులకు రైతు పేరు, వయసు, ఆధార్‌ నంబర్, మొబైల్‌ నంబర్‌తోపాటు వారి కుల కేటగిరీతో కూడిన రిజిస్టర్‌ను అందజేస్తారు. ఏఈవోలు దానిపై చెక్కు అందుకున్న రైతుల సంతకం లేదా వేలిముద్ర తీసుకుంటారు. 

కలెక్టర్లకే పూర్తి బాధ్యత 
రైతుబంధు పథకం కింద అన్నదాతలకు అందజేసే పెట్టుబడి చెక్కుల పంపిణీ బాధ్యత పూర్తిగా జిల్లా కలెక్టర్లకే అప్పగించారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయాధికారులు (డీఏవో)లు ఈ ప్రక్రియను అమలు చేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలివీ.
– జిల్లాల్లో కలెక్టర్‌ ఆధ్వర్యంలో స్పెషల్‌ సెల్‌ను ఏర్పాటు చేయాలి. అందులో జాయింట్‌ కలెక్టర్, డీఏవో, ఎల్‌డీఎం తదితరులు కమిటీ సభ్యులుగా ఉంటారు. 
– కలెక్టర్‌ జాయింట్‌ కలెక్టర్, జిల్లా వ్యవసాయాధికారి, ఆర్డీవో, ఏడీఏలు, తహశీల్దార్లు, ఎంఏవోలు, ఏఈవోలతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలి. బ్యాంకర్లతో మరో సమావేశం ఏర్పాటు చేయాలి.  
– కలెక్టర్‌ను సంప్రదించి చెక్కుల పంపిణీ షెడ్యూల్‌ను గ్రామాల వారీగా ఖరారు చేయాల్సిన బాధ్యత జిల్లా వ్యవసాయాధికారులదే. 
– చెక్కుల పంపిణీ సక్రమంగా జరిగేందుకు మండలాల్లో ప్రత్యేక అధికారులను కలెక్టర్‌ నియమించాలి. జిల్లా సహకారశాఖ అధికారులనూ ఉపయోగించుకోవాలి. 
– ముద్రించిన చెక్కులను హైదరాబాద్‌ నుంచి జిల్లా వ్యవసాయాధికారులు తీసుకెళ్లాలి. వాటిని మండలాల వారీగా తరలించాలి. ఎంఏవోలకు అప్పగించాలి. గ్రామాల వారీగా బండిళ్లను ఏఈవోలకు అప్పగించాలి. 
– ముద్రించిన చెక్కులను బ్యాంకుల నుంచి తీసుకోవాల్సిన బాధ్యత వ్యవసాయశాఖ కమిషనర్‌కు అప్పగించారు. కలెక్టర్లతో సంప్రదించి వాటిని పకడ్బందీ భద్రత మధ్య జిల్లాలకు, గ్రామాలకు తరలించాల్సిన బాధ్యత ఆయనదే.  
– గ్రామసభల్లో చెక్కుల పంపిణీ ప్రక్రియను గ్రామాల్లో చాటింపు ద్వారా వీఆర్వో/వీఆర్‌ఏలు ప్రజలకు తెలియజేయాలి.  
– చెక్కుల పంపిణీ సక్రమంగా జరిగేట్లు చూడాల్సిన బాధ్యత డీఏవో, ఏడీఏ, ఎంఏవోలకు అప్పగించారు. ఎలాంటి తప్పిదాలు జరిగినా, నిర్లక్ష్యం చవిచూసినా కఠిన చర్యలు తీసుకుంటారు. 
– రోజువారీ బ్యాంకుల్లో పెట్టుబడి నగదు సొమ్ము వివరాలను బ్యాంకులు ప్రభుత్వానికి అందజేస్తాయి.  

రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీ ఇదే... 
రాష్ట్రస్థాయిలో రైతుబంధు పథకం అమలుతీరును పర్యవేక్షించేందుకు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఛైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేశారు. అందులో ఆ శాఖ కమిషనర్‌ కన్వీనర్‌గా ఉంటారు. ఆర్థికశాఖ జాయింట్‌ సెక్రటరీ, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్, ఎన్‌ఐసీ రాష్ట్ర సమాచార అధికారి సభ్యులుగా ఉంటారు.  

ఒక చెక్కుపై రూ.49,990 
చెక్కులపై రైతుబంధు పథకం అని రాసి ఉంటుంది. పట్టాదారు పేరు, నంబర్‌ ఉంటుంది. జిల్లా, మండలం, రెవెన్యూ గ్రామం వివరాలు, రైతుకు ఇచ్చే సొమ్ము వివరాలు ఉంటాయి. ఆర్డర్‌ చెక్కులుగా వీటిని అందజేస్తారు. చెక్కు అందుకున్న రైతు తాను ఎంచుకున్న బ్యాంకులో ఎక్కడైనా డ్రా చేసుకోవచ్చు. అయితే డ్రా చేసుకునే సమయంలో తప్పనిసరిగా పట్టాదార్‌ పాసు పుస్తకం లేదా ఆధార్‌ కార్డు తప్పనిసరిగా చూపించాలి. రూ.50 వేలు దాటితే రెండు చెక్కులుగా ఇస్తారు. 

ఒక చెక్కుపై గరిష్టంగా రూ.49,990 మాత్రమే ఇస్తారు. అంతకుమించితే మరో చెక్కు ఇస్తారు. పథకం అమలులో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శికి ఐదుగురు అధికారులు సాయం చేస్తారు. ఉద్యానశా>ఖ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ మణికందన్, రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్‌ కేశవులు, సహకారశాఖ అడిషనల్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాసరావు, ఆర్థికశాఖ జాయింట్‌ సెక్రటరీ సాయి ప్రసాద్‌ సహకరిస్తారు. 

పథకం కోసం ప్రత్యేక పోర్టల్‌ 
రైతుబంధు పథకం కోసం ప్రత్యేకంగా పోర్టల్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో రోజువారీ చెక్కుల పంపిణీ సమాచారం ఉంటుంది. ఎంతమందికి చెక్కులు ఇచ్చారు, ఎంత సొమ్ము తీసుకున్నారన్న సమాచారం ఉంటుంది. అయితే సీఎంవో, వ్యవసాయ మంత్రి, కలెక్టర్లు, ఇతర అధికారులు మాత్రమే చూసేలా వారి పేర్లతో యూజర్‌ ఐడీలను సిద్ధం చేశారు. సాధారణ ప్రజలకు ఇవి అందుబాటులో ఉండవు. ప్రతీ రోజు ఏఈవో, ఏడీఏ, డీఏవోలు సాయంత్రం 6–6.30 మధ్య గ్రామసభల్లో చెక్కుల పంపిణీ వివరాలను ఈ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఫిర్యాదులు స్వీకరించే వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. మండల, ఏడీఏ డివిజన్, జిల్లా స్థాయిలో వీటిని కలెక్టర్లు ఏర్పాటు చేయాలి. రాష్ట్రస్థాయిలో ఫిర్యాదుల విభాగం ఉంటుంది. ఫిర్యాదులను 30 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top